సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము-292 వ రోజు
ద్వితీయాశ్వాసము
సంజయుడు అభిమన్యుని మరణ వార్త ధృతరాష్ట్రునికి చెప్పుట
ధృతతరాష్ట్రా ! ఆ ప్రకారం మూడవ రోజు యుద్ధంలో సంశక్తులు అర్జునుడిని తమతో యుద్ధానికి రమ్మని కవ్వించారు. అర్జునుడు వారితో యుద్ధముకు దిగాడు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. ధర్మరాజు అనుమతితో అభిమన్యుడు ఆ వ్యూహమును భేదించి వ్యూహమున ప్రవేశించి బృహద్బలుడు, లక్ష్మణకుమారుడు మొదలైన పెక్కుమందిని చంపి పద్మవ్యూహం నుండి బయటకు వచ్చు మార్గం తెలియక కౌరవుల చేతిలో మృతిచెందాడు. కురుసేనలో ఉత్సాహం పాండవసేనలో విషాదాన్ని నింపుతూ ద్రోణసారథ్యంలో మూడవ రోజు యుద్ధం ముగిసింది " అని సంజయుడు వివరించాడు. అభిమన్యుడు రణరంగమున మరణించాడు అన్న మాటవిన్న ధృతరాష్ట్రుడు ఎంతో పరితపించాడు. " సంజయా ! నా మనుమడు అమిత తేజశ్శాలి, సద్గుణసంపన్నుడు అయిన అభిమన్యుడు ఉగ్రమనస్కులైన యోధుల చేతిలో ఎలా మరణించాడు " అని సంజయుని అడిగాడు.
మూడవరోజు యుద్ధం
సంజయుడు " మహారాజా ! మూడవ రోజున ద్రోణుడు కురు సేనలను పద్మవ్యూహంలో నిలిపాడు. దానిని చక్రవ్యూహం అని కూడా అంటారు. వివిధ దేశాధీశులు పద్మవ్యూహముకు రేకులవలె నిలిచారు. వారి కుమారులంతా కేసరముల వలె నిలిచారు. కర్ణుడు, దుశ్శాసనుడు తమ తమ సేనలతో పద్మము యొక్క అంతర్భాగమున వారి మధ్య భాగమున సుయోధనుడు సేనలతో నిలిచాడు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవసుడు, శలుడు, శల్యుడు, నీ కుమారుడు, నీ మనుమలు తమతమ స్థానాలలో నిలిచారు. పాండవ సేనలో భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, చేకితాణుడు, క్షత్రధర్ముడు, క్షత్రవర్మ, ధృష్టకేతు, నకుల సహదేవులు, ఉత్తమౌజుడు, శిఖండి, యుధామన్యుడు, ఘతోత్కచుడు, విరాటరాజు, ద్రుపదుడు, ద్రౌపదీసుతులు, కేకయ రాజులు సంజయులు ఒక్కుమ్మడిగా ద్రోణునితో తల పడ్డారు. ద్రోణుడు వారి విజృంభణకు జంకక వారిపై వాడి అయిన బాణములు ప్రయోగించాడు. ద్రోణుని పరాక్రమానికి బెదిరి పాండవ వీరులు పారిపోసాగారు. వారిలో ఎవ్వరికీ ద్రోణుడు పన్నిన పద్మ వ్యూహంలో చొరపడడానికి సాధ్యం కాలేదు. ధర్మరాజు " పద్మవ్యూహములో ప్రవేశించడానికి అభిమన్యునికి తప్ప వేరెవరికి సాధ్యం కాదు " అని తలచి అభిమన్యుని వద్దకు వెళ్ళి " కుమారా ! పద్మవ్యూహమున ప్రవేశించుట నీకు, నీ తండ్రి అర్జునుడికి, శ్రీకృష్ణునికి తప్ప మరెవరికి సాధ్యం కాదు. మనలను నీ తండ్రి హేళన చేయకుండా ఉండాలంటే నీవు ఆ వ్యూహమును ఛేదించ వలెను " అన్నాడు. అభిమన్యుడు " తండ్రీ ! నాకు పద్మవ్యూహమున ప్రవేశించుట మాత్రమే తెలుసు. కనుక వ్యూహమున ప్రవేశించి కురుసేనను చీల్చి చెండాడుతాను. ధర్మరాజు " అది చాలు కుమారా ! నీవు త్రోవ చూపి వ్యూహమున ప్రవేశించిన వెంటనే మేమంతా నీ వెంట వస్తాము " అన్నాడు. భీముడు కూడా " కుమారా ! వ్యూహములో ప్రవేశించిన చాలు నీ వెంట నేను, ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు వచ్చి సేనలను మట్టు పెడతాము " అన్నాడు. అభిమన్యుడు " పెదనాన గారూ ! మీరు ఇలా అడుగ వచ్చునా పద్మ వ్యూహమును రచించిన ద్రోణుడు మెచ్చగా నేను వ్యూహమున ప్రవేశించి శత్రు నిర్మూలన గావించి ధర్మరాజు మాట నిలిపి నా తల్లి తండ్రులకు నా ప్రావీణ్యము ప్రదర్శిస్తాను. ఇంత చిన్నవాడు కురు సేనలను చెండాడుతున్నాడని నా మేనమామ శ్రీకృష్ణుడు మెచ్చేలా కురుభూపతి అచ్చెరువందేలా నా తండ్రి సంతసించేలా రణభూమిలో వీరవిహారం చేస్తాను " అన్నాడు. ఆ మాటకు సంతసించిన ధర్మరాజు " కుమారా! నీ ధైర్యమూ, నీ శౌర్యమూ, నీ బలము, నీ కీర్తి వర్ధిల్లుగాక " అని దీవించాడు. అభిమన్యుడు సుమిత్రుడనే సారధితో రధమును ద్రోణుని వైపు పోనిమ్మని చెప్పాడు. సుమిత్రుడు " కుమారా ! నీవు బాలుడవు నీ ఎదుటున్నది ద్రోణుని సైన్యము. వారు అతిరధులు, మహారధులు, క్రూరాత్ములు కనుక నీ చేతిలో మరణించు వారు కాదు. కనుక వ్యూహమున ప్రవేశించే ముందు ఆలోచించు " అన్నాడు. అభిమన్యుడు నవ్వి " సుమిత్రా ! దేవేంద్రుడే దేవగణముతో వచ్చినా, తన భూతగణముతో రుద్రుడే భూతగణముతో వచ్చినా, నా తండ్రి వచ్చినా, నా మేనమామ శ్రీకృష్ణుడే నాతో యుద్ధానికి వచ్చినా నన్ను యుద్ధమున గెలువ లేరు సందేహం వదిలి రథమును ద్రోణుని మీదికి పోనిమ్ము " అన్నాడు. సందేహం వీడకున్ననూ సుమిత్రుడు రధమును ద్రోణుని వైపు పోనిచ్చాడు. అది చూసి కురు సేన ఒక్కసారిగా అభిమన్యుని ఎదుర్కొన్నది సమరం సంకులు మైంది. అయినా అభిమన్యుడు మెరుపు మెరిసినట్లు కురు సేనలను ఛేధిస్తూ వ్యూహంలో ప్రవేశించాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు