సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!


 ధర్మరాజు అభిమన్యుని మరణవిధానము వివరించుట:307 వ రోజు
అభిమన్యుని మరణం తలచుకుని పరి పరి విధముల రోదిస్తున్న అర్జునుడితో " అర్జునా ! నీవు సంశప్తకులతో యుద్ధం చేయడానికి వెళ్ళావు కదా ! ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. మేము ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయాము. కనుక నేను అభిమన్యుని వద్దకు వెళ్ళి " కుమారా ! వ్యూహమున ప్రవేశించుట మాకెవరికి తెలియదు ముందు నీవు మార్గము చూపుతూ ప్రవేశించిన మేము నిన్ను అనుసరించి వస్తాము " అని చెప్పాను. అందుకు అభిమన్యుడు అంగీకరించి వెంటనే తన రథముతో పద్మవ్యూహమున ప్రవేశించి కౌరవ సేనను చీల్చి చెండాడుతున్నాడు. మేము కూడా అతడిని అనుసరిస్తూ ముందుకు ఉరికాము. కాని సైంధవుడు ఈశ్వరవర ప్రభావమున మమ్ము అడ్డుకున్నాడు. మేము అతడిని అనుసరించ లేక పోయాము. అభిమన్యుడు అత్యంత పరాక్రమంతో అరివీర భయంకరుడై కౌరవ సేనను ఎదిరించి చీల్చి చెండాడి కర్ణాది వీరులను భయభ్రాంతులను చేసాడు. ద్రోణుడు, కర్ణుడు, కృతవర్మ, అశ్వత్థామ, కృపాచార్యుడు మొదలైన కురువీరులు ఒక్కుమ్మడిగా అభిమన్యుని ఎదుర్కొన్నారు అయినా వెరువక అభిమన్యుడు లక్ష్మణకుమారుని, బృహద్బలుడు మొదలైన రాజకుమారులను హతమార్చాడు. వారు తన రథం విరుగ కొట్టగా అభిమన్యుడు గదాయుధముతో వారితో తలపడ్డాడు. దుశ్శాసన కుమారుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరయుద్ధం చేస్తూ క్రింద పడి గదాఘాతాలకు ప్రాణాలు వదిలారు. అలా అభిమన్యుడు తన తల్లి తండ్రుల మేనమామల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తూ వీరస్వర్గం అధిష్టించి అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు " అన్నాడు.
అర్జునిని ప్రతిజ్ఞ
తన కుమారుని మరణించిన విధానం తెలుసుకున్న అర్జునుడు మనస్సు వికలమై మూర్చపోయాడు. శ్రీకృష్ణుడు యుధిష్టరుడు అర్జునుడికి ఉపచారములు చేసారు. మూర్ఛ నుండి తేరుకున్న అర్జునుడు కోపంతో ఊగిపోతూ ముఖం అంతా ఎర్రబడగా " అందరూ వినండి ఇదే నా ప్రతిజ్ఞ. సైంధవుని రేపు సూర్యాస్తమయం లోపు చంపుతాను. ఆ సైంధవుడు నిన్ను శరణు వేడినా శ్రీకృష్ణుని శరణు వేడినా కడకు నన్నే శరణు వేడినా యుద్ధ భూమి నుండి పారిపోతే తప్ప అతడిని వదలను. సైధవుని రక్షించుటకు కౌరవసేన ఏకమై నా మీద అస్త్రశస్త్రములు ప్రయోగించినా వాడిని వదలను. నేను ఈ ప్రతిజ్ఞ తప్పిన ఎడల గురుద్రోహం, బ్రహ్మహత్య, మద్యపానము మొదలగు ఘోర పాపములు చేసిన వాడను ఔతాను. దేవతలు, కింపురుషులు, రాక్షసులు వాడికి రక్షణగా వచ్చినా నేను వాడిని వదలను. లేని ఎడల అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుయంటాను " అని ప్రతిజ్ఞ చేసాడు. వెంటనే తన గాండీవం తెచ్చి పూజాదికములు నిర్వహించాడు. నారి సారించాడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. పాండవ సైన్యములో తూర్యనాదములు మిన్నుముట్టాయి. సైనికులు సింహనాదములు చేస్తున్నారు. అర్జునుడి అక్షయ తుణీరంలోని అస్త్రశస్త్రాలు వీరావేశంతో నృత్యం చేసాయి. పక్కనే ఉన్న భీమసేనుడు అర్జునుడితో " అర్జునా ! నీ వెంట నేను ఉన్నాను. విజృంభించు సైంధవుని త్రుంచు. దేవదత్తము, పాంచజన్య ఘోషలు విని కౌరవ వీరుల గుండెలు పగులుతాయి ఇది తథ్యం " అని అన్నాడు.
కామెంట్‌లు