సేదదీరిన కృష్ణబృందం: - - యామిజాల జగదీశ్


 దూడలను మేతకు తీసుకు వెళ్లడమంటే కృష్ణుడికి, అతని స్నేహితులకు అది ఒక పని మాత్రమే కాదు. అదొక పండగ.
రోజూలాగే ఆ రోజు ఉదయాన్నే దూడలను తోలుకుని కృష్ణుడు తన మిత్రబృందంతో కలిసి అడవిలోకి వెళ్ళారు.
దూడలను పచ్చని గడ్డి మైదానంలో మేయడానికి, అలవాటు ప్రకారం వదిలేశారు.
మరోవైపు కృష్ణబృందం పరుగు పందెం...చెట్లు ఎక్కడం...నదీతీరాన కూర్చుని రాళ్లు విసరడం...ఒకరినొకరు ఆటపట్టించుకోవడం...వారి నవ్వులు, కేరింతలతో ఆ అడవి అంతా నిండిపోయింది.
మధ్యాహ్న భోజనం ముగిశాక ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో వలయాకారంలో కూర్చున్నారు.
ఒకడు పాట పాడాడు. ఇంకొకడు కథ చెప్పాడు. కొందరు దూడలను లెక్క పెట్టి చూశారు. కొందరు గడ్డిని తుంచుకుంటూ ఊరికే కూర్చున్నారు.
అప్పుడు హఠాత్తుగా కృష్ణుడు లేచి బలరాముడి దగ్గరికి వచ్చాడు.
"అన్నయ్యా..."
"ఏంటి కృష్ణా?"
"నీకు అలసటగా ఉందా?" అని కృష్ణుడు అడగ్గా బలరాముడు నవ్వాడు.
"లేదే" అని బలరాముడు చెప్పినప్పటికీ కృష్ణుడు వదలలేదు.
"దూడల వెనుక పరిగెత్తి పరిగెత్తి... కాళ్లు నొప్పులుగా ఉన్నాయా?" అని అడిగాడు కృష్ణుడు.
లేదన్నాడు బలరాముడు.
అయినా ఏవేవో కబుర్లు చెప్పి బలరాముడిని పడుకునేలా చేశాడు కృష్ణుడు.
"నేను కాళ్లు ఒత్తుతాను" అన్నాడు కృష్ణుడు.
బలరాముడికి ఏమీ అర్థం కాలేదు.
కృష్ణుడు ఎవరో అతనికి తెలుసు.
మనమే కదా భగవంతునికి సేవ చేయాలి... మనమే కదా భగవంతునికి కాళ్లు ఒత్తాలి... ఇతనేంటి మనకు చేస్తున్నాడు? అని ఒక క్షణం ఆలోచించాడు.
మరుక్షణమే నవ్వు వచ్చేసింది.
కృష్ణుడికి ఏది ఇష్టమైతే... ఏది అనిపిస్తే...అదే చేయనివ్వు...అని అనుకున్నాడు బలరాముడు మనసులో.
కృష్ణుడు మెల్లగా కాళ్లు ఒత్తడం మొదలుపెట్టాడు. చల్లని గాలి వీస్తోంది. 
ఇంతలో దూరంగా దూడల మెడలోని గంటల శబ్దం వినిపించింది.
చల్లని గాలికి బలరాముడి కళ్లు మెల్లగా మూతపడ్డాయి.
కొద్దిసేపట్లోనే అతను హాయిగా నిద్రలోకి జారాడు.
కృష్ణుడు ఇంకా అతని పక్కనే ఉన్నాడు.
ఆ తర్వాత చుట్టూ చూశాడు. 
అందరూ నిద్రపోతున్నారు. 
దూడలు కూడా చెట్టు నీడలో విశ్రమించాయి.
"అందరూ నిద్రపోయారే!" అని అనుకున్న కృష్ణుడిని కూడా నిద్ర వదల్లేదు. మెల్లగా బలరాముడిపై వాలాడు.
ఒక చేతిని అతనిపై వేసుకున్నాడు.
కొద్ది క్షణాల్లోనే అతను కూడా నిద్రపోయాడు.
బలరాముడు మెల్లగా కృష్ణుడిని హత్తుకున్నాడు.
మర్రిచెట్టు నీడలో...
అన్నదమ్ములు ఇద్దరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
ఆదిశేషునిపై భగవంతుడు శయనించే దృశ్యం దేవతలకు కూడా దక్కనిది. వారికి వైకుంఠానికి వెళ్లే అనుమతి లేదు. అందువల్ల దేవతలందరూ ఆ బృందావన అడవికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి తరిస్తున్నారు.
కామెంట్‌లు