ధర్మరాజు వ్యాసుని అడిగి యజ్ఞగాగాదులు వాటి ఫలితాలు తెలుసుకొనుట- 302 వ రోజు
వ్యాసుని మాటలతో ఊరట చెందిన ధర్మరాజు క్షత్రియ ధర్మమును అనుసరించి వీరస్వర్గమలంకరించిన అభిమన్యుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు కదా అనుకుని " మునీంద్రా ! ఇది వరకు ఉన్న మహారాజులు చేసిన యజ్ఞయాగములు ఏమిటి ? వాటి ఫలితము ఏమిటి " అని అడిగాడు. ధర్మరాజు మనసులో మాట గ్రహించిన వ్యాసుడు " ధర్మరాజా ! నీ కుమారుడు అభిమన్యుడు కూడా పూర్వపు మహారాజుల వంటి వాడే కనుక అభిమన్యునికి ఎలాంటి పుణ్యలోకాలు లభిస్తాయో అని ఆలోచిస్తున్నావు కదా " అన్నాడు. ధర్మరాజు మహాత్మా ! నీ దివ్యచిత్తముకు తెలియనిది ఏమున్నది దానిని గురించి వినగోరుతున్నాను " అని అన్నాడు. వ్యాసుడు " ఎన్నో యజ్ఞ యాగములు చేసిన వారు, తపస్సు చేసిన వారు, దానధర్మములు చేసిన వారు, ఉదాత్తమైన సద్గుణములు కలవారు తాము మరణించిన తరువాత పుణ్యలోకాలకు వెళ్ళి సుఖపడుతున్నారు. నిశ్వార్ధంగా అభిమన్యునిలా యుద్ధము చేసి వీరమరణం పొందిన వారు అంతకంటే ఉన్నతమైన పుణ్యలోకాలు పొందగలరు. అదీ కాకుండా మహితాత్ములైన మహారాజులు చేసిన యజ్ఞయాగాదులు వారి కర్మానుష్టానం గురించి తెలుసుకోవాలని అనుకున్నావు కనుక చెప్తాను విను.
సృంజయుని కథ
వ్యాసుడు ధర్మరాజుకు సృంజయుని కథ వివరించుట. " పూర్వము సృంజయుడు అనే రాజు పాలిస్తుండే వాడు. అతనికి సంతానము లేదు సంతానము కొరకు అతడు ఎప్పుడూ బ్రాహ్మణులను పూజిస్తుండే వాడు. అతడికి నారదుడు ప్రియ మిత్రుడైనందు వలన సృంజయుని వద్దకు పలుమార్లు వస్తుండే వాడు. ఒక రోజు అక్కడ ఉన్న బ్రాహ్మణులు అంతా కలిసి సృంజయుని కోరిక తీర్చమని ప్రార్ధించారు. నారదుడు సృంజయిని వద్దకు పోయి "మిత్రమా! నీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? నాకు ఇంత కాలము ఎందుకు చెప్పలేదు?" అని అడిగాడు. సృంజయుడు " నారదునితో తనకు గుణవంతుడు రూపవంతుడు అయిన కుమారుడు కావాలని ఆ పుత్రుని స్వేదము, మూత్రము, పురీషము, కన్నీరు అన్నీ బంగారుమయంగా ఉండాలని అలాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు. నారదుడు నవ్వి సృంజయుని కోరిక తీరుతుందని చెప్పాడు. నారదుని వర ప్రభావమున జన్మించిన కుమారునికి సృంజయుడు సువర్ణష్ఠీవి అని నమకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ కుమారుని వలన అతడి ఇంట్లో బంగారం దినదినాభివృద్ధిగా పెరగ సాగింది. అతడి ఇంట్లో ప్రతి వస్తువు బంగారు మయం అయింది. పడుకునే మంచము, కూర్చునే ఆసనము, ఇళ్ళు, ప్రాకారం మొదలైన సమస్త వస్తువులు బంగారుమయం అయ్యాయి. ఇది చూసిన కొందరు దొంగలు ఒక రోజు సృంజయుని కుమారుని అపహరించుకుని అరణ్యముకు పారి పోయారు. అక్కడ వారు రాజకుమారుని చంపి పొట్ట చీల్చి చూసి బంగారం కనపడక పోయేసరికి ఆ శవమును అక్కడ పారవేసి పోయారు. కాని వారు చేసిన హత్య వారిని వెంటాడి వారిలో వారికి తగాదాలు వచ్చి వారిలో వారు కొట్టుకుని మరణించారు. సృంజయుడు తన కుమారుని కానక అతడి కొరకు వెతికించి అడవిలో అతడి మృతదేహాన్ని చూసి అంత్యక్రియలు చేసాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి