శ్రావణి తీరిక సమయాలలో కథల పుస్తకాలు చదువుతుంది. వివిధ కథా మేగజైన్సుకు చందా కట్టి పోస్ట్ ద్వారా తెప్పించుకుంటుంది. తాను చదివాక ఇంటికి వచ్చిన తన బంధువుల పిల్లల చేత, స్నేహితుల చేత చదివిస్తుంది. శ్రావణి వాళ్ల ఇంటికి రోజూ దినపత్రికలు కూడా వస్తుంటాయి.
ఒకరోజు పాత పేపర్లు కొనే వాహనం శ్రావణి వాళ్ల ఇంటివద్ద ఆగింది. శ్రావణి వాళ్ల అమ్మ శర్వాణి పాత పేపర్లు అమ్ముతుంది. శర్వాణి పేపర్లు అన్నీ ఇంటిముందుకు తీసుకు వచ్చింది. శ్రావణి వాళ్ల నాయనమ్మ కథల పుస్తకాలూ తెచ్చి తూకానికి వేసింది. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన శ్రావణికి ఈ విషయం తెలుస్తుంది. బోరున ఏడ్చింది శ్రావణి. ఆ రాత్రి అన్నం కూడా తినలేదు.
"పోతే పోనీవే ఆ కథల పుస్తకాలు. నువ్వు అన్నీ చదివావు కదా! ఇంటి నిండా ఆ పుస్తకాలు ఎందుకు చెప్పు?" అన్నది నాయనమ్మ. "చుట్టాల పిల్లలకు, స్నేహితులకు ఉపయోగ పడుతున్నాయి కదా!" అన్నది శ్రావణి. "ఏం కథల పుస్తకాలు లేకపోతే వాళ్లకు టైం పాస్ కాదా! టీవీలు ఉన్నాయి. మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా!" అన్నది నాయనమ్మ. "మరి నువ్వు టీవీ సీరియల్స్ పూర్తిగా మానేసి నాకు టీవీ ఇవ్వు. నా కథల పుస్తకాలు అమ్మినందుకు నీకు ఇదే శిక్ష. తీరిక సమయాలలో నాతో పాటు కూర్చుని నాకు కథలు చెప్పు." అన్నది శ్రావణి. జన్మలో మళ్ళీ కథల పుస్తకాలు అమ్మకూడదని అనుకుంది నాయనమ్మ.
దాదాపు అందరు పిల్లలూ ఈ వయసులో మొబైల్ ఫోన్లకు బానిసలు అయితే తన కూతురు నీతి కథల పఠనం అభిరుచి చేసుకోగా ఇతర పిల్లలకూ నీతి కథలను అలవాటు చేయించుట సంతోషం అనిపించింది శర్వాణికి. తానూ తన కూతురితో పాటు ఇంటికి వచ్చిన ఇతర పిల్లలనూ కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం మొదలు పెట్టింది శర్వాణి.
భలే అమ్మాయి: - సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి