సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-908
"పుత్రేణ కిం ఫలం యోవై పితృ దుఃఖాయ వర్తతే" న్యాయము
****
పుత్రేణ అనగా కుమారుని ద్వారా,కుమారునితో.కిం అనగా  ఏమిటి? ఏది?. ఫలం అనగా ఫలితం, ప్రయోజనం, లాభం,పండు. యోవై పితృ అనగా తండ్రి,తండ్రి వైపు.దుఃఖాయ అనగా దుఃఖానికి, బాధను కలిగించే దానికి, వేదనకు. వర్తతే అనగా ఉన్నది, ఉంది అని అర్థాలు ఉన్నాయి.
తండ్రిని దుఃఖ పెట్టే కొడుకు లేదా పుత్రుని వల్ల ఏమి ప్రయోజనము ఉన్నది? అనగా ఏమి లేదు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి పుత్ర సంతానం గురించి,పుత్రులలోని రకాల గురించి తెలుసుకుందామా!
పున్నామ నరకము నుండి రక్షించే వాడే పుత్రుడు అంటుంటారు మన పెద్దలు. అందుకే అనగా మన భారతీయ కుటుంబ వ్యవస్థలో పుత్ర సంతానానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.ఆడపిల్లల తల్లిదండ్రులు ఒకరు, ఇద్దరూ, ముగ్గురూ ఇలా కనడానికి కారణం మగ సంతానం కోసమే. కేవలం పున్నామ నరకము నుండే కాకుండా వృద్ధాప్యంలో అతడు తమకు ఆసరా అవుతాడనే ఆలోచన కూడా ఉంది.
అలాంటి పుత్రులు లేదా కొడుకులలో  ఐదు రకాల పుత్రులు ఉంటారని  సనాతన ధర్మం మరియు శాస్త్రం చెప్తోంది. వారెవరో చూద్దాం.
1.శత్రు పుత్రుడు;-
ఇతడు చిన్నతనం నుంచే తండ్రి చేసే ప్రతి పనికి అడ్డుతగులుతూ,ప్రతి దానినీ వ్యతిరేకిస్తూ  తండ్రిని బాధించడమే పరమావధిగా పెట్టుకునే పుత్రుడు.ఇతడి వల్ల తండ్రికి జీవితాంతం దుఃఖమే.ఎందులోనూ  ఆనందం కలిగించడు. అందుకే ఏ ముహూర్తంలో పుట్టాడో కానీ తండ్రికి ఆజన్మ శత్రువు అంటుంటారు.ఎందుకంటే  తండ్రి మరణించేంత వరకూ బాధిస్తూ,బాధ పెడుతూనే ఉంటాడు.అందుకనే ఇతడిని శత్రు పుత్రుడు అంటారు.
2.మిత్ర పుత్రుడు:-
ఇతడిని కన్న తండ్రి అదృష్టవంతుడు. ఎందుకంటే ఇతడు బాల్యం నుంచే తండ్రిని గమనిస్తూ , తండ్రితో ఒక స్నేహితుడిలా బాగా కలిసి మెలిసి ఉంటాడు. ఇతడు తండ్రికి ఇచ్చే సంతోషం అంతా ఇంతా కాదు.గత జన్మలో ఆప్త మిత్రుడే ఈ జన్మలో కొడుకుగా పుట్టాడేమో అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే ఇలాంటి కొడుకును మిత్ర పుత్రుడు అంటారు.
3. సేవక పుత్రుడు:-
మూడవ రకం ముచ్చటగా సేవక పుత్రుడు.ఇతడు తండ్రి చెప్పిన మాట జవదాటకుండా తు.చ.తప్పక పాటిస్తాడు. చదువు సంధ్యలు, వృత్తి నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు పెద్దగా లేకపోయినా తండ్రి చేసే పనులను ఇతడు కూడా చేస్తూ వుంటాడు. చూసే వాళ్ళకి తండ్రి చాటు బిడ్డలా,తలలో నాలుకలా కనిపిస్తాడు. ఇతన్ని చూస్తుంటే మరొకటి కూడా అనిపిస్తుంది.ఇతడు తండ్రికి సేవ చేసేందుకే పుట్టాడో ఏమో అనిపిస్తుంది.  జీవితాంతం నమ్మిన సేవకునిలా, సేవకునికి యజమానికి మధ్య ఉన్న కృతజ్ఞతా పూర్వక బంధం సేవా బంధంలా కొనసాగుతుండటం గమనించవచ్చు.అలా గమనించే కొందరు ఇలాంటి పుత్రుడిని సేవకా పుత్రుడు అని అంటారు.
4.కర్మ పుత్రుడు:-
ఇతడు కేవలం ఒక పుత్రుడుగా తండ్రి యొక్క కర్మ కాండలు చేయడానికే పనికి వస్తాడు. చిన్నప్పటి నుండి దాదాపుగా తండ్రికి దూరంగానే ఉంటాడు. అప్పుడప్పుడూ తప్ప మిగతా సమయాల్లో,సందర్భాల్లో ఈ పుత్రుడు తండ్రికి చాలా వరకు దూరంగా ఉంటాడు. తండ్రికి ఉత్తర క్రియలు చేయడానికి మాత్రమే పుడతాడన్న మాట.అందుకేే ఇతడిని కర్మ పుత్రుడు అంటుంటారు.
5.నిజ పుత్రుడు:-
ఇతడు చివరిగా ఐదవ రకము  పుత్రుడు.ఇతడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినట్లు అన్నట్లుగా ఉంటాడు. ప్రతి పని తండ్రి మనసును సంతోషం పెట్టేలా‌ ఉంటుంది.ఇతడిని విడిచి తండ్రి క్షణం కూడా ఉండలేడు. ఇతడు కూడా తండ్రిని వదిలి పెట్టి ఉండడు.ప్రతి క్షణము,ప్రతి పనిలో తండ్రిని గుర్తు చేసుకుంటూ తండ్రిని అనుసరిస్తూ , తండ్రి లాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో మంచి గుణాలు కలిగి వున్న పుత్రుడిని నిజ  పుత్రుడు అంటారు..
 పుత్రులను కన్న తల్లి తండ్రులు ఈ ఐదు రకాల పుత్రులలో  ఏ రకం వారో గమనించుకోవచ్చు.
ఇక విషయానికి వద్దాం. మనం చెప్పుకునే  "పుత్రేణ కిం ఫలం యావై పితృ దుఃఖాయ వర్తతే" న్యాయాన్ని  మొదటి రకం శత్రు పుత్రుడితో  పోల్చవచ్చు.
ఇలా తండ్రిని దుఃఖ పెట్టే కొడుకు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే వేమన "తల్లిదండ్రుల మీద మీద దయలేని పుత్రుండు/పుట్టనేమి వాడు గిట్టనేమి / పుట్టలోని చెదలు పుట్టవా? గిట్టవా? / విశ్వదాభిరామ వినురవేమ!"
ఆ విధంగా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, దుఃఖ పెట్టే పుత్రుడు శత్రువుతో సమానం. అలాంటి వాడి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.పుట్టలో పుట్టి చచ్చే చెదలాంటి వాడని భావించాలి. ఇలాంటి పుత్రుడిని కన్న తల్లి తండ్రులది దురదృష్టమని చెప్పవచ్చు. కాబట్టి చిన్నప్పటి నుంఛే మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుపుతూ మానవీయ విలువలతో పెంచాలి. అయినా అలా మారిపోతే అది వాడి పూర్వ జన్మ లలో భయంకరమైన శత్రుత్వం కలవాడని భావించాలి.

కామెంట్‌లు