బృందావనానికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత కృష్ణుడికి ప్రతి రోజూ కొత్త కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి.
ఒకరోజు దూడలను మేపుతూ మిత్రులతో కలిసి అడవిలో తిరుగుతున్నాడు.
అప్పుడు దారిలో ఒక వెదురు ముక్క కనిపించింది.
ఒక బాలుడు దాన్ని తీసి "దీన్ని గేదెలను తోలడానికి ఉపయోగించవచ్చు..." అన్నాడు. ఇంతలో ఇంకొకడు "అబ్బే అది విరిగిపోయిన కర్ర.... పారెద్దాం..." అంటూ పారేయబోయాడు. అయితే కృష్డుడు తనకివ్వమని అడిగి తీసుకున్నాడు.
నిజానికి అది సాధారణ వెదురు ముక్కే. కానీ కృష్ణుడికి అది చాలా విశేషమైనదిగా అనిపించింది.
దాని ఒక చివరన, అక్కడక్కడ వరుసగా కొన్ని రంధ్రాలు ఉన్నాయి.
కృష్ణుడు దాని లోపలికి చూశాడు.
ఆ తర్వాత అవతలి వైపు నుంచి చూశాడు.
లోపల ఎవరైనా దాక్కున్నారేమో అని పరిశోధించాడు కృష్ణుడు. అప్పుడు బలరాముడు "ఆ వెదురు ముక్కను అంతలా పరీక్షిస్తున్నావేంటీ?" అని అడిగాడు.
"అదా, దాని లోపల ఎవరో ఉన్నట్టున్నారు..." అన్నాడు కృష్ణుడు.
ఆ మాటకందరూ పగలబడి నవ్వారు.
కృష్ణుడు మాత్రం తన పరిశోధన చూపులను మానలేదు.
అప్పుడు ఆ వెదురుపై వరుసగా ఉన్న ఆరు చిన్న రంధ్రాలు అతని దృష్టిని ఆకర్షించాయి.
అతను ప్రతి రంధ్రంపై ఒక్కో వేలు ఉంచాడు.
ఆ తర్వాత ఒక వేలు తీసి చూశాడు.
మళ్ళీ ఒకటికి రెండుసార్లు అలా చేశాడు. రంధ్రాలలోంచి లోపలికి చూశాడు.
పెద్ద రహస్యాన్ని పరీక్షించే ఓ మునిలా ముఖం పెట్టి తరచి తరచి చూశాడు.
"అన్నయ్యా... ఈ రంధ్రాలు ఎవరు చేసి ఉంటారు?" అని అడిగాడు కృష్ణుడు.
"నాకేం తెలుసురా?" అన్నాడు బలరాముడు.
కృష్ణుడు మళ్ళీ ఆ రంధ్రాలపై వేళ్లు ఉంచి చూశాడు.
ఆ ఆరు రంధ్రాలు అతని చిరు వేళ్ల కోసమే ఉన్నాయి.
ఆ తర్వాత వెదురును చెవి దగ్గర పెట్టుకుని విన్నాడు.
ఏమీ వినబడలేదు.
దాన్ని తట్టి చూశాడు.
చుట్టూ తిప్పి తిప్పి చూశాడు.
ఆ తర్వాత దానితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
"నువ్వు ఎవరు?"
సమాధానం లేదు.
"నీ పేరేంటి?"
"మాట్లాడవా?"
అని రకరకాల ప్రశ్నలు వేశాడు.
సరిగ్గా ఆ సమయానికి అనుకోకుండా బలమైన గాలి వీచింది.
వెదురు రంధ్రంలోకి గాలి ప్రవేశించి, "ఊఊ..." అంటూ ఒక నాదం వినిపించింది. ఆ నాదానికి పట్టరాని ఆనందంతో కృష్ణుడు గంతులేశాడు.
"అన్నయ్యా! ఇది మాట్లాడుతోందిరా!" అన్నాడు కృష్ణుడు.
బలరాముడు నవ్వాడు.
"అది మాట్లాడటం లేదురా... గాలి శబ్దం చేస్తోంది."
"నీకలా అనిపిస్తోందేమో కానీ నాకైతే మరోలా అనిపిస్తోంది. ఇది మాట్లాడటం లేదు, పాడుతోంది." అని గట్టిగా అన్నాడు కృష్ణుడు.
కృష్ణుడు మళ్ళీ వెదురును నోటి దగ్గర పెట్టుకున్నాడు.
ఆరు రంధ్రాలపై వేళ్లు ఉంచాడు ఒక్కో వేలు చొప్పున తీస్తున్నాడు. ఉంచుతున్నాడు. ఆ తర్వాత మెల్లగా ఊదడం మొదలుపెట్టాడు.
మధురమైన నాదం పుట్టుకొచ్చింది.
అనే నాదానికి కృష్ణుడితో సహా అందరూ ఆనందించారు. నవ్వారు. కానీ ఇంతలో ఒకడు "ఏంటీ అది పాడటమా?" అని ఎగతాళి చేశాడు.
కానీ కృష్ణుడు ఆపలేదు. మళ్ళీ ఊదాడు.
కొద్దిసేపట్లోనే ఆ నాదం వినసొంపుగా మారింది.
కృష్ణుడు రంధ్రాలపై ఉన్న వేళ్లను ఒకదాని తర్వాత ఒకటి మూశాడు. తీస్తున్నాడు.
దానికి తగ్గట్టుగా సంగీత స్వరాలు వెలువడటం ప్రారంభమయ్యాయి.
అక్కడున్న వారెవ్వరూ ఇప్పటివరకు అలాంటి సంగీతాన్ని వినలేదు.
దూడలు మేయడం ఆపేశాయి.
పక్షులు చెట్ల కొమ్మలపై వచ్చి కూర్చున్నాయి.
గాలి కూడా మెల్లగా వీచింది.
వేణునాదానికి బలరాముడితోసహా పిల్లలందరూ ముగ్ధులయ్యారు. కృష్ణుడి చూట్టూ నిల్చున్నారు. ప్రశ్నలవర్షం కురిపించారు.
"కృష్ణా... ఏంట్రా ఇది? ఓ మామూలు వెదురు కొయ్యను ఎలా ఇలా మార్చావు? దీని పేరేంటి? ఎలా నాదాన్ని పుట్టిస్తున్నావు? ఎవరు నేర్పించారు నీకు? ఈ వేణునాదం మమ్మల్ని మైమరపించింది..." అంటూ తోచినట్లు వారడిగారు. కానీ కృష్ణుడు ఒకే జవాబిచ్చాడు "అదంతా అంతే" అని!
అందరి వైపు చూసిన కృష్ణుడు, మళ్ళీ పిల్లనగ్రోవిని నోటి వద్ద ఉంచి ఊదడం ప్రారంభించాడు. మళ్ళీ సంగీతం పుట్టింది. ఆ క్షణం నుండి ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ప్రశ్నలు లేకుండా అందరి మనస్సులు లీనమై పోయాయి.
ఆ రోజు నుండి కృష్ణుడు పిల్లనగ్రోవిని కింద పెట్టడమే లేదు.
నిద్రపోయేటప్పుడు కూడా చేతితో పట్టుకునే నిద్రపోయేవాడు.
అతను నిద్రపోయిన తర్వాత యశోద నెమ్మదిగా పిల్లనగ్రోవిని తీసి పక్కన పెట్టేది. ఉదయం లేవగానే మొదట పిల్లనగ్రోవినే వెతికేవాడు కృష్ణుడు.
దానికి అతని శరీరంలో ఎప్పుడూ ఒక స్థానం ఉండేది.
ఊదనప్పుడు తలపాగాలోనో లేదా నడుముకో దోపుకునేవాడు. వెన్న కుండలకు సరిగ్గా రంధ్రం చేయడానికి, పశువులను మేపడానికి, దూడలను లేదా గోపికలను సంకేతాల ద్వారా పిలవడానికి.... ఇలా పిల్లనగ్రోవి అతనికి పలు విధాలుగా సహాయపడింది.
నిజానికి కృష్ణుడు ఎవరి దగ్గరా ఏదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
అతనే అన్ని కళలకూ గురువుగా విరాజిల్లుతున్నాడు.
అందుకే ఆ రోజు అతను పిల్లనగ్రోవి వాయించడం నేర్చుకోలేదు. పిల్లన గ్రోవికే సంగీతాన్ని నేర్పించాడు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి