శంకరయ్య వంకరయ్య- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 శంకరయ్య చాలా మంచివాడు. బాగా ఒళ్ళు వంచి పని చేసేవాడు. వచ్చిన దాంతో బాగా సంతోషంగా బతికేవాడు.
శంకరయ్య పక్క ఇంటిలో వంకరయ్య అనే వాడు ఉండేవాడు. అతను చాలా చెడ్డవాడు. సోమరిపోతు. పని చేయకుండానే పైసలు కురవాలి అనుకునేవాడు. ఎదుటివాడు బాగు పడితే అస్సలు సహించేటోడు కాదు.
ఆ ఏడు వానాకాలంలో వానలు బాగా పడ్డాయి.
వంకరయ్య సోమరిపోతు గదా... దాంతో వారానికి ఒకసారి చుట్టపు చూపుగా పొలానికి పోయేవాడు. పోయినా ఏమీ పట్టిచ్చుకొనేవాడు కాదు. దాంతో పంటంతా పురుగులు తినేశాయి. అందరికీ ఎకరానికి ముప్పయి మూటలు పండితే వంకరయ్యకు మూడు మూటలు కూడా రాలేదు.
కానీ శంకరయ్య అలా కాదు.
ఎప్పుడూ పొలంలోనే ఉంటూ మొక్కలని చిన్న పిల్లల్లా పెంచి పెద్ద చేశాడు. సమయానికి ఎరువులు వేశాడు. పురుగులు వచ్చినేవి వచ్చినట్టు ఏరి వేశాడు. మందులు చల్లాడు. దాంతో పంట విరగకాసింది. ఊరిలో అందరికన్నా పది మూటలు ఎక్కువే వచ్చాయి. పంటనంతా తీసుకువచ్చి మూటలు కట్టి ఇంటిలో వరుసగా ఒకదానిపై మరొకటి పెట్టాడు.
అది చూసి అసూయతో వంకరయ్యకు ఒళ్ళు మండిపోయింది. ఎలాగైనా సరే శంకరయ్య పంటనంతా నాశనం చేయాలి అనుకున్నాడు. పొరుగూరినుంచి ఒక బాంబు తీసుకువచ్చి దానిని ఒక తెల్లని బంతిలో పెట్టాడు. చీకటి పడ్డాక శంకరయ్య ఇంటిలో దూరి మూటల నడుమ ఎవరికీ కనపడకుండా ఆ బాంబు పెట్టి వచ్చేశాడు.
కాసేపటికి ఒక ఎలుక గింజల కోసం అక్కడికి వచ్చింది. బంతిని చూసి భలే వుందే అనుకుంటూ దానిని పట్టుకొని బైటకు లాక్కుని వచ్చింది. అంతలో అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లిని చూసి ఎలుక అదిరిపడి వేగంగా అక్కడినుంచి పారిపోయింది. పిల్లి ఆ బంతితో ఆడుకుంటూ వుంటే అది దొరులుకుంటూ ఇంటి బైటికి వచ్చింది.
వంకరయ్య ఇంటిలో ఒక కుక్క ఉంది. అది అప్పుడే అటువైపు వచ్చింది. ఇంకేముంది కుక్కను చూసి పిల్లి పారిపోయింది. కుక్క ఆ బంతిని నోటితో పట్టుకొని ఉరుక్కుంటూ పోయి దానిని వంకరయ్య కొడుకుకి ఇచ్చింది.
ఆ పిల్లోడు ఇంటి బైటికి వచ్చి బంతిని సంబరంగా గాలిలోకి వేగంగా ఎగురవేశాడు. అది సక్కగా పోయి పైన ఉన్న ఒక కాకి గూటిలో పడింది. అప్పుడే ఒక పాము ఆ గూటిలోని గుడ్డును తిందామని అక్కడికి వచ్చింది. దానికి గూటిలో తెల్లని బంతి కనిపించింది. "ఆహా... ఎంత లావు గుడ్డు" అనుకుంటా ఆనందంగా దానిని మింగింది. అది గుడ్డు కాదు కదా... దాంతో అరగక నెమ్మదిగా కిందికి వచ్చి గిలాగిలా కొట్టుకోసాగింది. 
బంతికోసం వెదుకుతా వున్న వంకరయ్య కొడుకుకి ఆ పాము కనిపించింది. వెంటనే భయపడి గట్టిగా "నాన్నా... పాము" అంటూ అరిచాడు.
ఆ అరుపులు విన్న వంకరయ్య వేగంగా కట్టె తీసుకొని వచ్చి ఆ పామును గట్టిగా బలమంతా ఉపయోగించి ఒక్కేటు కొట్టాడు. ఆ కట్టె సరిగ్గా వచ్చి పాము మింగిన బాంబుపై పడింది.
అంతే... దెబ్బకు అది ఢామ్మని పేలిపోయింది. ఇంకేముంది ఆ రోజునుంచీ వంకరయ్య కుంటి వంకరయ్యగా మారిపోయాడు.
***********
కామెంట్‌లు