వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
113. భావనాగమ్యా (పన్చాక్షరీ)
114. భవారణ్యకుఠారికా (అష్టాక్షరీ)
నూట పదునాల్గవ నామ మంత్రము:
ఓం భవారణ్యకుఠారికాయై నమః
భవ = సంసారము, అరణ్యము = దట్టమైన అడవి; కుఠారికా = గండ్రగొడ్డలిని ధరించినది.
సంసారము అనబడే అరణ్యములో ఉన్న అనేక విధాలైన బంధనాలను తొలగించడానికి, భక్తులైన తన సాధకులను కాపాడటానికి, దట్టమైన సంసారము లో ఉన్న అడ్డంకులను తొలగించడానికి, గండ్రగొడ్డలిని ధరించివచ్చిన శ్రీమాత ను చూచి వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "భవారణ్యకుఠారికా" అని కీర్తించారు. ఈ విధంగా మన రక్షణ కొసం వచ్చిన పరమేశ్వరి కి నమస్కారము.
అరణ్యము లో, చెట్లు / మహావృక్షాలు దట్టంగా, ఏపుగా పెరిగి, అనేక విధాలైన లతలు అల్లుకొని ఉంటాయి. కౄరమృగాలు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటాయి. అలాగే, సంసారము అనే అరణ్యం లో కూడా, కౄరమైన కొండచిలువలవంటి "జననమరణాలు"; ప్రేమ, మోహము, బంధము అనే దట్టమైన లతలు చుట్టుకుని; అజ్ఞాన అంధకారము వంటి కారు చీకట్లలో; అరిడ్వర్గములు అనే భయంకరమైన కౄరమృగాల చేత చుట్టముట్టి మనిషి యొక్క మనసును పట్టి పీడిస్తుంటే, అప్పుడు సద్గురువు అనుగ్రహం తో సాధనా మార్గంలో ఉన్న తన సాధకులను రక్షించడానికి, మనల్ని ఆవరించిన అన్ని అవలక్షణాలను పరశురామ ప్రీతి చెయడానికి, గొడ్డలితో వచ్చిన శ్రీమాత "భవారణ్యకుఠారికా" అయ్యింది.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే ||
ఈ చరాచర జగత్తులో ఒకసారి ప్రాణం పోసుకున్న జీవునికి జనన మరణ చక్రబంధం తప్పించుకోలేనిది. ఈ ప్రపంచంలోకి వచ్చాక, మోహ బంధాలు, అరిషడ్వర్గాలతో బాధింపబడటం, నేను, నాది, నా వారు, వారి బాగోగులు అనే పాశం లో ఇరుక్కుపోయి, అజ్ఞానంలో కొట్టుకు పోవడం, వీటి వేటినుంచి కూడా తప్పించుకోలేము, అని శంకర భగవత్పాదుల మాట.
అజ్ఞానంతో కూడిన ఈ సంసారము అనే కీకరారణ్యం నుండి బయటపడే దారి దొరకాలి అంటే, పరమేశ్వరి కరుణ మన పైన ప్రసరించాలి. తన కరుణను మనపై కురిపించడానికి శ్రీమహారాజ్ఞి తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలి ద్వారా జ్ఞాన సంపదను పంచుతోంది. తన సాధకులకు, ఈ సంసార బంధాల నుండి స్వేచ్ఛ కలిపిస్తోంది.
ఈ భయంకరమైన భవారణ్యమును , సంసార అరణ్యమును దాటడానికి, త్రికరణశుద్ధిగా పరమేశ్వరి నామ జపం చేయడమే మార్గము. ఈ సాధనా మార్గంలో ఉన్న సాధకుడు "సత్వగుణం"తో ఉండాలి. నిరంతరంగా సాగే సాధనతో ఆ తల్లి సాక్షాత్కారము కుదురుతుంది. అప్పుడు సాధకుడు, మోక్షమార్గాన్ని అందుకుంటాడు. పునర్జన్మ రహితుడు అవుతాడు. జనన మరణ చక్రబంధం నుండి బయటపడతాడు. ఇది సాధనలో తాదాత్మ్యత చెందిన సాధకునకు మాత్రమే సాధ్యపడుతుంది.
ఇంతటి కఠోరమైన సాధనా మార్గాన్ని ఎంచుకుని, మోక్ష మార్గములో తనను చేరుకోవాలి అని పరితపిస్తున్న తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం భవారణ్యకుఠారికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి