1777 చివరలో అమెరికా స్వాతంత్ర్య యుద్ధం తీవ్రమైన దశలోకి ప్రవేశించింది. బ్రిటిష్ సేనలు ఫిలడెల్ఫియాను ఆక్రమించగా, అమెరికా సైన్యం వెనక్కు తగ్గింది. ఈ పరిస్థితుల్లో జనరల్ జార్జ్ వాషింగ్టన్ తన సైన్యంతో కలిసి పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ ప్రాంతంలో శీతాకాలపు శిబిరాన్ని ఏర్పాటు చేశాడు.
ఈ కాలం యుద్ధ క్షేత్రంలో గెలుపు కంటే గొప్పగా, ఓ దేశం అంకురించడానికి పునాదులను వేసిన కాలంగా చరిత్రకెక్కింది.
1777 డిసెంబరు 19న వ్యాలీ ఫోర్జ్ చేరుకున్న వాషింగ్టన్ సైన్యం, చలితో, ఆహార కొరతతో, వ్యాధులతో పోరాడాల్సి వచ్చింది.
ఈ స్థలం వ్యూహాత్మకంగా శత్రువుల కదలికలను గమనించేందుకు అనుకూలంగా ఉండటమే కాక, పునఃశక్తి సమీకరణకు అనువైనదిగా కూడా నిలిచింది. సైనికుల వద్ద సరైన దుస్తులు లేకపోవడం, ఆహారం సరఫరాలో ఘోర వైఫల్యం, వ్యాధుల ప్రభావం వల్ల సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిస్థితుల మధ్య వాషింగ్టన్ ఒక సైనిక నాయకుడిగా కాదు, ఒక మానవతా నాయకునిగా ఎదిగాడు.వాషింగ్టన్ నాయకత్వం చరిత్రలో ఓ ముఖ్యమైన పాఠంగా నిలిచింది. సైనికులకు నిత్యం ధైర్యం చెప్పడం, అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం, క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసే యత్నం చేయడం…ఇవన్నీ వాషింగ్టన్ లోని లోతైన దృఢ సంకల్పాన్ని ప్రతిబింబించాయి.
1778 ప్రారంభంలో వ్యాలీ ఫోర్జ్‌కి వచ్చిన బారన్ ఫ్రెడరిక్ వాన్ స్ట్యూబెన్, సైనిక శిక్షణా విధానాలను నూతనంగా పరిచయం చేశాడు.వాన్ స్ట్యూబెన్‌కి వాషింగ్టన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, సైనిక శక్తిని పునర్నిర్మించేందుకు సహకరించాడు. ఇది మాన్‌మౌత్ (Monmouth) యుద్ధంలో సైన్యానికి విజయాన్ని తేవడానికి బలంగా మారింది. వాషింగ్టన్ హెడ్‌క్వార్టర్స్
నేడు వ్యాలీ ఫోర్జ్ పార్కులో ప్రముఖ ఆకర్షణగా నిలిచిన ఈ భవనం, అప్పట్లో వాషింగ్టన్ కుటుంబ నివాసంగా ఉండేది.
అక్కడి నుంచే ఆయన సైనిక వ్యూహాలు రూపొందించాడు, లేఖల ద్వారా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చాడు,శిబిర నిర్వహణను పర్యవేక్షించాడు.
వ్యాలీ ఫోర్జ్‌లో వాషింగ్టన్ పాత్ర ఓ చరిత్ర, ఓ గాథ, ఓ దిక్సూచి.
ఆయన నిర్దాక్షిణ్యంగా ఎదురైన సంక్షోభంలో నిలబడి, దేశభవిష్యత్తుకు కొత్త మార్గం చూపాడు.
వాషింగ్టన్ అంటే ఒక నాయకుడి రూపం మాత్రమే కాదు, దేశం ఆవిర్భవించేదాకా నిలబడే ధైర్యం.నాయకుడు అనే వ్యక్తి ఓ స్ఫూర్తిగా, ధైర్యాన్ని నింపే వాడుగా,కష్టకాలంలో అండదండగా ఉంటూ శతృమూకలపై వ్యూహప్రతి వ్యూహాలు పన్నుతూ తనను నమ్ముకున్న వారికి మార్గానిర్దేశనం చేస్తూ నాయకత్వం వహిస్తే ఓటమి అన్నపదం దరిదాపులకు కూడా రాదని చరిత్రలో జార్జ్ వాషింగ్టన్ నిరూపించి చరితార్థుడిగా నిలిచారు. అందుకే అమెరికా ప్రజలు ఇప్పటికీ,ఎప్పటికీ ఆయనకు జేజేలు పలుకుతారు.
ఓ నాయకత్వ గాథ…:- -ఎస్.వి.రమణా చార్య,సీనియర్ జర్నలిస్ట్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి