పురపాలక ఎన్నికల అభ్యర్థులు బాలల హక్కులపై హామీ ఇవ్వాలి: - వెంకట్ , మొలక ప్రతినిధి

 రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక పిలుపు
ఎన్ జనార్ధన్, సలహాదారుడు, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, తెలంగాణ
పురపాలక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బాలల హక్కులు కాపాడుతామని తమ ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక కోరింది.ముందుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ వేదిక అభినందనలు తెలిపింది.
1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించిన నేపథ్యంలో, అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదని, మానవ వనరుల అభివృద్ధి కూడా ముఖ్యమని వేదిక స్పష్టం చేసింది.
పిల్లలకు నాణ్యమైన విద్య, పోషకాహారం, ఆరోగ్యం, బాలకార్మికులు లేకుండా చూడడం, బాల్యవివాహాలు నివారించడం వంటి అంశాలు దీర్ఘకాలిక అభివృద్ధికి సూచికలని పేర్కొంది.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం చైర్మన్‌లు, మేయర్లు, కౌన్సిలర్లు పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
బాలకార్మికులను గుర్తించి బడికి చేర్పించడం, బడిమానివేసిన పిల్లల జాబితాలు తయారు చేయడం, బాలకార్మిక రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలని కోరింది.
పిల్లలందరికీ టీకాలు, అనుబంధ పోషకాహారం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పోషకాహార లోపం లేని, ఆరోగ్యకరమైన పట్టణాలుగా అభివృద్ధి చేయాలని తెలిపింది.
బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి బాలిక ఉన్నత చదువులు కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ వర్గాలకు చెందిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సామాజిక న్యాయం సాధించే పట్టణాలుగా మారాలని విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల ఫీజులు, మౌలిక వసతులపై పర్యవేక్షణ చేపట్టాలని కోరింది.
కామెంట్‌లు