పునర్జన్మ...?:- కవి రత్న సాహిత్య ధీరసహస్ర కవి భవిష్యత్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
స్వర్గం నరకం
ఉందో లేదో తెలియదు
పుట్టిన ప్రతివారు రేపోమాపో
గిట్టక తప్పదని తెలుసు కాని
చనిపోయి తిరిగి బ్రతికిన వాడు
బ్రతికి మళ్ళీ భూమిపై  జీవించినోడు
లేడు తరతరాలుగా ఒక్కడును లేడు
కాగడాపెట్టి వెతికినా కంటికి కనిపించడు..!

కానీ కొందరు
అదృష్టవంతులు
పులినోట్లో తలదూర్చినా
సింహపు బోన్లో విసిరేసినా
విషసర్పాలు కాటేసినా
అగ్నిగుండంలో దూకినా
సురక్షితంగా బయట పడతారు..!

రైలు క్రింద వేగంగా వెళ్ళే
భారీ వాహనాల క్రింద పడి
నుజ్జునుజ్జైపోయిన వారున్నారు
సురక్షితంగా బయట పడినవారున్నారు
ఔను మరి అదృష్టమంటే అదే కదా..!

ఈ మధ్య
గుజరాత్ లోజరిగిన
ఎయిర్ ఇండియా విమానం
రెక్కలు విరిగిన పక్షిలా
కుప్పకూలి పేలిపోగా...
265 మంది ప్రయాణీకులు
ముక్కలు ముక్కలైపోయారు
ఊపిరాడక విలవిల లాడిపోయారు
మంటల్లోచిక్కి మలమల మాడిపోయారు.!

కానీ ఒకే ఒక్క ప్రయాణికుడు
మృత్యువు కోరలు చీల్చుకుని 
మృత్యుంజయుడై బ్రతికి బట్టకట్టాడు
విశ్వమంతా ఒక్కసారి విస్తుపోయేలా..!

అది కదా
పునర్జన్మంటే...
అదికదా
అదృష్టమంటే...!

అట్టి వారే కదా
అదృష్టజాతకులంటే...
అట్టి వారేకదా
నక్కను తొక్కినవారంటే...
అట్టి వారేకదా మృత్యువు తంతే
గారెలబుట్టలో పడినవారంటే..!

ఏదేమైనా ఎవరేమన్నా
చరిత్ర ఘోషిస్తుంది
జనన మరణాలు దైవాధీనాలని...
మనుషుల ప్రాణాలు
గాలిలో దీపాలని నీటిలో బుడగలని...
పుణ్యమూర్తులకే పునర్జన్మని...!



కామెంట్‌లు