శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - - 147
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
125. శర్మదాయినీ (పంచాక్షరీ)
126. శాంకరీ (త్ర్యక్షరీ)
నూట ఇరవైఆరవ నామ మంత్రము:
ఓం శాంకర్యై నమః
శాంకరీ = శంకరుని భార్య; సుఖమును చేతిలో ఉంచుకున్న శంకరుని సతి.
శంకలను / అనుమానాలను దూరం చేసి, సుఖమును సంతోషాలను ఇచ్చేవాడు శంకరుడు. అన్ని సుఖాలనూ తన చేతిలోనే ఉంచుకున్న శంకరుని భార్యగా ఉండి, శంకరుని చేతిలోని సంతోషాలన్నీ తన సాధకులకు అందించడానికి ఎదురు చూస్తూ కనబడిన, శంభుని పత్నిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, జగన్మాతను "శాంకరీ" అని కీర్తించారు. స్వ, పర భేదాలు లేకుండా తన సాధకులకు అందరికీ సంతోషాలను పంచే "శాంకరీ" గా ఉన్న శ్రీచక్రరాజసింహాసనేశ్వరికి నమస్కారము.
కాళికాపురాణం లో చెప్పబడినట్లు, దక్షునికి కూతురు గా పుట్టిన నేను, ప్రతిసృష్టి చేయవలసిన సమయంలో, ఆది మధ్య అంతము లలో నిర్విచారముగా, చేయవలసిన తన పనిని వదిలి పిచ్చి వానిలాగా తిరుగుతున్న సదాశివుని వెన్నంటి తిరుగుతూ ఉంటాను. అప్పుడు దేవతా సమూహమంతా నన్ను, "విష్ణుమాయ అని, యోగనిద్ర అని, జగన్మయి, రుద్రాణి, శాంకరీ" అని స్తోత్రము చేస్తూంటారు, అని పరమేశ్వరి స్వయంగా చెప్పింది.
*మనం యోగ సాధనలో ఉన్నప్పుడు, "ఓం" కారాన్ని చెప్తాము. ఈ "ఓం" బీజాక్షరములో విశ్వేశ్వరుడు అయిన సదాశివుడు ఉంటాడు. ఈ "ఓం" కారమును చెపుతున్నప్పుడు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాము. ఈ ఆనందానుభూతియే, "శం" అనే బీజాక్షరము. "కరుడు" అంటే, కలిగించేవాడు. "శంకరుడు" అంటే "ఆనందాన్ని కలిగించే వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అనే అరిషడ్వర్గాలను అరి కట్టాలి అంటే, మనలో "శమము" / ఇంద్రియ నిగ్రహము ఉండాలి. ఈ ఇంద్రియ నిగ్రహంను ఇచ్చేవాడు"శంకరుడు".  
ఈ విధంగా తన పతి, సర్వలోకాధినాథుని ద్వారా, పరమేశ్వరి అయిన తానే ఇంద్రియ నిగ్రహము ను ప్రసాదిస్తాను అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం శాంకర్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు