శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - - 115
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
94. కౌళినీ (త్ర్యరక్షరీ)
95. కులయోగినీ (పంచాక్షరీ)
తొంభై ఐదవ నామ మంత్రము - 
  ఓం కులయోగిన్యై నమః
94వ నామము యొక్క వివరణలో, కౌళాచారము, వామాచారము లలో ఒకే విధమైన పద్ధతులనూ, ఆచారాలనూ పాటించబడతాయి అని తెలుసుకున్నాము. ఈ వామాచారము లో ప్రధానమైన శక్తి మూలాధారము / మేరువు మధ్యలో కుండలినీ అయిన యోగ దేవతగా ఆరాధించబడుతూ ఉంటుంది. అలా కుండలినీ శక్తి గా ఆరాధించ పడుతూ దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని, వశిన్యాది వాగ్దేవతలు "కులయోగినీ" అని పిలిచి కొలిచారు. అంతటి యోగ దేవతయైన పరమేశ్వరి కి నమస్కారము.
కులము అంటే ఈ జగత్తు మొత్తము అనే అర్ధం కూడా మనము తెలుసుకున్నాము. ఈ కులము లోని జీవులు అందరూ తనను సాధన చేయడానికి అమ్మ ఇచ్చిన మరొక సాధనం "దేవీ ఖడ్గమాలా స్తోత్రం". ఈ "దేవీ ఖడ్గమాలా స్తోత్రం" చేసేటప్పుడు మనం తొమ్మిది ఆవరణలలోనూ, అధిదేవత గా , యోగినుల రూపంలో ఉన్న పరమేశ్వరి ని ధ్యానం చేస్తాము.
ఈ తొమ్మిది ఆవరణలలోనూ, మోదటి ఆవరణలో - భూపురం లో - ప్రకటయోగినులు గానూ; రెండవ ఆవరణలో - షోడశదళములో - గుప్తయోగినులు గానూ; మూడవ ఆవరణలో - అష్టదళములో - గుప్తతర యోగినులు గానూ; నాల్గవ ఆవరణలో - మన్వస్రములో - సంప్రదాయ యోగినులు గానూ; ఐదవ ఆవరణలో - బహిర్దశారములో - కులోత్తీర్ణయోగినులు/ కులయోగినులు గానూ; ఆరవ ఆవరణలో - అంతర్దశారములో - నిర్భయయోగినులు గానూ; ఏడవ ఆవరణలో - అష్టకోణములో - రహస్యయోగినులు గానూ; అష్టమ ఆవరణలో - త్రికోణములో - అతిరహస్యయోగానులు గానూ; తొమ్మిదవ ఆవరణలో - బిందువు లేక సర్వానందమయ చక్రములో - పరాపర రహస్యయోగినులు గానూ; పరాత్పరి అయిన లలితా పరాభట్టారిక పూజలు అందుకుంటోంది.
మేరువు లో, అయిదవ ఆవరణలో కులయోగినులు గా అమ్మ విరాజిల్లుతోంది అని తెలుసుకున్నాము. బహిర్దశారములో 12 మంది కులయోగినులు ఉన్నారు. వారు సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ.....కులోత్తీర్ణయోగినీ అని పన్నెండు మంది కులయోగినులు. ఈ కులయోగినుల నామాలాను మనం "దేవీ ఖడ్గమాలా స్తోత్రం"లో చదువుతాము. కులయోగినుల రూపంలో దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని "కులయోగినీ" అని పిలుస్తాము.
వామాచారులు లేదా కౌళాచారము పాటించే వారు అమ్మ యొక్క మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని, బాహ్య రూపంలో ఉన్నదిగా ఊహించుకుని, భౌతిక ఆరాధన చేస్తారు. ఈ విధంగా తనను భౌతిక ఆరాధన చేసి, తననే చేరాలి అని తపనపడే, తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు ఓం కులయోగిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....


...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు