చెడు సావాసాలు వదిలించుకో:- సరికొండ శ్రీనివాసరాజు

    "సోమూ! ఈ మార్కులు నీవేనా? బాబోయ్! నేను ఎన్నడూ చూడలేదు నీకు అన్ని సబ్జెక్టులలో ఇన్ని ఎక్కువ మార్కులు రావడం. ఎవరి దాంట్లో కాపీ కొట్టి రాసినావు చెప్పు." అన్నాడు శివ. "సోము ఈ మధ్య కష్టపడి చదువుతున్నాడు. రౌడీ వెధవలతో క్రికెట్ ఆడటం పూర్తిగా మానేశాడు." అన్నది శ్రుతి. "నేనూ ఇక క్రికెట్ జన్మలో ఆడను. తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టి, చదువు పక్కన పెట్టి, పూర్తిగా క్రికెటుకే టైం వేస్టు చేశా. ఆ రౌడీ రంగా ఆవేశంతో షాట్ కొట్టగా ఆ బాల్ నా తలకు తగిలి, పెద్ద దెబ్బ తగిలి, కోలుకోవడానికి నెలలు పట్టింది." అన్నాడు శివ. "అవునా? రంగ మూలంగా నీకు దెబ్బ తగిలిందా? మరి ఆ రౌడీ గ్యాంగ్ అంతా సోము కొట్టిన షాట్ మూలంగా నీ తలకు దెబ్బ తగిలింది అని చెప్పారు. చివరకు సోము కూడా తనవల్లే నీకు దెబ్బ తగిలింది అని ఒప్పుకున్నాడు. నీ చికిత్సకు అవసరమైన మొత్తం డబ్బులు సోమూనే ఇచ్చాడు తెలుసా?" అన్నది శ్రుతి. "ఆ రౌడీలు ఇంత పని చేశారా? అమాయకుడైన సోమూను ఇరికించారా? సోమూ! నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు తప్పు నీ మీద వేసుకున్నారు?" అన్నాడు శివ. "చిన్నతనంలో తెలుగు మాస్టర్ చెప్పిన నీతి గుర్తుకు వచ్చింది. మంచి మిత్రులను వంద రూపాయలు ఇచ్చి అయినా సంపాదించుకో. చెడ్డ వాళ్ల సహవాసాన్ని వెయ్యి రూపాయలు ఇచ్చి అయినా వదిలించుకో అని. వాళ్లు చేసిన తప్పుకు నేను డబ్బులు భరించి, దుర్మార్గులను వదిలించుకున్నా." అన్నాడు సోము. ఈ సంగతి తెలిసిన తెలుగు ఉపాధ్యాయులు సోమును మెచ్చుకొన్నాడు. శివ జరిగింది ఇంటివద్ద చెప్పాడు. శివ తల్లిదండ్రులు సోము ఇంటికి వచ్చి, జరిగింది వివరించి శివ చికిత్సకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చారు. సోము తల్లిదండ్రులు సోమును దగ్గరకు తీసుకుని మెచ్చుకున్నారు. అప్పుడు శివ ఇలా అన్నాడు. "చెడ్డవారి సహవాసాన్ని డబ్బులు ఇచ్చి నేను వదిలించుకున్నట్లు అయింది. ఇక నుంచి సోము నేను బెస్ట్ ఫ్రెండ్స్. సోము ప్రేరణతో నేనూ కష్టపడి చదువుతా." అని. అందరూ సంతోషించారు.
కామెంట్‌లు