కృష్ణుడు - వెన్న: - - యామిజాల జగదీశ్
 కృష్ణుడికి, అప్పుడే చిలికిన తాజా వెన్నంటే ప్రాణం.
ఆ వెన్న స్వభావం, దాని తెల్లని స్వచ్ఛత, భక్తుని మనస్సు లాంటిది. అందుకే అతను ఎవరికీ తెలియకుండా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడేవాడు.
యశోద ఆ కుండలను పైకి వేలాడదీసినా, కిందకు దించినా, లేదా వాటిపై ఏదైనా మూతలు కప్పినా ప్రయోజనముండేది కాదు. అతను ఎలాగోలా వెన్న, పెరుగు ఎక్కడ ఉండేవో గుర్తించేవాడు. తన పని కానిచ్చేసేవాడు.
ఆ రోజు,  ఓ గోపిక ఇంట్లో ఎవరూ లేరని నిర్థారించుకుని దగ్గరకు వేసి ఉన్న తలుపు తోసుకుంటూ అడుగులో అడుగేస్తూ వెన్న, పెరుగు ఉన్న గదిలోకెళ్ళాడు.
మొదట, అతను ఒక కుండలో చేయి లోపల పెట్టాడు. ఆ మెత్తటి వెన్న చల్లదనాన్ని తాకగానే, అతని ముఖంలో ఎంత ఆనందం వెల్లివిరిసిందో మాటల్లో చెప్పలేం! అమ్మయ్య తాననుకున్నట్టే ఈరోజు తాజా వెన్న దొరికిందనుకున్నాడు.
అతని కళ్ళు వెలిగిపోయాయి.
తర్వాత అతను మరో చేతిని కూడా లోపల పెట్టాడు. దాన్ని గరిటెతో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. తన చెంపకు కూడా రాసుకున్నాడు. అది అతని చేతుల నుండి కింద పడి పోయింది.
అతను అంతటితో ఆగలేదు.
ఇంతలో అతని కాలు తగిలి పక్కనే ఉన్న పెరుగు కుండ కింద పడి పగిలిపోయింది. పెరుగు అంతా నేలపాలైంది. 
అతను దాని మీద కాలు పెట్టాడు. అది జారుగా ఉంది. వామ్మో పడిపోతానుగా అని కృష్ణుడు పగలబడి నవ్వాడు.
అతను తిరిగి వెన్న కుండలో చేయి పెట్టాడు.
ఇంతలో ఏదో పని మీద బయటకు వెళ్ళిన ఆ ఇంటి గోపిక వచ్చి తలుపు దగ్గర నిలబడింది. అది గమనించిన కృష్ణుడు తన పనైపోయిందనుకు న్నాడు. 
అతను వెంటనే, రెండు చేతులూ కుండలో ఉంచి, వెనక్కి చూశాడు.
ఆ చూపులో భయం లేదు. అల్లరే ఎక్కువగా ఉంది.
దొరికిపోతాననే విషయం అతనికి అనవసరం. తానెవరినీ చూడలేదన్నట్లుగా మరికొంత వెన్న రుచి చూడటం కోసం అతను అక్కడే నిలబడ్డాడు.
అయితే ఒక్క క్షణం కన్నయ్య మీద కోపం వచ్చినా అతని చిలిపితనంతో గోపిక నవ్వు ఆగలేదు. అంతేకాదు,
ఆమెకు కృష్ణుడి గురించి యశోదకు ఫిర్యాదు చేయాలనే తలంపే రాలేదు. కన్నయ్య మూతి నిండా వెన్న... చేతికి వెన్న... కన్నయ్య అల్లరి గోపికకు అందంగా అనిపించింది. హాయిగా నవ్వింది. దగ్గరకెళ్ళి కృష్ణుడ్ని హత్తుకుంది.

కామెంట్‌లు