నవరత్న ఉంగరంలో మధ్యలో కెంపు, తూర్పు దిశలో వజ్రం, ఆగ్నేయ దిశలో ముత్యం, ఈశాన్యంలో పచ్చ, దక్షిణాన పగడం, నైరుతిలో గోమేధికం, పడమరలో నీలం, వాయువ్యంలో వైఢూర్యం, ఉత్తరంలో కనకపుష్య రాగం ఉండాలి.
మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని మన జీవితంలో మనల్ని నడిపించేది నమ్మకమే. నమ్మకమే మన జీవితానికి పునాది. కొన్ని నమ్మకాలను మనం మూఢనమ్మకాలని కొట్టిపారేసినా ప్రతి నమ్మకం వెనుకా ఓ అనుభవం ఉంటూ ఉంటుంది. ఒకటికి పదిసార్లు ఒకటే జరిగితే అప్పుడు అది అనుభవం మాత్రమే కాదు, నమ్మకమూ అవుతుంది మన జీవితానికి.
అటువంటి నమ్మకాలే ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతిలో అరుదుగా లభించే రంగు రాళ్ళు, పూసలు, గవ్వలు, కాయలు, పండ్లు వంటివన్నీ మనకు ఏదో రూపంలో ఉపయోగపడుతుంటాయి. అప్పుడు వాటిపై మనకు తెలియకుండానే నమ్మకం పెరుగుతుంది. మన మనసుకు నచ్చిన వారితో ఆ విషయాన్ని పంచుకుంటాం.
ప్రకృతిలో లభించే రత్నాల రంగులు, వెలుగులూ మనిషిని అనాది కాలం నుంచీ ఆకట్టుకుంటున్నాయి.
రత్నాలు అరుదుగా లభించడం, భూమి పొరలలో కనిపించే మిగిలిన రాళ్ళ కన్నా భిన్నమైనవిగా ఉండడంతో వాటి మీద మనకు ఆసక్తి పెరుగుతుంది. ఇది విచిత్రమేమీ కాదు. సర్వసహజం. అంతేకాదు, నమ్మకమూ పెరుగుతుంది. వేదకాలం నుంచీ ఆరంభమైన ఆ నమ్మకం ఇప్పుడు ఓ శాస్త్రంగా మారడం విడ్డూరమేమీ కాదు. అనుభవం నేర్పిన పాఠాలను ఎవరు కాదనగలరు.
గ్రహశాస్త్రంతో మిళితమైన నవరత్న శాస్త్రం వృద్ధిలోకి వచ్చిందిలానే. మనిషి జన్మించిన సమయానికీ, రత్నాలకూ లంకె ఏర్పడింది. ఏ నక్షత్రంలో ఏ రాశిలో జన్మించిన వారికి ఎటువంటి రత్నం ధరించవచ్చో ఆ శాస్త్రం మనకు స్పష్టం చేస్తుంది. జన్మనక్షత్రం, జన్మ రాశి ప్రధానం. అందుకు నైపుణ్యం ఉండాలి. అందుకే అంటారు, ఎవరు ఏది పడితే అది వాడకూడదని.
ఓ రత్నం ఎంపిక చేయాలంటే అనేక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.
ఒక్కో గ్రహానికి ఒక్కో రత్నం అధిపతి అవుతుంది.
అదేంటో చూద్దాం....
సూర్యుడికి కెంపు (అవతారం - రామ), చంద్రుడికి ముత్యం (అవతారం – కృష్ణ), శుక్రుడికి వజ్రం (అవతారం – పరశురామ), కుజుడికి పగడం (అవతారం – నరసింహ), రాహువుకి గోమేధికం (అవతారం – వరాహం), బృహస్పతికి పుష్యరాగం (అవతారం – వామన), శనికి నీలం (అవతారం – కూర్మం), బుధుడికి పచ్చ (అవతారం – బుద్ధ), కేతువుకి వైఢూర్యం (అవతారం – మత్స్యం) అధిపతి.
కెంపు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అది అత్యంత విలువైన రత్నం. దీనినే రవిరత్నం, వసురత్నం అని కూడా అంటారు. కెంపులు ఎరుపు భిన్న ఛాయలో ఉండొచ్చు. కెంపునకు ఆదివారం మంచిది.
ముత్యాలు అల్చిప్ప నుంచి తీస్తారు. మంచి ముత్యం అనేది తెల్లగా మృదువుగా ఉంటుంది. మెరుస్తుంది. ముత్యం మీద నల్లమచ్చలు ఉంటే ధరించకూడదు. ముత్యాలను ఆది, సోమ, గురువారాల్లో ధరించడం మంచిది.
పగడం నాణ్యమైనదైతే మెరిసే ఎరుపు రంగులో ఉంటుంది. నారింజ రంగు మిళితమై ఉంటుంది.
గోమేధికం కపిల వర్ణ ఎరుపు ప్రదర్శించే రత్నం. నున్నగా స్ఫటికంలా ఉంటుంది. పూర్తి పారదర్శకమైన గోమేధికాన్ని ధరించకూడదు. రంగు తక్కువ, నునుపులేని గోమేధికం ప్రేమ, సంసార బందాలలో ఘర్షణ పెంచుతుంది.
పుష్యరాగానికి గురువారం మంచిది. పుష్యరాగం పసుపు, కుంకుమ, తెలుపు ఛాయలలో దొరుకుతుంది. పుష్యరాగాన్ని తెల్లకాగితం మీద ఉంచి ఎండలో పెడితే అందులో నుంచి పసుపు రంగు కిరణాలు వెలువడతాయి.
నవరత్నాలలో మేలైనది మంచి చెడులలో ఏదైనా ఫలితాలను చూపించేది నీలమణి. నీలం, నీలమణి, ఇంద్రనీలమణి అని పేర్లున్నాయి. ఇది నెమలి నీలపు రంగులో పారదర్శకంగా ఉంటుంది. దీనిని సూర్యకాంతిలో ఉంచినప్పుడు నీలికిరణాలు ప్రతిబింబిస్తాయి.
బరువున్న పచ్చ మంచిది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ రత్నం జ్యోతిష్యులకు మహా ఇష్టం. వీటి ఖరీదు ఎక్కువ. పచ్చను పగడం లేదా ముత్యంతో పాటు ధరించకూడదు.
కాంతి ప్రవేశంలో స్ఫటికంలా ఉండే రత్నం వైఢూర్యం. ఇది ఒక పిల్లికన్నులా మెరుస్తుంటుంది. వైఢూర్యం పసుపు, లేత పచ్చ, నల్ల ఛాయలలో కనిపిస్తుంది. దీని మీద తెల్లగీతలు ఉంటాయి.
నవరత్నాలలో రాజు వజ్రం. ధగధగా మెరుస్తంది. తెల్లని, పారదర్శక వజ్రం అత్యుత్తమమైనది. ఈ వజ్రం నుండి అనేక రంగులు వెలువడి కనిపిస్తాయి. వజ్రాలకున్న ఆదరణను సొమ్ము చేసుకోవడానికి కొందరు నకిలీ వజ్రాలను అంటకడతారు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి