ట్రాఫిక్ జామ్: - మాణిక్యాలరావు పంచదార్ల
 


 
వేగమే పరమావధిగా
యంత్రాల మీదే యంత్రాల్లా
మారుతూ ముగింపు లేని పరుగులో...
ఒకరినొకరు నెట్టుకుంటూ
మరో అడుగు కోసం పెనుగులాట!
 
క్షణ కాలపు నిరీక్షణకు ఓపిక లేక
అవతలి వాడి అసహనాన్ని
సాకుగా చూపి చొచ్చుకుపోవాలనే 
ఆత్రుతలో ఎక్కడికక్కడ 
బిగుసుకుపోయిన చైతన్యం!
 
హారన్ల మోతలో
మునిగిపోయిన విచక్షణ...
ఇనుప వాహనాల మధ్య
నలిగిపోతున్న నరజాతి కాలం!
 
ఒక్కరు ఆగి దారిస్తే
సాగే ప్రయాణం ఇది...
కానీ, "నేనెందుకు తగ్గాలి?"
అనే అహంఅందరినీ
అచైతన్య శిలల్లా మార్చేసింది!
 
ముందుకు పోలేని మొండితనం
వెనక్కి తగ్గని స్వార్థం...
మధ్యలో నిశ్చలంగా
స్తంభించిన జీవితం
పేరుకు మాత్రమే... ట్రాఫిక్ జామ్!

కామెంట్‌లు