సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -895
ధైర్యం సర్వత్ర సాధకమ్ న్యాయము
***
ధైర్యము అనగా శౌర్యం మరియు ఒక వ్యక్తి భయం లేకుండా కష్టం, ప్రమాదం, నొప్పి మొదలైన వాటిని ఎదుర్కొనడానికి వీలు కల్పించే మనసు లేదా ఆత్మ యొక్క నాణ్యత.నిర్బయత. సర్వత్రా అనగా ప్రతిచోటా అన్నిచోట్లా అంతటా ఎక్కడైనా.సాధకమ్ అనగా ఏదైనా లక్ష్యం లేదా పనిని సాధించడానికి చేసే ప్రయత్నమే సాధకమ్.
ధైర్యము వల్ల అన్ని పనులూ సాధ్యమవుతాయి అని అర్థము.
ధైర్యము  పట్టుదల మరియు సహనము అనే అంశాలను కలిగి ఉంటుంది.ధైర్యంలో ఆత్మ విశ్వాసం మరియు భయము కూడా ఉంటాయి. ఏదైనా సాధించాలంటే ధైర్యం ఉండాలి. ధర్మాచరణ, ఆశయాల కోసం జీవితాన్ని త్యాగం చేయాలన్నా ధైర్యం అనేది లేకపోతే ఆ పనులు చేయలేము.ఆ బాటలో నడవలేము.
ధైర్యమే ఒక ధర్మమని, ఒక సద్గుణము అని, నైతిక శ్రేష్టతకు గుర్తు అని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అన్నాడు.నిర్లక్ష్యం మరియు పిరికితనమును నియంత్రించే ఒకానొక గొప్ప సద్గుణము ధైర్యమే అంటారాయన.
ధైర్యం అంటే దేనికి భయపడాలో ,దేనికి భయపడకూడదో, భయాన్ని అధిగమించి ముందుకు అడుగులు వేయడానికి స్థిరమైన, ఆచరణాత్మక వ్యూహాలను  అందించి ప్రతిరోజును ఫలవంతంగా బలోపేతం చేయగలిగే నైపుణ్యాన్ని ధైర్యం అనవచ్చు.
ధైర్యము అనేది రెండు రకాలుగా ఉంటుంది.ఒకటి శారీరక ధైర్యం.ఎంత బాధనైనా అనగా శారీరక నొప్పి, కష్టాలు, ప్రమాదం, అనిశ్చితి,మరణం లేదా మరణ ముప్పు  మొదలైనవి ఎదుర్కునే సంసిద్ధతను శారీరక ధైర్యం అంటారు.
 రెండవది నైతిక ధైర్యం.అనగా అవమానం, అపవాదు,ప్రజా వ్యతిరేకత, నిరుత్సాహం, వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొని సరిగ్గా వ్యవహరించే సామర్థ్యం.
 "ధైర్యే సాహసే లక్ష్మి "అనే సామెత ఉంది. ధైర్యము ఎక్కడ ఉంటుందో సాహసము అక్కడ ఉంటుంది. ఇలా ధైర్య సాహసాలు ఉన్న చోట లక్ష్మి ఉంటుందని మన పెద్దవాళ్ళు తరచూ ఈ ధైర్యం సర్వత్ర సాధకమ్ " న్యాయమును ఉటంకిస్తూ ఉంటారు.
 ధైర్యము ఎందుకు ఉండాలో ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకొని చెప్పుకుందాం.
 మనమంతా గ్రహించవలసిన అంశం ఏమిటంటే గడుస్తున్న రోజులన్నీ ఒకేలా ఉండవు.  మనం ఎప్పుడూ సంతోషాన్నే కోరుకుంటాం. అలాంటి సంతోషాలు ఎన్ని పొందినా ...అవి శాశ్వతం కాదని అనిపిస్తుంది. ఏదైనా బాధాకరమైన సంఘటన ఎదురైనప్పుడు, కష్టం కలిగినప్పుడు  మనసును దిటవు పరచుకునే ధైర్యం కావాలి.సంతోషం ఎలాగైతే ఎల్లకాలం ఉండదో బాధలు కూడా ఎల్లకాలం ఉండదనే  తలంపును నమ్మాలి. అప్పుడే మనసు ధైర్యం కోల్పోకుండా ఉంటుంది.
అనుకున్నది ఏ పనైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఇక్కడ ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనం అనుకున్నది సమాజ హితంగా, పరులకు మేలు చేసే విధంగా,నిస్వార్థంగా, నిష్కల్మషంగా ఉండాలి.ఇంకా నైతిక విలువలు, ఓర్పు, కష్టపడే తత్వం,ఇంద్రియాల నిగ్రహంతో మనం చేసే పనులకు ధైర్యం తోడుగా నిలుస్తుంది.
మహా మహా నాయకులు, స్వాతంత్ర్య సమర యోధులు , సంఘ సంస్కర్తలు మొదలైన వారంతా ఎంతో ధైర్యంతో సమస్యలపై పోరాడి సమాజ యవనికపై శాశ్వతంగా నిలిచిపోయారు.
ధైర్యం వల్ల అంతటా అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయనేది ఈ" ధైర్యం సర్వత్ర సాధకమ్ న్యాయము ద్వారా గ్రహించాం.కాబట్టి మనం మంచి పనులు చేయాలనే సంకల్పంతో ధైర్యంగా అడుగు వేద్దాం.ఆ వెనుక అడుగులు తప్పకుండా మనల్ని అనుసరిస్తాయి.అదే కదా! మనకూ కావాల్సింది.

కామెంట్‌లు