రామచిలుక : సరికొండ శ్రీనివాసరాజు
 గీతాంజలి 7వ తరగతి అమ్మాయి. వాళ్ల అమ్మా నాన్నలు ఇంట్లో పంజరంలో చిలకను పెంచుతున్నారు. గీతాంజలి తీరిక సమయంలో ఆ చిలుకతో ముచ్చట్లు చెబుతూ ఆడుకుంటుంది. 
    కొన్నాళ్ల తర్వాత గీతాంజలి నాన్న ఒక కోడిని కొనుక్కొని వచ్చాడు. ఇంట్లో కోడిని కూడా పెంచుకుంటున్నారు. గీతాంజలి కోడితో కూడా కాలక్షేపం చేస్తుంది. ఆ రామచిలుక కోడి మీద ఈర్ష్య పెంచుకుంది. ఈ కోడి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనుకుంది రామచిలుక. 
     కొన్నాళ్ల తర్వాత ఒక ఆదివారం నాడు కోడిని కోసుకొని, కూర వండుకుని తిన్నారు. తన కళ్ల ముందు మంచిగా పెంచుకున్న కోడిని, నిర్దాక్షిణ్యంగా కోయడం చిలకమ్మను ఎంతో బాధ పెట్టింది. కోడి మీద జాలి వేసింది? భవిష్యత్తులో తనను కూడా ఇలా కోస్తారేమో అని భయం వేసింది. చిలకమ్మ చాలా దిగాలుగా ఉంది. ఎప్పుడూ బాధలోనే పూర్తిగా మునిగి పోయింది.
     చిలకమ్మ స్వేచ్ఛను కోరుకుంటుందని గీతాంజలి అనుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో పంజరం తలుపు తీసి చిలకమ్మను స్వేచ్ఛా ప్రవంచంలోకి పంపించింది. ఆ రామచిలుక క్రమంగా తన ఈడు చిలుకమ్మలతో కలిసి హాయిగా ఉంది. 

కామెంట్‌లు