ప్రకృతి సౌందర్యానికి పెట్టని ఆభరణాలు
రిక్తములలో
వృక్షములే మీ వసతీ గృహాలు.
నగరం మీకు నచ్చని
నివాస స్థలం.
🦜
పంచరంగుల చిలుక పలుకవేమి అలకా?
పంజరాన పెట్టనులే
పలుకవమ్మ "రామా"యని. ఒక్క మారు వచ్చి పొమ్మ
ఓ చిలకా! నా బంగారు మొలక.
కిచ కిచ లాడే పిచ్చుక
నువ్ కంటికే కానరావు
వడ్ల కంకులు కట్టెను
మా వసారాలో. వచ్చి తిను,ఓ బుల్లి పిచ్చుక.
కాకులారా! కనపడరే
మీకోసం వెతికాను
చుట్టాలొచ్చే కబుర్లు
తెచ్చిపెట్టరేమి మాకు.
సప్త స్వరములలో మేటి, పంచమస్వరమే నీది నీసాటి ఎవరమ్మా
సంగీత సుధాంబుధి.
ఓ పికమా! ఆలపింపుమా, వసంత రాగమ్మునిపుడు రాగరంజితముగా
రసాల శాఖపై చేరి.
మయూరమా! వివిధ వర్ణ విచిత్ర కాంతులన్ నీ సొంతము జేసికొని
అమర్చుకుంటివా కలాప (నెమలిపురి) రత్న కిరీటము
ఎంత సోయగమో నీది మయూరీ!
ఓహో!రాయంచా!
నీ వయ్యారి నడకలు
మాకు ఉపమానములయ్యే
"హంస నడకదానా"
అని కవులమాట.
శ్వేత వర్ణముతో,
నీటి సావాసముతో,
చల్లని జీవనము గడుపు నీవు కమలాసను తేరుకు వారువముగానుండి (అడిగితి నొక్కనాడు కమలాసన తేరుకు వారువంబునై...అని శ్రీనాథని శృంగార నైషధంలో హంస పలుకులవి) ఎంత సుకృతము నీది
పక్షులలో ఉత్కృష్ట
స్థానము పొందిన
హంస రాజమా! నీకు వందనమ్ము.
మానవులలో రెండే జాతులు.
విహంగ యానము చేయగల మీలో
ఎన్నో వివరింప ఎవరి తరం!
దేశ దేశాలన్నీ తిరిగి చూస్తారు. మీ రాకతో అందరికీ కనువిందు చేస్తారు.
వలస పక్షులు వచ్చు వేళ మాకెంతో హెచ్చు ఆనందం.
సీతాకోకచిలుకలు, మధులిహములు,
రెక్కలున్న చక్కని చుక్కలు.
ప్రకృతి చేసిన సుకృతి ఏమో
వివిధాకృతులలో
మిమ్ము బిడ్డలుగా పొందే. మీ ఆటపాటలు, రాకపోకలు చూచు భాగ్యం పొందినట్టి
ప్రకృతికి నా కైమోడ్పులు,
మీకు నా ఆశీస్సులు శుభాకాంక్షలు.
బర్డ్స్ ఆర్ ఆర్నమెంట్స్ ఆఫ్ ద వరల్డ్. అన్నాడు షేక్స్పియర్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి