నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)

 ఇప్పగూడెం అనే పచ్చని పల్లెటూరు. అక్కడ రూపసి అనే ఒక అందమైన మనసున్న బాలిక ఉండేది. ఆమె కళ్లు ఎప్పుడూ దూరంగా కనిపిస్తున్న కొండల అవతల ఉన్న లోకాన్ని చూడాలని తహతహలాడేవి. పట్టణం ఎలా ఉంటుంది? అక్కడి మేడలు, మిద్దెలు, రంగుల లోకం ఎలా ఉంటుందో చూడాలన్నది ఆమె తీరని కోరిక.
రూపసి తల్లిదండ్రులు రెక్కాడితే గానీ డొక్కాడని పేదవారు. రోజంతా ఎండలో కష్టపడి కూలి పని చేసేవారు. తమ కష్టం బిడ్డకు తగలకూడదని, ఆమెను గొప్పగా చదివించేవారు. వారి ముఖాల్లోని అలసట చూసిన రూపసి, తన కోరికను బయటపెట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకుంది. కానీ, ఆమె మనసులో పట్టణాన్ని చూడాలన్న ఆశ మాత్రం రోజురోజుకూ ఒక చిన్న మొక్కలా పెరుగుతూనే ఉంది.
ఒకరోజు పాఠశాలలో ప్రార్థన సమయం. ప్రిన్సిపాల్ గారు మైక్ పట్టుకుని ఒక ప్రకటన చేశారు.
"ఈరోజు మన పాఠశాలకు విద్యావిహార్ ఫౌండేషన్ వారు వస్తున్నారు. వారు ఒక గొప్ప అవకాశాన్ని ప్రకటించబోతున్నారు. దీన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో, వారి జీవితంలో ఒక మధుర జ్ఞాపకం మిగిలిపోతుంది."
రూపసి గుండె వేగంగా కొట్టుకుంది. ఏదో తెలియని ఆశ ఆమెలో చిగురించింది. మధ్యాహ్నం ఫౌండేషన్ చైర్మన్ దయానిధి గారు వేదికపైకి వచ్చి ఇలా ప్రకటించారు.
"జిల్లా స్థాయిలో పదవ తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచే విద్యార్థులను, మా ఫౌండేషన్ తరపున విమానంలో భారతదేశంలోని ప్రధాన నగరాలన్నీ వారం రోజుల పాటు ఉచితంగా చూపిస్తాం!"
ఆ మాట వినగానే రూపసి కళ్లలో మెరుపు మెరిసింది. తను చూడాలనుకున్నది కేవలం పట్టణం, కానీ ఇక్కడ ఏకంగా విమానంలో దేశాన్నే చూసే అవకాశం తలుపు తట్టింది!
ఆ క్షణం నుండి రూపసి లోకం మారిపోయింది. తన కల సాకారం కావాలంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు, కఠోర శ్రమ కావాలని ఆమెకు తెలుసు.
 పగలు పాఠశాలలో, రాత్రి ఇంటి దగ్గర  కష్టపడి చదివింది.
ఆటలు, మొబైల్,ఇతరవ్యాపకాలను పక్కన పెట్టి పుస్తకాలనే తన ప్రపంచంగా మార్చుకుంది.
పరీక్షల ఫలితాలు రానే వచ్చాయి. రూపసి కేవలం పాఠశాలకే కాదు, జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది!
వార్తా పత్రికల్లో రూపసి ఫోటో చూసి ఊరంతా సంబరపడిపోయింది. కూలి పని చేసుకునే దంపతుల బిడ్డ, విమానమెక్కి దేశాన్ని చూడబోతోందని తెలిసి తల్లిదండ్రుల కళ్లు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. తన నిశ్శబ్ద కోరికను పట్టుదలగా మార్చుకుని, రూపసి తన కలను నిజం చేసుకోవడమే కాకుండా, తన తల్లిదండ్రుల కష్టానికి ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
కామెంట్‌లు