ఏదో ఒకటి రాయాలి (నేను వ్రాయ కుండా ఉండలేను): -అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497
నేను ఏదో ఒకటి వ్రాయ కుండా
నిద్రపోలేను
నేను ఒంటరిగా ఉన్నా
సమూహంలో ఉన్న 
నా చూపంతా కవితా వస్తువుకోసమే అన్వేషిస్తుంది 

రోడ్డు పైన పసితనాన్ని దూరం చేసుకొని 
బాధ్యతను మోస్తున్న బాలకార్మికుడి గూర్చి నేను తప్పకుండా వ్రాయాలి 

కడుపారా కన్నకొడుకు తను రెక్కలు ముక్కలు చేసుకుని 
పెంచి పోషించి ప్రయోజకున్ని చేస్తే 
వార్థక్యాన రోడ్డున పడేసిన కర్కశపు కొడుకు
 చెంప చెల్లు మనేలానైనా నా కవితను కత్తిగా ఝళిపించాలి

ముక్కు పచ్చలారని పసిపాపలకు బాల్యవివాహాలు చేసి బరువు దించుకుంటున్న
ఆ ఆడపిల్లల తల్లిదండ్రుల దయలేనితనంగూర్చి కనువిప్పు కలిగేలా కవితొకటి బలంగా వ్రాయాలి 

ఎంత చదివినా చదువుకు తగ్గ ఉద్యోగాలు దక్కకపోవడం గూర్చి,
కార్పోరేట్ వ్యవస్థల గుత్తాధిపత్యపు చెప్పుచేతల్లో ఉన్న ఏలికల గూర్చి 
వరల్డ్ బ్యాంక్ షరతులకు ఏలికలు మోకరిల్లి అప్పులు దెచ్చి 
నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల గూర్చి ఎంతైనా వ్రాయాలి 

బలవంతుడు బలహీనున్ని
 దోపిడీ చేస్తున్న వైనాన్ని 
అడుగడుగునా జరుగుతున్నకల్తీ వ్యాపారాన్ని 
దోపిడి వైద్యాన్ని 
కార్పోరేట్ విద్యను
ఆన్లైన్ మోసాలను
దళారీ వ్యవస్థ దగుల్బాజీతనంగూర్చి 
రెండు వాక్యాలు ఎక్కువనే వ్రాయాలి 
ఎవరూ గొంతెత్తకుండా
సామాజిక మాధ్యమాల్లో వ్రాయ కుండా 
ప్రసారం చేయకుండా 
అనామకులుగా మనం ఉండడమంటే
మన ఆలోచనలు మందగించి
మతిమరుపు వరముగా మారి
బానిసత్వానికి మనం అలవాటు పడుతున్నట్టేకదా!
మౌనం వీడండి! 
ప్రశ్నించడం నేర్చుకోండి.
ప్రశ్నలే ప్రగతికి మెట్లౌతాయి.
భిన్నత్వంలో ఏకత్వం చాటండి. 
ఐక్యతా గీతాన్ని ఆలపించండి.


కామెంట్‌లు