ఈమే యశోదే!: - - యామిజాల జగదీశ్
 ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న మహిళ (పసుపు చీరలో ఉన్నామె) ఇరవయ్యో ఏట 
భర్తను కోల్పోయారు. 
ఆమె కృష్ణ భక్తురాలు. బృందావనంలో ఉన్న బంకే బిహారీ ఆలయ వాకిట్లో ఓ పక్కన కూర్చుని ఆలయానికి వచ్చిపోయే భక్తుల చెప్పులను చూసుకుంటూ ఉంటుంది. దానిపై వచ్చే సంపాదనే ఆమె జీవితం కొనసాగుతోంది.
భక్తులు తమంతట తాముగా ఎంతిస్తే అంత తీసుకుంటుంది తప్ప తానుగా ఏమీ అడగదు. తనకంటూ చెప్పుకోవడానికి కుటుంబం లేదు. కనుక ఆమెకు ఖర్చులు పెద్దగా లేవు. వచ్చినదాంట్లోనే కొంత దాచుకుంటుంది. ఇలా నలభై ఏళ్ళుగా ఆమె చేర్చిన డబ్బులెంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 51,02,050 రూపాయలు. అక్షరాలా యాభై ఒక్క లక్షల రెండు వేల యాభై రూపాయలన్న మాట.
అయితే ఆమె ఆ డబ్బులను తనకంటూ వాడుకోకుండా నలభై లక్షల రూపాయలతో ఓ గోశాలను, ఆలయానికి వచ్చే యాత్రీకులు బస చేయడం కోసం ఓ ధర్మశాలను ఏర్పాటు చేయడం విశేషం.
అయితే ఇంత పెద్ద కార్యం చేసినప్పటికీ దాని గురించి చెప్పుకోకుండా భక్తులకూ పశువులకూ తనవంతు సేవ చేస్తున్నారు.
డబ్బే జీవితం ఆని భావించే వారికి ఈమె చేసే సేవ ఓ గొప్ప పాఠంగా చెప్పుకోవచ్చు.
శ్రీమద్ భాగవతంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఒక చోటంటాడు...."అహం భక్త పరాధీనం" అని.
అంటే నా భక్తులే నాకు సర్వస్వం.  నేను నా భక్తులను నమ్మి ఉన్నానని భావం.
అందుకే కృష్ణుడు తనమీద నిస్వార్థంతో అపార భక్తిని చూపించేవారికి అంతులేని ప్రేమను చూపిస్తాడు. కృపతో చల్లని చూపులతో అనుగ్రహిస్తాడు. 
బృందావనానికి చెందిన ఈ కృష్ణభక్తురాలి పేరు యశోద. ఎంత యాథృచ్ఛికమో కదా....కృష్ణుడిని పెంచిన తల్లి పేరు కూడా యశోద కావడం. తన పుత్రుడైన కృష్ణుడిని ఓ బిడ్డగా మాత్రమే చూసుకున్న గొప్ప ప్రేమమూర్తి యశోద. ఆమె కంటికి కనిపించిందల్లా భగవాన్ కృష్ణుడు కాదు, చిలిపి కృష్ణుడు మాత్రమే. 
మనుషులు వస్తారు. పోతారు. కానీ కాలాల తరబడి యశోదలు బృందావనంలో పుట్టుకొస్తూనే ఉంటారు. అదీ ఆ క్షేత్ర మహిమ!!



కామెంట్‌లు