సామెత -274: ఇచ్చేటోడికి పత్రం -చచ్చేటోడికి మందు అక్కర్లేదు
***
"మావోడు ఎంత పని జేసిండో సూశినవా అవ్వా! శెప్తె యినడాయె వొంట బుట్టదాయె. ఒకటా రొండా అవ్వా! తల్సుకుంటెనే గుండెల దమదమ అంటున్నది! గయ్యాల్టి సంది గియ్యాల దనుక కంటి మీద రెప్పవడుల్లేదు. ఏందీ గీడు శెప్పితినడాయె . శెడంగ సూత్తనా ఏంది? అని ఒకటే రంది బట్కుంది."
"అయిన గని అవ్వా! గీ కలికాలంల ఎవ్వలినైన నమ్మేతట్టు ఉందా! నువ్వే శెప్పు. ఎంత పోరాడితేంది పోరడు యింటెనా? వద్దనంగ వాలాయించి ఆడు అనుకున్నట్లే జేసిండు. సేశినోడు మాగనే ఉండుగని యేడాది సంది నిద్దర వట్టుడు లేదు.తిండి సయిచ్చుడు లేదు. గవేమన్న అన్నేలంగ వొచ్చినయా? రెక్కలు ముక్కలు జేస్కొని శీమలొతికి కూడబెట్టినం. బేంకులెయ్యిరా అంటే గాని దోత్తు ఆపతిల వుండు.గిస్మంటప్పుడె గద ఒకలికొకలు సాయెపడేది అన్కుంట ఇచ్చిండు."
" ఇస్తె ఇచ్చిండుగని లెక్క పత్రం ఉండాల్నా వొద్దా? నువ్వే శెప్పవ్వా? దోత్తును సుత నమ్మకపోతే గీ పెపంచకంల ఎవ్వల్నే నమ్మేది. జిగిరి దోత్తు గాని కాడ పత్తరం గిత్తరం అని గిన్నాళ్ళ బందం యిడగొట్టుకోమా అన్నడు. గీనికంటె బుద్ది లేదు.గా తీస్కున్నోడికన్న ఉండొద్దా! అంటెనేమో అన్ననంటరు. గాడు యియ్యక పోతే పరిత్తితి ఏంటి ఏవఁన్న సుబూదుందా ఫలానా దినం, ఫలానా సయిమంల ఇచ్చినమని శెప్పడానికి. అయిన గని అవ్వా! గీనికి అమ్మ యిలువ తెల్వడంలే. పైసల యిలువ తెలియడంలే.గయి గన్క రాకపోతే గుండాగి సచ్చుడే అవ్వా!"
" ఏంది శెల్లే! వొచ్చే వొచ్చుడే మీ వోన్ని తిడ్తున్నవ్. ఏడుత్తున్నవ్! సాదిత్తున్నవ్! బయవడ్తున్నవ్! నిన్ను నువ్వు ఓ పాలి అద్దంల సూస్కున్నవా. నల్లకట్టేవడ్డవు. ఏనుగంత మడిసివి పీనిగెంత అయినవు.నిన్ను సూత్తుంటే దుఃఖమొత్తుంది? నీ మాటల్లనే అస్లిషయం అర్తమైంది.ఏం కాదు తీ. అంత నమ్మిచ్చి మోసం సేశేటోళ్ళు ఎక్కడో ఓకాడ వుంటరు. ఇంకా మంచోళ్ళు ఉండ్రు గనుకనే గీ లోకం గిట్లనడుత్తుంది శెల్లే!"
" ఏమో అవ్వా! గా శెడ్డోళ్ళల్లనే గీడు గనక వుంటే ఇల్లు గుల్లనే.ఇంగ మేం నెత్తీనోరు కొట్టుకు పోవుడే."
" గాడేమో గని నువ్వు రంది వడి ఏమో అయ్యేటట్టే వుంది.పానం ముఖ్యమే శెల్లే! పైసలు గాడిదో బూడిదో అయ్యి సంపాయిచ్చుకోవచ్చు.పానం పోతే వొత్తదానే శెల్లె.నువ్వె జెప్పు?''
"అవునన్కో ! గని బయం బయమే గదా!"
***
"అగ్గో నీ కొడ్కు వాడెవన్నో ఎంటబెట్కోని వొత్తుండు.కొంపదీసి గాడు గీడే కాదు గదా!"
"అవునవ్వోవ్! గాడే గీడు.మంచిగ మింగిండూ.మల్లేమన్న అడుగు బొడుగు వుంటే అడుక్కోడానికి."
తినబోతూ రుసులు ఎందుకు గని.రాని ఒకేళ గట్ల జేత్తె నేనున్న గద నిలదీసి పదిమందిల ఇజ్జత్ తియ్యడానికి.నువు జెరాగు శెల్లే!"
***
" అవ్వోవ్! మాయమ్మ గీడుందని నాయిన జెప్పిండు. ఇగ్గో గీడే నా దోత్తు గాడు. గాని నాయినకి గుండెల్ల నొప్పొచ్చి దవాఖానాకి బోతే ఎంటనే ఏందేందో శెయ్యాలె.టంట్లు పడ్తయి పైసలు గడ్తెనే శేత్తమన్నరట.నా తానికి వొచ్చిండు.ఇచ్చినవ్వా! సయిమానికి వైజ్గం జెయ్యడాన్కి గీ పైసలు అందడం వల్ల వాల్ల నాయిన బచాయించిండవ్వా! గాడు ఏడాది బెట్టిండు సయిమం.గాడు పత్రం రాశిత్తరా అంటే నేనే తిట్టి పంపినవ్వా! ఇగ్గో వొద్దనంగ పైసలు ఊకెనే వత్తయా అన్కుంట మిత్తి సుత పట్కొని వొచ్చిండు."
"సూత్తున్నవ్! ఇంటున్నవ్ గద శెల్లే! "ఇచ్చేటోడికి పత్రం -సచ్చేటోడికి మందు అక్కర్లేదు" అంటే గిదే మరి."
" మొన్న మనూల్లె పండుటాకస్మంటి తొంబై ఏండ్ల ముస్లవ్వ ముచ్చెటేమైందో తెల్సుగద. గామె ఆకు శిరిగి పొయ్యే కాడికి వొచ్చింది. ఎక్వ కాలం బత్కదు. మందూ మాకూ అక్కర్లేదని శెప్పలే. గా మొన్న నిద్దట్లనే వోయెగద. "
" గిప్పటికైనా సమజైందా శెల్లే. తీస్కున్నప్పుడు నియతుగ ఇచ్చే మన్సుండాలె గని రాతలు కోతలు ,పత్తరాలు అవుసరమా శెప్పు. "
" గదండీ సంగతీ! " ఇచ్చేటోడికి పత్రం -సచ్చేటోడికి మందు అక్కర్లేదు" అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి