"సార్వత్రిక భాష":- బెహరా నాగభూషణరావు.
సాహితీ కవి కళాపీఠం.
 సాహితీ కెరటాలు.
===================
తివాచీ పరచిన ప్రకృతి —
అదే హరితవనం.

ఆకుపచ్చని చీరతో ముస్తాబై,
అరవిందాలను ఒలకబోస్తూ,
ఆనందంగా నవ్వుతూ,
అందరినీ పలకరిస్తోంది తరువు.

భాషలు వేరైనా,
మతాలు వేరైనా,
కులాలు వేరైనా —
నా భాష ఒక్కటే.
అదే "సర్వజనీన భాష" అంటుంది.

ఆకు కదిలితే — సంగీతం,
సంగీతంలో — శ్రావ్యం,
శ్రావ్యతలో — మధురం.

ఆస్వాదాలన్నీ భాషవే —
అర్థం చేసుకునే మనసుంటే.

ఎండిన మొక్క — నీటిని కావాలంటుంది; అదే భాషే.
చీడపట్టిన పైరు — ఔషధాన్ని కోరుతుంది; అదే భాషే.

ఏ అవసరానికైనా
ఆ మూలాన్ని వాడుకోమంటుంది — అదే భాషే.

రాలిపోతున్న తన పండును
తెంపమంటుంది — అదే భాషే.

సృష్టి తనకిచ్చిన భాష — విశ్వవ్యాప్తం,
మమతా అనురాగాలతో మాట్లాడే వైనం.

పశుపక్ష్యాదులతో సహవాసం,
మానవునికి తొలి అవసరం.

పర్యావరణానికి మూలం,
స్నేహత్వానికి అలవాలం.

ఎవరికీ శత్రువు కాని శుభాంకురం —
జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం.


కామెంట్‌లు