జంతికలే గాజులు: - - యామిజాల జగదీశ్


 గోకుల వీధుల్లో ఆడుకుంటున్న కృష్ణుడికి దాహం వేసింది.
నీళ్లు తాగడానికి ఒక ఇంట్లోకి వెళ్లాడు.
అక్కడ నలుగురైదుగురు గోపికలు కలిసి ఏదో పిండివంట చేసుకుంటు న్నారు.
లోపలికి ప్రవేశించగానే కృష్ణుడు తన కళ్లను వేగంగా తిప్పుతూ ఒక చూపు చూశాడు.
ఒక మూల బుట్ట నిండా జంతికలు ఉన్నాయి.
ఇంకోవైపు వెన్న కుండ ఉంది.
నీళ్లు తాగడానికి వచ్చిన సంగతి కూడా మర్చిపోయాడు.
దాహంతో ఉన్న కృష్ణుడు అల్లరికి దిగాడు. 
అందరూ కృష్ణుడిని చూడగానే పని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు.
కృష్ణుడు నడవటం మొదలైనప్పటి నుంచి రోజు అతడిని చూడటమే అరుదైపోయింది. అటువంటిది ఈరోజు అతనే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడుగా అనుకున్నారు గోపికలు.
"కృష్ణా... రా రా..."
"ఏమిటిలా వచ్చావూ ?"
"వెన్న దొంగిలించడానికి వచ్చావా?"
అని గోపికలు అడిగారు.
కృష్ణుడు వెంటనే ముఖం ముడుచు కున్నాడు.
"నేనెందుకు దొంగిలించాలి? మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వారికి మీరేమీ ఇవ్వరా?" అని అడిగాడు కృష్ణుడు.
ఆ మాటతో అందరూ నవ్వేశారు.
"సరే కృష్ణా..."
"కానీ మాకోసం ఒక చిన్న నృత్యం చేసి చూపించాలి" అన్నారు.
"అలాగా, డాన్స్ చేస్తేనే జంతికలు ఇస్తారా?" అని అడిగాడు కృష్ణుడు.
"ఔను" అంటూ ఒక జంతిక ఇచ్చారు.
దాన్ని అందుకున్న కృష్ణుడు ఓ చిన్న ముక్క తిన్నాడు.
"ఇప్పుడు డాన్స్ చెయ్..." అన్నారు గోపికలు.
కృష్ణుడు చేయనన్నట్లు అడ్డంగా తలాడించాడు. అలంకారమేమీ లేకుండా నర్తించలేనన్నాడు.
"ఏమలంకారం చేసుకోవాలి? మా దగ్గర నీకు సరిపోయేలా నగలేవీ లేవు కదా" అన్నారు గోపికలు.
"నగలు ఎవరు అడిగారు? ఈ జంతికలనే నాకు తొడగండి.... సరిపోతుంది" అన్నాడు కృష్ణుడు.
కృష్ణుడి ఎందుకలా అంటున్నాడో వారికి అర్థమైపోయింది. అందరూ కిలకిలా నవ్వేశారు.
"నాకేం వచ్చింది? మీరే కదా నన్ను డాన్స్ చేసి చూపించమన్నారు. వద్దు అనుకుంటే ఒక వెన్న ముద్ద ఇవ్వండి, నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను" అన్నాడు కృష్ణుడు.
"సరే సరే... కోపగించుకోకు " అంటూ ఒక గోపిక రెండు జంతికలు తీసుకుని, అతని రెండు చేతులకు గాజుల్లా తొడిగింది.
కృష్ణుడు వెంటనే రెండు చేతులూ చాచాడు. ఒక కాలు పైకి లేపాడు. తలాడించాడు. కళ్లు తిప్పాడు.
నాట్యం కంటే కృష్ణుడి ముఖభావాలే  ఎక్కువగా ఉన్నాయి.
దాంతో గోపికలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.
"రెండు జంతికలకూ సరిపడా నర్తించేశాను......" అంటూ మళ్లీ చెయ్యి చాచాడు కృష్ణుడు
"ఇంకోసారి డాన్స్ చెయ్యవా..." అని అడగ్గా"రెండు జంతికలకు అంతే డాన్స్ వస్తుంది." అన్నాడు కృష్ణుడు.
దాంతో గోపికలు మళ్లీ రెండు జంతికలనే గాజులుగా తొడిగారు కృష్ణుడి చేతులకు.
కృష్ణుడు మళ్లీ రెండు చేతులూ చాచాడు. ఒక కాలు పైకి లేపాడు. ఈసారి చుట్టూ తిరిగాడు.
"డాన్స్ చేసేశాను..." అంటూ మళ్లీ చేయి చాచాడు.
ఇంకో రెండు జంతికలు...ఇంకొక అడుగు...ఇంకో రెండు జంతికలు....ఇంకొక ముఖభావం....ఈ విధంగా ప్రతి జంతికకు ఒక చిన్న కదలిక మాత్రమే చేస్తూ వచ్చాడు.
చివరికి వారు చేసి పెట్టుకున్న జంతికలన్నీ కృష్ణుడి రెండు చేతులకు గాజుల్లా అలంకరించారు.
గోపికలు నవ్వుకుంటూ అతని నృత్యాన్ని ఆస్వాదించారు.
అప్పుడు హఠాత్తుగా కృష్ణుడు నాట్యం ఆపేశాడు. అందరినీ ఒకసారి చూశాడు.
"ఇంతసేపు నన్ను డాన్స్ చేయించినందుకు... ఈ వెన్న కుండను నేను తీసుకుంటున్నాను!" అని చెప్తూనే మెరుపు వేగంతో పరిగెత్తి ఓ మూల ఉన్న వెన్న కుండను ఎత్తుకున్నాడు.
గోపికలు తేరుకునేలోపే తలుపు దాటి బయటకు పరిగెత్తేశాడు కృష్ణుడు.
మొదట అందరూ తెల్లబోయారు.
ఆ తర్వాత ఒక గోపిక "మనల్నే కళ్ళు కప్పి పారిపోయాడే!" అని నవ్వింది.
"బాలకృష్ణుడు నాట్యం చూడాలని ఆశపడ్డాం...జంతికలన్నీ అయిపోయాయి...అంతేకాదు, వెన్న కూడా లాగించేసాడే..." అనుకున్నారు గోపికలు.
ఆ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చిన కృష్ణుడు కొద్ది దూరం వెళ్లాక ఆగాడు.
వెన్న కుండ మూత తీశాడు.
ఒక పెద్ద ముద్ద వెన్నను తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత చేతులకు ఉన్న జంతికలను  చూశాడు.
వాటిని కూడా ఒక్కొక్కటిగా కొరికి తినడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బలరాముడు, "కృష్ణా...ఈ జంతికలేంటీ ?" అని అడిగాడు.
కృష్ణుడు గర్వంగా నవ్వాడు.
"ఇది నా నృత్య ప్రదర్శనకు సంపాదన  అన్నయ్యా!" అన్నాడు కృష్ణుడు.
"అవునా? అయితే ఆ వెన్న కుండా?"అని బలరాముడు అడిగాడు.
కృష్ణుడు కళ్లు తిప్పుతూ అది అదనపు సంపాదన అన్నాడు.
బలరాముడు గలగల నవ్వాడు. కృష్ణుడూ నవ్వాడు. ఆ సమయానికి అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చారు. అందరికీ జంతికలు, వెన్నా పంచాడు  కృష్ణుడు.
ఆ రోజు కృష్ణుడు ఒక కొత్త ఆభరణాన్ని కనిపెట్టాడు. జంతికలనే గాజులుగా ధరించాడు.
గోపికలకు జంతికలు, వెన్న ఒక పెద్ద లెక్కే కాదు. ఆ రోజు చాలాసేపు కృష్ణుడు వారితోనే ఉన్నాడు. కృష్ణుడు మాయ చేశాడని గోపికలకు తెలుసు.
అయినా దానికోసం వారు బాధ పడలేదు. ఎందుకంటే కృష్ణుడితో గడిపే ప్రతి క్షణం విలువయినదే వారికి.
జంతికలు, వెన్న మళ్లీ చేసుకోవచ్చు. కానీ కృష్ణుడు తమ కోసం నవ్వుతూ, నాట్యం చేస్తూ గడిపిన ఆ క్షణాలు మళ్లీ వస్తాయా?
అందుకే కృష్ణుడు వెన్న కుండతో పరిగెత్తిపోయినప్పటికీ, గోపికల హృదయం ఆనందంతో నిండిపోయింది. యశోదకు ఫిర్యాదు చేయాలనుకోలేదు. కృష్ణుడిని తలచుకుని నవ్వుకున్నారు.

కామెంట్‌లు