సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 అర్జునుడు అభిమన్యుని కొరకు వెదకుట- 305 వ రోజు


అర్జునుడు ధర్మజుని చూసి " అన్నయ్యా ! మీరంతా విచారవదనంతో కూర్చుని ఉన్నారు. మీ మధ్య అభిమన్యుడు కనబడుట లేదు. అతడికి ఏమైయ్యిందో చెప్పండి. ఈ రోజు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు దానిలో నేను మాత్రమే ప్రవేశించి వెలుపలకు రాగలను. అభిమన్యునికి ప్రవేశించుట మాత్రమే తెలియును మీరు అభిమన్యుని పద్మవ్యూహం భేదించుటకు పంలేదు కదా! మీరు కోరారని పద్మవ్యూహమున ప్రవేశించి వెలుపలికి రాలేక ప్రాణములు కోల్పోలేదు కదా! శ్రీకృష్ణుని మేనల్లుడు, కుంతీదేవి మనుమడు, నా కుమారుడు, యుద్ధవిద్యా నిపుణుడు, దిన్యశరసంధానం తెలిసిన వాడు అయిన అభిమన్యుని శత్రువులు ఏ మాయోపాయంతో చంపారో కదా! గురువుఎడ భక్తి కలవాడు, అత్యంత ఉదారుడు, కరుణాత్ముడు, శౌర్యవంతుడు, ధైర్యశాలి, ఇంద్రుని మనుమడు అయిన అభిమన్యుడు లేక పోవడం దుస్సహము కదా! చిరు నవ్వు చిందించే మోము, విశాల నేత్రాలు, విశాలవక్షము కలిగిన అభిమన్యుని వదనారవిందం చూసి కదా నేను జీవిస్తున్నది. అభిమన్యుని మోము చూడక నేను ఎలా బ్రతుకగలను. హంసతూలికా తల్పమున నిదురించు అతడి శరీరం నేడు కఠిన శిలలపై శాశ్వతంగా నిద్రిస్తుందా ! తెల్లని ఛత్రముల నీడన ప్రకాశించు మోము నేడు ధూళిదూసరితమై ఉన్నదా! సదా అందమైన నెచ్చెలుల మధ్య సంచరించే అభిమన్యుడు నేడు క్రూరమైన నక్కల మధ్య ఉన్నాడా! నానా జనులకు నాధుడైన అభిమన్యుడు ఎంతో వినయ విధేయతలు కలిగిన సుభద్ర తనయుడు, దేవేంద్రుని మనుమడైన నా కుమారుడు ఇక లేడా! అయినా నా వంటి మందభాగ్యునికి అంతటి కుమారుడు ఎలా ఉండగలడు. విధాత ఎంతటి నిర్ధయుడో కదా! మంచి వారిని ఎక్కువ రోజులు బ్రతకనీయడు కదా! ఆ సంశక్తులు పిలిచిన నేను ఏల యుద్ధముకు పోవలె. నాకుమారుని ఏల పోగొట్టుకున వలే " అని శోకిస్తూ అర్జునుడు అక్కడే కూలబడ్డాడు. అభిమన్యా! ధర్మరాజు ముద్దులకొడకా! నీ తల్లి సుభద్రను విడిచి వెళ్ళుట నీకు ధర్మమా! నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు ఒక్కసారి లేచి రావా! నీ ప్రియమైన మాటలతో నీ భార్యను ఊరడింపవా!" అని పరి పరి విధముల పరితపించాడు. అభిమన్యుని కొరకు విలపిస్తున్న అర్జునుడు ధర్మరాజును చూసి "అన్నయ్యా! ఇది ఎలా జరిగింది? భీమసేనుడు ఏమయ్యాడు? ధృష్టద్యుమ్నుని వెంట పంపక వేరొక చోటకు పంపావా? మహా వీరుడు విరాటుడు ఏమయ్యాడు? నీవు ఎందుకు అభిమన్యుని కాపాడ లేదు? మరొక చోటున యుద్ధం చేస్తున్నావా? ఇలా అందరూ ఉండీ నా కొడుకుని దిక్కు లేని చావుకు గురి చేసారా! రణరంగమున నా కుమారుడు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి మరణించాడు కదా! నాకుమారుని పలువురు చుట్టుముట్టి తమ వివిధ ఆయుధములతో చంపుతుండగా తనకు ఎవ్వరూ తోడు లేరని నా కుమారూడు ఎంత బాధను అనుభవించాడో కదా! తండ్రీ! శత్రువులను వధించి నన్ను కాపాడు" అని ఎంత బాధపడ్డాడో కదా! అయినా నాకుమారుడు కృష్ణుని మేనల్లుడు అమిత ధైర్యశాలి మిన్ను విరిగి మీద పడినా ధైర్యంగా పోరాడుతాడు కాని వేరొకరి సహాయం అర్ధిస్తాడా! నా కుమారుని మరణ వార్త విన్న నా హృదయం ముక్కలు కాలేదేమి? పలువురు కూడి వధించునప్పుడు నా గాండీవం కాని శ్రీకృష్ణుని సుదర్శనం కాని గుర్తుకు రాలేదా ఏమి? మరణించిన నా కుమారుడు నెత్తుటి మడులో ఎక్కడ పడి ఉన్నాడో నాకు చూపు వారెవరు?
కామెంట్‌లు