పుస్తక పఠనం:- - యామిజాల జగదీశ్
 గ్లామరుకి పెట్టింది పేరు మర్లిన్ మన్రో. కానీ ఆమెకు పుస్తక పఠనం పట్ల ఉన్న ఆసక్తి ఎక్కువనే విషయం కొందరికే తెలుసు. చదవటం పట్ల లోతైన ప్రేమ ఉంది. ఇది ఆమె వ్యక్తిత్వంలో చాలా గాఢమైన కోణాన్ని వెల్లడిస్తుంది.
మిరుమిట్లు గొలిపే హాలీవుడ్ ఇమేజ్‌కి మించి పదునైన తెలివితేటలు, జ్ఞానానికి తీరని దాహం గల స్త్రీ మర్లిన్ మన్రో. ఆమె వ్యక్తిగత లైబ్రరీలో కవిత్వం, సాహిత్యం మొదలుకుని రాజకీయాలు, మనస్తత్వశాస్త్రం తత్వశాస్త్రానికి సంబంధించి వందల పుస్తకాలు ఉండేవి.
జేమ్స్ జాయిస్, లియో టాల్‌స్టాయ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి ప్రముఖుల పుస్తకాలు నిత్యమూ చదువుతుండే వారు. ఆమె ఏకాంత క్షణాలలో తప్పనిసరిగా పుస్తకం చదివేవారు. ఏదో ఒక పుస్తకంలో మునిగి పోయేవారు.
మన్రోకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ ఫోటోలలో ఒకటి ఆమె జేమ్స్ జాయిస్ రాసిన యులిస్సెస్ చదువుతుంటం. పుస్తకాలతో ఉన్న ఈ నిశ్శబ్ద క్షణాలు ఆమెకు ఎంతో ఊరటనిచ్చేదీ పుస్తక పఠనం అలవాటు. ఆమె స్పష్టతను కనుగొనగల, మేధోపరంగా తనను తాను సవాలు చేసుకోగల, జీవితంలోని సంక్లిష్టతలను ప్రతిబింబించగల స్థలం ఏదైనా ఉందంటే అది... ఏదో ఒక పుస్తకాన్ని చదవటమే. ఆమె ఏదో ప్రదర్శన కోసం చదివేవారు కాదని, నేర్చుకోవాలనే, ఎదగాలనే నిజమైన కోరికతో చదవారని ఆమె గురించి తెలిసిన సన్నిహితుల మాట. 
మన్రోకు, సాహిత్యం కేవలం వినోదం కాదు;  సెలబ్రిటీల గందరగోళం మధ్య అది ఒక గొప్ప శక్తిగా నిలిచింది.
వ్యక్తిగత అభివృద్ధికి ఆమెకున్న విస్తృత నిబద్ధతలో పుస్తకాల పట్ల ఆమెకున్న ప్రేమ ఓ భాగం. ఆమె న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో లీ స్ట్రాస్‌బర్గ్‌తో నటనను అభ్యసించారు. అక్కడ లోతైన ఆత్మపరిశీలన, భావోద్వేగ సత్యం నటనకు కేంద్రం. 
మర్లిన్ ఓమారు ఇలా చెప్పారు..."ఒక కెరీర్ అద్భుతమైనది, కానీ మీరు చల్లని రాత్రి హాయిగా సాగటానికి పుస్తకం చదవడంలోని ఆనందమే ప్రత్యేకం" అని.
ఆమె పుస్తకప్రపంచం ఆలోచనాత్మకమైన, జిజ్ఞాస, లోతైన మానవ ఆత్మ ఉందని మనకు గుర్తు చేస్తుంది. ఈ పుస్తక పఠనం ఆమె అంతర్దృష్టి ప్రతిధ్వనులని గట్టిగా చెప్పవచ్చు.

కామెంట్‌లు