ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము- 297 వ రోజు
అభిమన్యుడు లక్ష్మణ కుమారుని వధించుట
కృపాచార్యుని రథము విరుగకొట్టాడు. బృహద్బలుని శరీరంపై ముప్పై బాణములు వేసి నొప్పించాడు. వారికి సహాయంగా ఉన్న వారిని అంసంఖ్యాకమైన బాణములతో నిర్మూలించాడు. క్రోధలిప్తుడు, బృందారకుడు అను రాజులు శిరస్సులు ఖండించాడు. కృపాచార్యుడు వేరొక రథం ఎక్కి అభిమన్యునిపై బాణములు గుప్పించాడు. బృహద్బలుడు వారినందరిని తోసుకుని వచ్చి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు వాడి అయిన బాణములతో బృహద్బలుని సారథిని చంపి విల్లు విరిచి కేతనమును విరిచి, రథాశ్వములను చంపాడు. బృహద్బలుడు కత్తి డాలు తీసుకుని అభిమన్యునితో యుద్ధం చేయ సాగాడు. అభిమన్యుడు ఒకే భల్లబాణంతో బృహద్బలుని శిరస్సు ఖండించాడు. అది చూసి తమ రాజును చంపినందుకు కోసలరాజు బంధు మిత్రులు ఒక్కసారిగా అభిమన్యునిపై పడ్డారు. వారినందరిని యమపురికి పంపి అభిమన్యుడు కర్ణుని మీదకు వచ్చాడు. అభిమన్యునికి కర్ణునికి మధ్య పోరు ఘోరమైంది. ఒకరి శరీరములు ఒకరు రక్తసిక్తం చేసుకున్నారు. ఇంతలో కర్ణుని సైన్యాధిపతులు ఆలోచించుకుని ఒక్కసారిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు వారిని చూసి చిరునవ్వు నవ్వి వారిని ఒక్కొక్క బాణంతో ఒక్కొక్కరిని అంతమొందించాడు. తరువాత ద్రోణుడు మొదలగు కౌరవ ప్రముఖుల మీదకు దృష్టి మళ్ళించాడు. మగధరాజ కుమారుడు బాలుడైనా అభిమన్యుని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు అతడి సూతుని, హయములను చంపి మరొక బాణంతో అతని తల తెగనరికాడు. అభిమన్యుడు సింహనాదం చేసాడు. అది చూసి దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు అభిమన్యుడు అతడి రథాశ్వములను, సారథిని కొట్టి " కుమారా ! నీ తండ్రి దుశ్శాసనుడు నా ముందు నిలువ లేక పారిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా ! నా ప్రతాపం రుచి చూడు " అని ఒకేఒక నారసముతో బాణంతో దుశ్శాసనుడి కుమారుని వక్షస్థలము మీద కొట్టాడు. ఇంతలో అశ్వత్థామ ఆ బాణమును మధ్యలో త్రుంచి దుశ్శాసనుని కుమారుని రక్షించాడు. అభిమన్యుడు కనీసం అశ్వత్థామ వైపు చూడకుండా దుశ్శాసన కుమారుని విల్లు త్రుంచి, అతడి సారథిని చంపి, ఆరు బాణములు అతడి గుండెలో దించాడు. అభిమన్యుని ధాటికి తాళలేక దుశ్శాసనుడి కుమారుడు పారిపోయాడు.
అభిమన్యుని మరణం
అపహార్ణం వరకు యుద్ధం సంకులంగా జరిగింది. శత్రుంజయుడు, సువర్చనుడు, చంద్రకేతుడు, సూర్యభానుడు, మేఘవేగుడు మొదలైన వారు ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై పడ్డారు. అభిమన్యుడు తన అస్త్రశస్త్రములతో వారిని అందరిని దూరంగా తరిమి కొట్టాడు. శకుని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు అతడిని తీవ్రమైన శరాఘాతముతో నొప్పించి తనరధమును సుయోధనుని వైపు పోనిచ్చాడు. ఇది చూసిన కర్ణుడు " ఆచార్యా ! కౌరవ సేనలో మహామహులను ఓడించినభిమన్యుడు సుయోధనుడి మీదికి పోతున్నాడు. ఈ సమయంలో మీరు ఊరక ఉండుట తగునా ! ఏదైనా ఉపాయం ఆలోచించి అభిమన్యుని చంపండి " అని సుయోధనుడికి సాయంగా వెళ్ళాడు. అప్పుడు ద్రోణుడు " అభిమన్యుడు చిన్న వాడైనా తన తండ్రి అర్జునికి సమానంగా యుద్ధం చేస్తున్నాడు ఇక ఉపేక్షించరాదు. మనమంతా ఒక్కుమ్మడిగా అతడిని ఎదుర్కొన వలెను " అని పలికాడు. ఇంతలో అభిమన్యుని చేతిలో చావు దెబ్బలు తిని కర్ణుడు అక్కడికి వచ్చి ద్రోణుడితో " ఆచార్యా ! చూసారా అభిమన్యుడు నన్ను ఎలా దెబ్బ తీసాడో ! నేను మీ దగ్గరే ఉంటాను ఇంతకంటే నాకు సురక్షిత ప్రదేశం లేదు. అర్జునుడి పరాక్రమం గురించి విన్నాను కాని అతడి కొడుకు అంతకంటే పరాక్రమవంతుడు అని అర్ధం అయ్యింది " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి