మాయగాడు- మాధవుడు

    "అబ్బబ్బ! ఈ నల్లనయ్యతో నాకు పెద్దచిక్కొచ్చి పడింది.ఎక్కడకీ పోకు,ఎవరిళ్ళకూవెళ్ళకని,వాడలలో వారితో అపవాదులు వద్దనీ నీతండ్రి నందరాజుకు తెలిసి వారు మందలిస్తే,బిక్కముఖంపెట్టుకొంటావని , ప్రొద్దుటినుంచీ నా చీరకొంగుకు గట్టిగా ముడిపెట్టుకొనే, పనులుచెేసుకొంటున్నాను.అయినా  ఎప్పుడెలా తప్పించుకుపోయావోకదా! .గోపవనితలన్నారంటే అనరుమరి. కన్నతల్లికళ్ళు కప్పినవాడివి ,లోకంకళ్ళెంతలో కప్పుతావు?"
    "రానీ!దొంగభడవని, అతడి తండ్రికిచెప్పి.చెవిమెలేయించేస్తానీరోజు."  చిరచిరలాడిపోతోంది యశోద.అప్పటికే బుజ్జికన్న బువ్వతినే వేళదాటిపోయిందని,బంగారు గిన్నెలో బువ్వకలిపి,గిన్నె చెేతపట్టి,వీధులంట బిడ్డను వెతుకుతూ తిరిగి తిరిగి వచ్చిందేమో,బిడ్డకనపడలేదని,ఆకలితో ఎక్కడ అలమటిస్తున్నాడో అన్న ఆందోళనను చీకాకుగా వున్న యశోదను చూసి,
    "అదేమిటి యశోదా? అలా నీలో నువ్వేమాట్లాడుకొంటున్నావు?అదిసరే నా చిన్న కన్ననలా నీరకొంగుతో గట్టిగా బంధించావేమాటి? పాపంవాడి ముఖంచూడు ఎంతగా చిన్నపోయిందో! ముందు కొంగుముడివిప్పు"
చిరుకోపం చూపించాడు నందుడు యశోదపై.
    "ఏమిటి అంటున్నారు మీరు?నాచీరకొంగునే వున్నాడా కన్నయ్య?అలావుంటే,ఈ మాయదొంగకోసం ఊరువాడ వెతుకుతూ,అగుపడ్డవారినెల్లా "మా కృష్ణయ్యను చూసారా? ఎక్కడైనా కనపడ్డాడా? కొంపదీసి ఈ పసివాడు కాళిందీనది ఒడ్డుకుకానీ పోలేదుకదా?  అనుకొంటూ పిచ్చిదానిలా తిరిగానే!మరి ఏఒక్కరైనా " అయ్యో! అదేమిటమ్మా!కొంగున బిడ్డనుకట్టుకొని ఊరంతా వెతుకుతున్నావని అనలేదేమిటి?అడిగో నీబిడ్డ నీ కొంగునే ఉన్నాడుకదా!"అని చెప్పలేదేమిటి? అంతా చిత్రంగావుంది."అంది బుగ్గలు నొక్కుకుంటూ యశోద .
    "నా తనయుడు నారాయణ స్వరూపుడు .అంతతొందరగా అందరికీ కనిపిస్తాడా యశోదా?"
   "ఏమిటి?ఎంతనారాయణుడైనా, అమ్మదగ్గరా దాగుడుమూతలు? 
మీరొకసారి వెనక్కితిరిగి కళ్ళుమూసుకోండి.వెన్నదొంగ చెవిమెలిపెడతాను అనీ నందునితో అంటూ."హన్నా!చిన్నా!అమ్మదగ్గరా నీ ఆకతాయితనం?"
అంటూ కన్నయ్య చెవినందుకోబోయింది యశోదమ్మ.
   "నాన్నా! నాన్నా!చూడునాన్నా!అమ్మ.నాచెవిమెలిపెడుతుందట.నాకు చెవినొప్పిపుట్టి ఏడుస్తుంటే ,మళ్ళీ తనే నాకంటే గట్టిగా ఏడుస్తుంది. తను చెవిమెలిపెట్టినపుడు ఏడవనుకానీ,తనేడిస్తే,నేనంతకన్నా గట్టిగా నేనేడుస్తానుకదా!వద్దని చెప్పండినాన్నా!"అన్నాడు కృష్ణయ్య.
   "ఆ ...ఆ ఆగు యశోదా!నా ఎదురుగానే నాతండ్రిమీద నీ దౌర్జన్యమా?ఎంతధైర్యంనీకు? విన్నావా?నీబిడ్డ ఏమన్నాడో?"వాడికి నీపైన ఎంతటి అనురాగమో? నీజన్మ ధన్యమయినది యశోదా!ఎంతటి పుణ్యాలపంటవోకదానీవు?"అన్నాడు నందుడు.
    "హారి మాయ భడవా!ఈమాటలన్నీ ఎక్కడ నేర్చేవురా నాకన్నా? ఉట్టిట్టినే నిన్ను భయపెట్టానురా నాన్నా!నిన్ను శిక్షించవలసివస్తే,నన్నునేను శిక్షించుకొంటానే కానీ నీజోలికొస్తానా"!అంటూ కొడుకును గుండెలకు హత్తుకొని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది యశోదమ్మ.
    "అమ్మ ముద్దులవర్షంలో తడిసిన ముద్దులకృష్ణుడు, "మరి నీముద్దులేవి నాన్నా!"అన్నాడు  తడ్రికి తన రెండో బుగ్గచూపిస్తూ! నందరాజు అమాంతం కొడుకు బుగ్గలపై ముద్దులవర్షంకురిపించి, గబాలున భుజాలపైకెత్తుకొన్నాడు కొడుకుని..క్రిష్ణయ్య కిలకిలా నవ్వుతూ,యశోదమ్మకు వెక్కిరింతగా నాలుక చూపించాడు. ఆ తండ్రీ,కొడుకులను కంటినిండుగా చూసుకొంటూ,"నరులదృష్టికి నాపరాయి పగులుతుందట.నా  దృష్టికూడా తగలకూడదు నాచిన్నికన్నయ్యకు."అనకొంటూ, సంతోషంతో చెమ్మగిల్లిన కనులతో మెటికలు విరుచుకుంది యశోదమ్మ.
          

కామెంట్‌లు