ప్రపంచ దేశాల మధ్య ప్రభావాన్ని చూపే సాధనాలు కాలక్రమేణా మారుతున్నాయి. ఒకప్పుడు సైనిక శక్తి, ఆర్థిక బలం, రాజకీయ ఆధిపత్యం దేశాల ప్రతిష్ఠకు కొలమానాలుగా ఉండేవి. నేడు సంస్కృతి, విలువలు, జీవన తత్వం, జ్ఞాన సంపద కూడా అంతే ప్రభావవంతమైన సాధనాలుగా మారాయి. దీనినే అంతర్జాతీయ సంబంధాల పరిభాషలో "సాఫ్ట్ పవర్" అంటారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన సాఫ్ట్ పవర్ సాధనాల్లో యోగం అగ్రస్థానంలో నిలుస్తోంది.
యోగం భారతీయ నాగరికత ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన వారసత్వం. వేల ఏళ్ల క్రితం భారత ఋషులు మానవ శ్రేయస్సు కోసం రూపొందించిన ఈ జీవన విధానం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పే యోగం, భాషలు, దేశాలు, మతాలు, సంస్కృతుల మధ్య ఉన్న గోడలను అధిగమించి మానవాళిని ఒకే వేదికపై నిలబెడుతోంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు "సమత్వం యోగ ఉచ్యతే" అని పేర్కొన్నారు. సమతుల్యత, సంయమనం, సామరస్యం యోగం యొక్క మూల సూత్రాలని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న యుద్ధాలు, సామాజిక విభేదాలు, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలి సమస్యల మధ్య ఈ సందేశం మరింత ప్రాసంగికంగా కనిపిస్తోంది. అందుకే యోగం కేవలం ఆరోగ్య సాధనగా కాకుండా శాంతి, సహనం, సహజీవనానికి ప్రతీకగా గుర్తింపు పొందుతోంది.
యోగం ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందడానికి కారణం దాని విశ్వజనీనత. అది ఏ మతానికీ, జాతికీ, దేశానికీ పరిమితం కాదు. మానవ శ్రేయస్సును కేంద్రంగా చేసుకున్న జీవన విధానం. అందుకే 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినప్పుడు ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి చరిత్రలో అత్యధిక దేశాలు సహప్రాయోజకులుగా నిలిచిన తీర్మానాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది యోగం పట్ల ప్రపంచ సమాజం చూపిన గౌరవానికి నిదర్శనం.
పతంజలి మహర్షి "యోగశ్చిత్తవృత్తి నిరోధః" అని యోగాన్ని నిర్వచించారు. మనస్సులోని అలజడులను అదుపులోకి తెచ్చి అంతర్ముఖ శాంతిని పొందడమే యోగం లక్ష్యమని ఆయన వివరించారు. నేటి వేగవంతమైన జీవితంలో పెరుగుతున్న ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలకు యోగం సహజ పరిష్కారంగా నిలుస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య రంగం కూడా యోగం ప్రాముఖ్యతను గుర్తిస్తోంది.
స్వామి వివేకానంద యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, "మనిషిలోని దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే యోగం లక్ష్యం" అని చెప్పారు. ఆయన చికాగో ప్రసంగాల తర్వాత భారతీయ ఆధ్యాత్మికతపై ప్రపంచ ఆసక్తి పెరిగింది. ఆ ప్రభావం నేటికీ కొనసాగుతోంది. యోగం ద్వారా భారతదేశం ప్రపంచానికి శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, ఆత్మపరిశీలన, మానవతా విలువలను కూడా అందిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో "యోగం మానవాళిని కలిపే శక్తి" అని పేర్కొన్నారు. నిజానికి యోగం నేడు భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా మారింది. న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సిడ్నీ వంటి మహానగరాల్లో జరిగే యోగా కార్యక్రమాలు భారతీయ సంస్కృతికి ప్రపంచ వేదికపై విశిష్ట స్థానం కల్పిస్తున్నాయి.
"వసుధైవ కుటుంబకం" అనే భారతీయ తత్వం ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలని బోధిస్తుంది. యోగం ఆ తత్వానికి జీవంత రూపం. అది దేశాల మధ్య దూరాలను తగ్గిస్తుంది, మనుషుల మధ్య అవగాహనను పెంచుతుంది, ఆరోగ్యం మరియు శాంతి ద్వారా ప్రపంచ ఐక్యతకు మార్గం చూపుతుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, యోగం కేవలం ఆసనాల సమాహారం కాదు. అది భారతదేశం ప్రపంచానికి అందించిన శాశ్వత సాంస్కృతిక సందేశం. భారత సాఫ్ట్ పవర్‌కు ప్రతీకగా నిలిచిన యోగం, ప్రపంచాన్ని కలిపే సంస్కృతి వారధిగా భవిష్యత్తులో మరింత కీలక పాత్ర పోషించనుంది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి