నా కథ ఇదేనండోయ్:- - యామిజాల జగదీశ్


 నా పేరు లిసా గెరార్డిని Lisa Gherardini.
1479 జూన్ నెలలో ఒకరోజు ఉదయాన ఫ్లోరెన్స్‌లో శాంటా మారియా డెల్ ఫియోర్ గంటలు మోగుతున్న వేళ నేను పుట్టాను.
నా కుటుంబానికి గొప్ప మూలాలు ఉన్నాయి. కానీ మేము ధనవంతులం కాదు. మాకు మంచి పేరుంది. ఇల్లు ఉంది. 
తండ్రి ఆంటోన్మారియా Antonmaria. మాకు చేయగలిగినదంతా చేశాడు. మేము ఫ్లోరెన్స్‌లోని ఓల్ట్రార్నోలో ఉండేవాళ్ళం.
మా ఇంటిని ప్రతి రోజూ సూర్యోదయం ఎంతో అందంగా పలకరిస్తూ ఉండేది. ఈ సూర్యోదయం కిరణాలు నాకు బాగా గుర్తు. వాటిని చూడటం నాకెంతో ఇష్టం.
నాకు పదిహేనేళ్ల వయసులో, నేను ఫ్రాన్సిస్కో డెల్ గియోకొండో Francesco del Giocondo
ను వివాహం చేసుకున్నాను. అతను నాకంటే పెద్దవాడు. అతను ఓ వస్త్ర వ్యాపారి. పట్టుతోపాటు రకరకాల వస్త్రాలు అమ్ముతుండే వాడు.
అతను గౌరవనీయుడు. అనుకున్నది సాధించిన వాడు. విజయవంతుడని అనిపించుకున్నాడు. గంభీరమైన వాడు. అతని హుందాతనం నాకెంతో నచ్చేది.
మా వివాహం శృంగారభరితమైనది కాదు. కానీ మా మధ్య బలమైన బంధముంది. అనురాగానికి అద్దం పట్టే బంధం మాది. నేనిలా గొప్పలు చెప్తున్నారని అనుకోకండి. నిజమే చేస్తున్నాను, మా మధ్య పరస్పర అవగాహన ఉండేది. మాకు ఐదుగురు పిల్లలు... నేను మా ఇంటిని ఎంతో చక్కగా చూసుకుంటూ వచ్చాను.  మరణించిన వారి కోసం కొవ్వొత్తులను వెలిగిస్తుండే దానిని. జీవించి ఉన్నవారి క్షేమం కోరి ప్రార్థిస్తూ ఉండే దానిని. 
ఒక రోజు, ఫ్రాన్సిస్కో ఒక చిత్రకారుడిని పిలిపించాడు. నా రూపాన్ని చిత్రించమని కోరాడు. ఆ చిత్రకారుడి పేరు లియోనార్డో.
అతను ఇతర పురుషుల కంటే భిన్నమైన వాడు. నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎప్పుడూ నా వంక చూస్తూ ఉండేవాడు. ఈ విషయంలో కాస్తంత అసాధారణం. నా రూపాన్ని చిత్రించటం కోసమే నా వంక తదేకంగా చూసేవాడు తప్ప దురాలోచనలు కనిపించేవి కావు అతని చూపుల్లో. 
అతను డబ్బు గురించి కానీ ఇంట్లో వాళ్ళ గురించీ అస్సలు పట్టించుకునే వాడు కాడు. అతని ఏకాగ్రత అంతా నన్ను చిత్రించడంలోనే ఉండేది. మధ్య మధ్య నా ఆలోచనల గురించి అడిగే వాడు. ఆ ఆలోచనలు చెప్పమనేవాడు. వెలుతురు, నాది ఇలా ఏవేవో ప్రస్తావిస్తూ వాటి గురించి నాకు తెలిసింది చెప్పమనే వాడు.  అతను చాలా నెమ్మదిగా చిత్రించే వాడు. హడావుడి మనిషి కాడు. నిజానికి, అతను ఏ దశలోనూ కంగారుపడిపోతున్నట్లో తొందరపడినట్లో అనిపించేది కాదు. చాలా శాంతంగా ఉండేవాడు. మరో మాటలో చెప్పాలంటే ప్రశాంతతకు మారుపేరేమో అని అనుకునే దానిని. మీరెలా ఇంత ప్రశాంతంగా ఉంటున్నారని అడగాలనిపించేది. కానీ అడిగే దానిని కాదు.
నేను చాలాసార్లు అతని కోసం నిరీక్షిస్తూ కూర్చునే దానిని. నాకున్న మంచి వస్త్రాలు ధరించే దానిని. ఆభరణాలు పెట్టుకునే దానిని కాను. నేను ప్రత్యేకించి ఏదో ఒక యుగానికి అద్దం పట్టే దానిలా కాకుండా ఏ తరం వారైనా నా గురించి గొప్పగా మాట్లాడుకునేలా ఉండాలని కోరుకున్నాడు. ఈ మాటే పదే పదే నాతో చెప్పేవాడు. నువ్వొక అసాధారణ స్త్రీమూర్తివి అని అంటుండే వాడు. నన్ను చిత్రించడం పూర్తయ్యాక అతను ఆ పెయింటింగ్‌ను తనతో పాటు ఫ్రాన్స్‌కు తీసుకెళ్లాడు. అతను చనిపోయే వరకు దానిని తన వద్ద ఉంచుకున్నాడు.
ఆ పెయింటింగ్ కేవలం ఒక చిత్రం కాదు. అది ఎంతో ప్రత్యేకమైంది. ఊహాతీతమైంది. దానిని చూస్తున్నప్పుడల్లా నన్ను నేను మైమరచి పోయే దానిని. నాకన్నా ఆ పెయింటింగే ఎంతో బాగుండేదనిపించేది. అలా అంటున్నానే గానీ నా రూపన్నేగా అతను చిత్రించాడు.‌ సహజంగా ఉండేది. అందుకే బాగుండేది.
ఫ్రాన్స్ దేశస్తులు నన్ను నా భర్త పేరు మీద అంటే గియోకొండా అని పిలిచేవారు. కొందరైతే నన్ను "మోనాలిసా" అనే కొత్త పేరుతో పిలివడం మొదలుపెట్టారు.
చాలా కాలంవరకూ, నా అసలు పేరు వారికెవరికీ తెలియనే తెలీదు.
కానీ నేను ఫ్లోరెన్స్‌కు చెందిన స్త్రీని.
ఒక కుమార్తె. భార్య. ఒక తల్లి. నేను పిల్లలను కోల్పోయాను. నేను కొవ్వొత్తులను వెలిగించాను. నేను వృద్ధురాలినయ్యాను. నేను బాధపడినా క్షణాలున్నాయి. అన్నీ మరచిపోయి ప్రార్థించిన క్షణాలున్నాయి. ఎప్పుడూ బిజీగా ఉండే నగరంలో ఊహాతీతంగా నేను నిశ్శబ్ద జీవితాన్ని గడిపాను.
నేను 1542లో ఫ్లోరెన్స్ సమీపంలోని ఒక కాన్వెంట్‌లో మరణించాను. 
నాకు సమాధి లేదు. నా పక్కన చిత్రపటమూ లేదు. సందర్శకులూ లేరు.
అయినప్పటికీ ఇప్పుడు... 
ప్రపంచం నా "ముఖచిత్రం" ముందర నిలబడి నన్ను చూస్తోంది.
వారు నా కళ్ళలోకి చూసి, “నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు?” అని అడుగుతున్నట్లు అనిపిస్తుంది. వారు నన్ను "రహస్యం" అని పిలుస్తున్నారు. వారిలా అనడం వింటుంటే బలే మజాగా ఉంటోంది. అందమైన దాన్ని. శాశ్వతమైన దాన్ని. నీకు నువ్వే సాటి అని అంటున్నారందరూ నన్ను చూసి.
కానీ ఒక్క మాట.
నేను ఎప్పుడూ "రహస్యం" కాదు. నేను కేవలం ఒక స్త్రీని. ఎవరో ఒకరు ఏదో ఒక క్షణంలో, నన్ను తమ మనస్సుతో చూసి చెవిలో చెప్పే మాట బలేగా ఉంటుంది. ఆ మాటతో
ఒకింత ఆనందాన్ని పొందుతాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీకందరికీ నేను మోనాలిసా అనే  తెలిసి ఉండవచ్చు. కానీ నా అసలు పేరు లిసా గెరార్డిని. ఇదీ నా అసలు కథ.


కామెంట్‌లు