తెలుగు నయనం! వెలుగు పయనం!: - డా పివిఎల్ సుబ్బారావు. -ఊరు:విజయనగరం.-సెల్:9441058797.
1.
వేల సంవత్సరాల క్రితం,
  ద్రవిడ భాషా కుటుంబసుత!

క్రీ.శ. ఆరవ శతాబ్దం నుంచె, 
 మొదలైన సాహిత్య సంహిత!

మన దేశం గుర్తించిన,
 ఒక శాస్త్రీయ భాషగా ఘనత! 

 తల్లి పాలతో , ముదమార,
  మనకొచ్చిన అనువంశికత! 

తరతరాలు కొనసాగించడం,   
 తెలుగువారి ప్రథమ బాధ్యత!

2.
    నా తెలుగు వెలుగు,
        సుప్రభాత రవికిరణం! 

జ్ఞాన సరస్వతి పాద,
 మంజీరనాద మధుర శ్రవణం! 

అక్షర గంగా తరంగ ప్రవాహాన,  
 బతుకు నిత్యసంప్రోక్షణo!

వసంతాన విరబూసిన,
 బొండు మల్లెల తోరణం!

ప్రతి ఇంటా వినిపించే,
 తీపి పలుకుల ఉచ్చారణం!

3.
కవులకు అన్నయ్య నన్నయ్య,   
    తెలుగు భారత శ్రీకారం! 

అంచెలంచెలుగా జాతికి,    
 అమరె అక్షర భాండాగారం!

పెద్దన ,పోతన, శ్రీనాథ, 
మహాకవుల కావ్య సృజనం! 

తిక్కన, వేమన,గురజాడత్రయం,
 తెలుగు సాహిత్య మూలధనం!

శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి,సినారె అందించిన,
  ఇగిరిపోని కవితా చందనం!

4.
తెలుగు శతకాలు వ్యక్తిత్వ ,
      వికాస పారిజాతాలు! 

హరికథలు ఆధ్యాత్మిక ,
       జీవన జ్ఞాన పథాలు!

అవధానాలు తెలుగు భాష,   
   విజయ పాంచజన్యాలు! 

ఈనాటికి పల్లె పదాలు, 
ఆనందామృత అక్షర సదనాలు! 

దేశభాషలందు తెలుగు లెస్స,
  కృష్ణరాయ అక్షర నీరాజనాలు! 

5.
తెలుగు వెలుగును తాకలేదు,
      ఎట్టి గ్రహణము! 

సంస్కృతి సాంప్రదాయాల ,
సాగు నిరంతర ప్రయాణము! 

అంటాం, వింటాం, చదువుతాం,
   తెలుగు యువత ప్రమాణం! 

తెలుగు అధ్యయనం,
 భావి భాషా రక్షణ కవచము! 

తెలుగు మూయని నయనం,
   వెలుగు ఆగని పయనం! 
__________

కామెంట్‌లు