311 వ రోజు: - శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యము చెప్పుట
శ్రీకృష్ణుడు దారుకునితో మాట్లాడుతున్న సమయంలో అర్జునుడు దర్బాసనంపై కలత నిద్రలో ఉన్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకు వచ్చాడు. అర్జునుడు కృష్ణుని భక్తితో ఆసీనుని చేసి పూల మాలికలతో పూజించి పక్కనే నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు "అర్జునా! శోకించకుము. శోకార్తుడు శత్రువుల చేత ఓడింపబడతాడు. నీ ప్రతిజ్ఞ నెరవేరు ఉపాయము ఆలోచింపుము" అన్నాడు. అర్జునుడు కృష్ణా! నాకు శోకము కాక మరేమి ఉంది. నేను సైంధవుని చంపెదనని ప్రతిన పూనాను. ద్రోణుడు కాపాడెదనని ప్రతినబూనాడు. సైంధవుడు నాకు కనబడక వారి వెనుక దాగి ఉంటాడు. అది తలచిన నాకు శోకము కాక మరేమి కలదు" అన్నాడు. కృష్ణుడు "అర్జునా! నీవన్నది నిజమే అయినా నీవు తూర్పు ముఖంగా నిలిచి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుని ప్రార్థించి పాశుపతము నీకు మనస్సున ప్రస్పుటము కావాలని కోరుము. పాశుపతము నీ వశమైన సైంధవుడు ఎక్కడ ఉన్నా వధించ కలవు" అన్నాడు. అర్జునుడు ఆచమనం చేసి సుచి అయి ధర్భాసనంపై కూర్చుని భక్తితో ప్రమేశ్వరుని ధ్యానించాడు. ఆ పరమేశ్వరుని కృప వలన అర్జునుడు కృష్ణుడు గగన మార్గమున పయనించసాగారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు సేవించు మార్గమున పోతున్నారు. కైలాసం చేరుకుని అక్కడ ఒక మందిర ప్రవేశం చేసారు. కృష్ణార్జునులు అక్కడ పార్వతీదేవితో ప్రమద గణాలతో పరివేష్టితుడైన శివుని దర్శించి సాష్టాంగ దండ ప్రమాణాలాచరించారు. పరమశివుడు మందహాసం చేసి "నరనారాయణులకు స్వాగతము. మీరు వచ్చిన కారణమేమి మీ కోరికను ఆవశ్యము తీర్చెదను" అన్నాడు. కృష్ణార్జునులు మనసులోనే భక్తి పొంగిపొరలగా స్తుతించారు. కృష్ణుడు "దేవా! దయ ఉంచి పాశుపతమును అర్జునుడికి ఉపదేశింపుము" అన్నాడు. అర్జునుడు శివుని చూసి ఆశ్చర్య పోయాడు. తాను కృష్ణునికి సమర్పించిన పూల మాలికలు పూజా ద్రవ్యములు శివుని దివ్యశరీరంపై ఉండుట చూసి శివకేశవులు ఒక్కటే భేదము లేదని తెలుసుకున్నాడు. అర్జునుడు కూడా తనకు పాశుపతం ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడు మందహాసం చేసి "అర్జునా! ఆ తామర కొలనులో ఉన్న నా విల్లు బాణములు తీసుకురా" అన్నాడు. అర్జునుడు వాటిని స్పర్శించగానే అవి సర్పాలలా బుసలు కొట్టాయి . అర్జునుడు పాద ప్రక్షాళన చేసుకుని మహాశివుని ధ్యానించి రుద్రము జపించగానే ఆ సర్పాలు విల్లు అమ్ములు అయ్యాయి. వాటిని తీసుకుని శివుని వద్దకు రాగానే అక్కడ నిలుచున్న నీలలోహిత వర్ణము కలిగిన బాలుడు ఆ విల్లంబులు తీసుకుని శరసంధానం చేసాడు. అర్జునుడు ఏకాగ్రతతో మంత్ర సహితంగా పాశుపతాన్ని ప్రయోగ ఉపసంహారాలు నేర్చుకుని శివుని ఆజ్ఞానుసారం విల్లంబులను తిరిగి సరస్సునందు ఉంచాడు. అరణ్యవాసంలో ఈశ్వరుని చేత అనుగ్రహించబడిన పాశుపతం ఇప్పుడు సమంత్రసహితంగా ప్రయోగ ఉపసంహారాలతో అర్జునుడికి అనుగ్రహించాడు పరమశివుడు. అర్జునుడి మనసు పరవశించింది. కృష్ణార్జునులు శివునకు ప్రణమిల్లి కురుక్షేత్రము లోని తమ శిబిరాలకు చేరుకున్నారు. అర్జునుడు ఈ రకంగా కల కన్నాడు" అని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించాడు.
ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము సమాప్తం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి