మంచి రోజులు వచ్చాయి : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రుతి అనే కొత్త అమ్మాయి 8వ తరగతిలో చేరింది. ఆ తరగతిలో మొదటి ర్యాంకు అమ్మాయి వందన. శ్రుతి నల్లగా ఉంటుంది. ఆ కారణంగా వందన శ్రుతిని హేళన చేయడం మొదలు పెట్టింది.  తాను మాత్రమే కాదు మరో కొంతమంది స్నేహితులను పోగేసుకుని శ్రుతిని హేళన చేయడం శ్రుతి మించింది. రకరకాల నల్లని వస్తువుల పోలికలతో శ్రుతిని వెక్కిరిస్తున్నారు. రాను రాను ఆ హేళనలు ఎక్కువయ్యాయి. అమ్మాయిలకు తోడు అబ్బాయిలు కూడా హేళన  చేయడం మొదలు పెట్టారు. కానీ శ్రుతి వీటిని పట్టించుకోకుండా తన చదువు తాను చదువుకుంటుంది.
     శ్రుతితో స్నేహం చేసింది స్రవంతి.  "శ్రుతీ! నువ్వు చాలా గ్రేట్. అంతమంది కలిసి, కుక్కల్లా మొరుగుతూ నిన్ను హేళన చేస్తున్నా నువ్వు పట్టించుకోవడం లేదు. ఈ సంగతి టీచర్లకు చెపితే బాగుంటుంది కదా! ఆ కుక్కల భరతం పడతారు. నువ్వు మౌనంగా ఉండటం నాకు నచ్చలేదు." అన్నది స్రవంతి. "చూడు స్రవంతి! నాకు ఆవగింజయినా బాధ లేదు. నాలుగు రోజులు అలా ఎంజాయ్ చెయ్యనీ! వాళ్ళ నోళ్ళు మూత పడే రోజులు ఎప్పుడో వస్తాయి." అన్నది శ్రుతి. స్రవంతికి ఈ సమాధానం నచ్చలేదు.
       స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థుల మధ్య ఆటల్లోనూ, కళలలోనూ పోటీలు మొదలయ్యాయి. చిత్ర లేఖన పోటీలు జరుగుతున్నాయి. అదే సమయంలో జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించినారు. వివిధ పోటీలను ఆసక్తిగా గమనిస్తున్నాడు. శ్రుతి గీస్తున్న బొమ్మలు చూసి ఆశ్చర్యపోయారు. అద్భుతం.  ఈ వయసులోనే ఇంత అందంగా బొమ్మలు వేస్తుంది. భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు సాధిస్తుందో. కలెక్టర్ శ్రుతిని దగ్గరకు తీసుకుని అభినందించారు. అప్పటికప్పుడు పదివేల రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. వందన కుళ్ళుకుంటుంది. ఇన్నేళ్ళ నుంచీ తాను క్లాస్ ఫస్ట్ వచ్చినా ఇంత పెద్ద బహుమతి అందుకోలేదు. స్రవంతి శ్రుతితో ఇలా అన్నది.
     మిగతా విద్యార్థులు ఆశ్చర్యపోయారు. "అక్కా! నువ్వు అన్నట్లే నిన్ను హేళన చేస్తున్న అందరి నోళ్ళూ మూతపడే రోజులు వచ్చాయి. నువ్వు చాలా గ్రేట్. నీలాంటి గొప్ప స్నేహితురాలు నాకు దొరకడం నా అదృష్టం." అని. శ్రుతికి మంచి రోజులు వచ్చాయి 

కామెంట్‌లు