సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-889
"ద్రవ్యవచ్చోపచారః న్యాయము
*****
ద్రవ్య అనగా పదార్థము, వస్తువు లేదా అస్తిత్వం.వచ్ అనగా మాట, వచనము, కోరిక, వాక్యము.ఉపచార అనగా సేవ లేదా మర్యాద, మరొకరికి సహాయం చేయడం లాంటి అర్థాలు ఉన్నాయి.
"వస్తువును బట్టి గౌరవము వస్తుంది" అని అర్థము.
వస్తువును బట్టి గౌరవము ఎలా వస్తుందో  తెలుసుకునే ముందు వస్తువు అంటే ఏమిటో తెలుసుకుందాం.
ద్రవ్యం యొక్క అర్థం జైన తత్వ శాస్త్రం ప్రకారం విశ్వం ఆరు శాశ్వతమైన పదార్థాలతో రూపొందించబడింది. అందులో 1.చైతన్యం లేని జీవులు లేదా ఆత్మలు( జీవ) చైతన్యం లేని పదార్థము ( పుడ్గల)చలన సూత్రం (ధర్మము) విశ్రాంతి సూత్రం (అధర్మం) స్థలం ( ఆకాశం) మరియు సమయం ( కాల) అని వుంది.
ద్రవ్యము అనగా ధనమని సామాన్య అర్థం కూడా ఉంది.కానీ పృథ్వి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము,కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు అనే అర్థాలు కూడా ఉన్నాయి.
తత్వ శాస్త్రంలో ఉనికి యొక్క పదార్థాన్ని కలిగి వున్న జీవి యొక్క వర్గాలను వివరించడానికి దీనిని ఉపయోగిస్తారు.
ఆయుర్వేద వైద్య విధానంలో ద్రవ్యం అనేది ఒక వ్యాధి, లేదా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే ఔషధం లేదా ఇతర పదార్థము.ద్రవ్యానికి గుణము మరియు కర్మ (చర్య) ఉంటాయి.
శక్తి తత్త్వశాస్త్రం ప్రకారం ద్రవ్యం అనేది త్యాగ పదార్థాన్ని సూచిస్తుంది. పంచరాత్ర పదకోశంలో ద్రవ్యం అనేది పూజలో ఉపయోగించే వస్తువులను సూచిస్తుంది. వైష్ణవ పదకోశంలో ద్రవ్యం అంటే భౌతిక మూలకాల సముదాయం. బౌద్ధ మతంలో ద్రవ్యం సంపదను సూచిస్తుంది.
 ఈ విధంగా ద్రవ్యం అనే పదం ధనముతో పాటు చాలా విస్తృతమైన అర్థాలను, 43రకాల నిర్వచనాలను కలిగి ఉంది.
 ఇలా ద్రవ్య లేదా వస్తువును ఆర్థిక శాస్త్రంలో కరెన్సీగానూ, భౌతిక శాస్త్రంలో పదార్థం లేదా అస్థిత్వం గానూ, ఆయుర్వేదంలో ద్రవ్య గుణం గానూ  చెప్పడం జరిగింది.
 వస్తువును బట్టి గౌరవము అనగా ఆయా వస్తువుల వినియోగాన్ని బట్టి,అవి దొరికే దానిని బట్టి,వాటి యొక్క చారిత్రక నేపథ్యాన్ని బట్టి, వ్యక్తిగత నమ్మకాలు, నిర్ణయాన్ని బట్టి, వస్తువు యొక్క స్థితిని బట్టి విలువ లేదా గౌరవం ఉంటాయి.
 సామాన్య ఉదాహరణగా దీనిని తీసుకున్నట్లయితే నేడు బంగారం ఎంత విలువైందో, ఎంత ఖరీదైనప్పటికీ దానిని అక్షయ తృతీయ నాడు కొని ధరించడం ఎంత గౌరవంగా ఉంటుందో  మనం చూస్తూనే ఉన్నాం.
 కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే బంగారం కంటే విలువైనవి  ఏమిటో తెలుస్తాయి. అవే పంచ భూతాల లోని భూమి, గాలి, నీరు.అవే కాకుండా మనిషికి ఉండాల్సిన సామాజిక విలువలు,నీతీ నిజాయితీ, సంస్కారం, సంస్కృతి సంప్రదాయాలు. ఇవే మానవ జీవితంలో అత్యంత విలువైనవిగా చెప్పుకోవచ్చు.
 ఇవే కాకుండా మూడు అమూల్యమైన, వెలకట్టలేనివి ఉన్నాయి.అవేంటో చూద్దాం ఒకటి మన శరీరం. రెండు, మూడు మనకు దేహాన్ని ఇచ్చి,మన కోసం ,మన భవిష్యత్తు కోసం అనుక్షణం ఆరాటపడే తల్లిదండ్రులు. 
ఈ ద్రవ్యవచ్చోపచారః న్యాయమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అత్యంత విలువైన ఈ దేహానికి అత్యున్నత గౌరవం లభించాలంటే  వ్యక్తిత్వం పూవులా గుబాళించాలి. కళ్ళలో కరుణ, చేతల్లో మానవత్వం, మనసులో ఆశయం.. మొత్తంగా "పరోపకారార్ధం ఇదం శరీరం" అన్న చందంగా జీవితాన్ని సాగిస్తే సజీవమైన వస్తువుగా  ఈ సమాజంలో  గుర్తింపు గౌరవం లభిస్తాయి.
 తల్లిదండ్రులు ఇచ్చిన ఈ విలువైన దేహంతో అన్నీ మంచి పనులను చేస్తూ అందరి మెప్పు, గౌరవం పొందుదాం.

కామెంట్‌లు