ప్రవాస పద్య పరిమళం - 30: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశం : సమస్యా  పూరణ 
వర్ణనాంశము : సమస్య 
ఛందస్సు : శార్దూలవిక్రీడితము




సమస్య: చారుంగాంచితి నామనంబున నిరాశానిస్పృహల్ నిండగా

శార్దూలవిక్రీడితము
ధీరోదాత్త మహా బలాఢ్యకరినై  తీండ్రించు వేసంగిలో 
నీరున్గాంచిన వెంటనే మడుగులో నే సేద తీరంగ, నా 
క్రూరాత్ముండగు నక్ర దంష్ట్రల బడన్ రోదించి, శ్రీ  
సత్పథా
చారుంగాంచితి నామనంబున నిరాశానిస్పృహల్ నిండగా
==
బలాఢ్యకరి = బలమైన ఏనుగు 
తీండ్రించు వేసంగి = మండు వేసవి 
తీండ్రించు  = తీక్ష్ణమయిన, ప్రచండమయిన, మండు 
నక్ర దంష్ట్రల = మొసలి నోట ( కోరల)
సత్పథాచార  = శ్రీమహావిష్ణువు
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 102వ శ్లోకంలో వచ్చే 955వ నామం "సత్పథాచారః".
శ్రీ ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం, సత్పురుషులు ఆచరించే ఉత్తమమైన కర్మలను, వారు నడిచే ధర్మ మార్గాలను తానే స్వయంగా ఆచరించి లోకానికి మార్గదర్శకత్వం వహించేవాడు కనుక శ్రీమహావిష్ణువుకు 'సత్పథాచారః' అనే నామం వచ్చింది.
పూరణ స్ఫూర్తి :
మహా పరాక్రముడైన గజేంద్రుడు మండు వేసవి లో ఒక మడుగులో సేద తీరుచున్నప్పుడు మొసలి నోట బడి, రోదిస్తూ నిరాశానిస్పృహల నిస్సహాయ స్థితిలో  మనసులో ఆ హరిని తలచిన సన్నివేశము. 
కామెంట్‌లు