భలే పులి : సరికొండ శ్రీనివాసరాజు
 మోహనుడు అనే రాజుకు వేట పిచ్చి. అడవి జీవులను ఇష్టానుసారం వేటాడి తెచ్చి, వండించుకుని రకరకాల రుచులను ఆస్వాదిస్తూ తినేవాడు. మహారాణి ఇలా అనేది. "మీ రాజ్యంలోని అడవి జీవులే కదా మహారాజా! మీ ప్రజలే అనుకుని వాటినీ కాపాడుకుంటే బాగుంటుంది కదా!" అని. రుచి మరిగిన మహారాజు వినిపించుకోలేదు.
     ఒకరోజు మహారాజు ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటే వెనుక నుంచి ఒకp ఆగంతకుడు మోహనుని మీద దాడి చేసినాడు. వాడు శత్రు దేశపు రాజు. పరాక్రమానికి మారు పేరైన మోహనుని ప్రాణం తీస్తే ఆ తర్వాత రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చని వాడి ఆలోచన. 
     మోహనుని మీద వాడు దాడి చేసిన వెంటనే ఒక పెద్దపులి వచ్చి, ఆ ఆగంతకుని ప్రాణాలు తీసి, ఈడ్చుకుని పోయింది. ఆ చెట్టుమీద ఉన్న రామచిలుక ఇలా మాట్లాడింది. "చూశావా మహారాజా! మీరు ఆ జీవులకు కీడు చేస్తున్నా తమ ప్రాంతము రాజే అని ఆ పులి ఆలోచించి, మిమ్మల్ని రక్షించింది కావచ్చు. సాక్షాత్తూ మహారాజు అయిన మీకూ మీ ప్రాంతపు జీవుల మీద అభిమానం ఉంటే బాగుంటుంది కదా!" అని. మహారాజు సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ అడవిని సంరక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కామెంట్‌లు