శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 130
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
108. షట్చక్రోపరిసంస్థితా (అష్టాక్షరీ)
109. మహాసక్తిః (చతురక్షరీ)
నూట ఎనిదవ నామ మంత్రము:
ఓం మహాసక్త్యై నమః
మహ = ఉత్సవమందు / అగ్ని యొక్క తేజస్సు / బ్రహ్మము; ఆసక్తిః = ఆసక్తి కలది; ఉత్సవమునందు ఆసక్తి కలది.
శ్రీమన్నగరము మధ్యలో మణిద్వీపం లో చింతామణి గృహంలో పరమశివుని చేరిన పరమేశ్వరి, శివశక్తుల సంయోగ ఉత్సవము లో ఉత్సుకతను ఆనందిస్తూ కనిపించిన శ్రీమహారాజ్నిని చూసి వశిన్యాది వాగ్దేవతలు "మహాసక్తిః" అని పిలిచి కీర్తించి తరించారు. శివశక్తుల ఉత్సవము జరుపుకోవడంలో ఆనందాన్ని పొందే శ్రీమాతకు నమస్కారము.
శివశక్తుల కలయికలో జరిగే సంయోగ ఉత్సవము లో వెలువడుతున్న తేజస్సును జగత్తు అంతటా వ్యాపింప చేయాలి, ఆ తేజస్సు ద్వారా చరాచర సృష్టికి మేలు జరగాలి, అనే ఆసక్తి కలది కనుకనే శాంకరీ దేవి "మహాసక్తిః" అయ్యింది.
మహ అంటే బ్రహ్మము. అంటే, శ్రీమాత బ్రహ్మము లేక పరబ్రహ్మము నందు ఆసక్తి కలది అన్నమాట. అంటే శ్రీమాత "పరబ్రహ్మ స్వరూపిణి" కదా. బ్రహ్మము / పరమేశ్వర తత్వము తో శ్రీమాత అభేదమైనది/వేరు కానాదీ. అనగా, శ్రీమాత యే పరబ్రహ్మ; పరబ్రహ్మ యే శ్రీమాత.
ఇడ, సుషుమ్న, పింగళ నాడులలో, సుషుమ్న నాడి అగ్ని తత్వ ప్రతీక. సుషుమ్న నాడి లో ఉన్న అగ్ని తత్వము తో కూడిన కుండలినీ శక్తి, సహస్రార పద్మము లోని చెవి యొక్క చంద్మండలములోని ఘనీభవించిన సుధా సముద్రాన్ని/అమృత సాగరాన్ని తాకగానే, అమృత వర్షం కురిసింది. ఆ అమృత వర్షం ద్వారా అమృత ధారలను చరాచర సృష్టికి అందించాలనే ఉత్సుకత కలిగినది కనుక, శ్రీమాత "మహాసక్తిః" అన్నమాట.
పరబ్రహ్మము నందు కలిగిన ఆసక్తితో పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్ని, అన్ని శక్తుల కంటే ఎక్కువ శక్తి కలదే కదా! అటువంటి "మహాసక్తిః" అయిన పరమేశ్వరిని తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం మహాసక్త్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు