సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -267: ఇంటింటికి మంటి పొయ్యి మా యింటికి మరో పొయ్యినా..
**
 "ఏందిరుల్లా! అందరొక్క తాన కూసోని మాగనే ముచ్చెట్లు జెప్పుకుంటుర్రు.గింతకీ వూల్లె ముచ్చట్లా? లోకంల ముచ్చెట్లా?"
 "ఏందక్కా! నువ్వు సుత కూసోరాదు ఏం ముచ్చెట్లో ఎరికైతయి."
 "ఏవుందిరుల్లా! పతిదాన్కి పైసలు పెర్గినయి.ఏం కొందామన్నా పిరమేనాయె.శేతుల వొంద నోటు పట్కెల్తే సంచెడు సౌదలొచ్చేయి. గిప్పుడేముంది.సంచెడు తీస్కబోతే పిడికెడు వొత్తువులు రాటల్లే.గిన్నాళ్ళ నించి నెత్తి నోరు గొట్టుకుంట శెప్తెనే ఉన్న. నాల్గు పైసలు దాయుండ్రి.అవసరానికి అక్కెరకొత్తయంటే ఇన్నడా? గిప్పుడు గీ ఇల్లెట్ల గడవాలని రంది జేత్తుండు. ఏజ్జూసినా పిరమేనాయె."
"అవుమల్ల. ఇంగ మా యింట్లో కత. పొల్ల పెద్దమడిషయిన కానించి శెప్తున్న.గప్పన్నించే గంతో గింతో పిసరంతైన బంగారం కొని దాద్దామంటే సశేం యిన్నడా? గిప్పుడు సూడుండ్రి. బంగారం పైకెక్కి దిగనంటుంది. శెప్తె ఇనే రకాలేనా? "శేతులు కాలినంక ఆకులు పట్కుంటే" ఏం ఫాయిద?"
"ఇంగ నీ ముచ్చెటేంది శెల్లే! మా మర్ది మంచోడే గద.నీకు శెయ్యి సాయం బాగనే శేత్తడుగద!"
 "ఆఁ ఏం జేసుడవ్వా! గాయినకి గన్క వొంటొచ్చని పతి దాన్కి వొంకలు బెట్టుడే.గట్లని నువ్వే జెయ్యరాదన్ననో గయ్యాలిక కొంపల లొల్లి ,అల్గుడు,తిట్టుడు గట్ల ఆరం దినాలు రావణ కాట్టమోలే  రగులుడే!. శీ! శీ! పెండ్లొద్దో అంటె యినకుండ నా గొంతు కోశిర్రు."
 "ఏందిరుల్లా ! పతొక్కలింట్ల ఏదోటి రసరస.ఎవ్వలు పెశాంతంగ లేరట్టుంది?"
"అవునవ్వా! నీ యింట్లె బావ లెక్క  మావోళ్ళు ఎవలన్న శెప్పితినేటోళ్ళుర్రా? దేనికైనా పెట్టి పుట్టాల్తీ! అదృట్ట మంటె అవ్వదే! కదవ్వా!"
 మీరేమొ నాకు శెప్పుకొని గుండె బర్వు దించుకుర్రు. నేనెవలికి శెప్పాలె. మీ బావ తక్కువోడేం కాదు. వొద్దన్న పని వాలాయిచ్చి శేత్తడు. నాయినకి కొడుకు మద్దతిచ్చుడు. మంచి శెబర శెప్పబోతె గయ్యిమని లేత్తడు. గందుకే అంటరు శెల్లే!  ఇంటింటికి మంటి పొయ్యి.మా యింటికి మరో పొయ్యినా!"అన్నట్టు పతొక్కరింట్లే ఏదో ఒక రసరస, నసనస.గయిలేని యిండ్లున్నయా? శిన్న శిన్నయే శిల్కి శిల్కి గాలివానయ్యే మాటలు శాన్నే ఉన్నయి.
 "గట్లని వొదిలేసుకోలేం. కొత్త కాదు గదని సరిపుచ్చుకోలేం. కాలంతో పాటు గయి నడుత్తనే ఉంటయి.మనం సుత నడ్వాలే శెల్లె! మీరేం ఫికర్ జేయ్య మాకుండ్రి. పోంగ పోంగ గయ్యే సద్దుకుంటయి."
 గదండీ సంగతి! "ఇంటింటికి మంటి పొయ్యి మా యింటికి మరో పొయ్యినా" అన్నట్టు పతింట్లే ఏదోకటీ నిత్తెం జర్గుతనే వుంటది.ఆలూ మొగలు శిన్నదాన్ని పెద్దగ జెయ్యకుండ నోరు మూస్కుంటే ఇంగేం పంచాతి ఉండదు."
కామెంట్‌లు