పిరికి దయ్యం : - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212


 ఒకూర్లో ఇద్దరు అన్నదమ్ములు వుండేటోళ్ళు. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ కలసిమెలసి వుండేటోళ్ళు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయినాయి. పిల్లలూ పుట్టినారు. చిన్నోడి పెండ్లాం బిడ్డలేమో చానా మంచోళ్ళు. ఎప్పుడూ నాన్నను పన్నెత్తి ప్రశ్నించేటోళ్ళు కాదు. కన్నెత్తి చూసేటోళ్ళు గాదు. ఏది చెబితే అది... ఇట్లా చెప్పడం ఆలస్యం అట్లా వురుక్కుంటా చేసేటోళ్ళు. కానీ పెద్దోని పెండ్లాం మాత్రం పెద్ద గయ్యాళిది. ఎప్పుడూ మొగునితోనూ, మరిదితోనూ, తోడికోడలితోనూ ఏదో ఒకదానికి ఊకూకెనే కొట్లాట పెట్టుకొనేది. నోటికొచ్చినట్టల్లా తిట్టేది. దాంతో చిన్నోడు లాభం లేదనుకోని పెండ్లాం బిడ్డలతో కలసి వేరు కాపురం పెట్టాలనుకున్నాడు. కానీ అట్లా పోయేటప్పుడు ఇంట్లోంచి ఒక్క సామాను గూడా తీసుకోని పోకుండా పెద్దోని పెండ్లాం అడ్డం పడింది. ఆమె నోటికి భయపడి పెద్దోడు గూడా కిమ్మనకుండా కుక్కిన పేను లెక్క వుండిపోయినాడు. దాంతో చిన్నోడు కట్టుబట్టలతో చేతిలో పైసా గూడా లేకుండా బైటపడినాడు.
బతకాలంటే ఏదో ఒక పని చేసి పైసలు సంపాదించాల గదా. దాంతో పెండ్లాం బిడ్డలను తీసుకోని పక్కనే వున్న పెద్ద అడవిలోనికి బైలుదేరినాడు. అడవిలో పోతావుంటే ఒకచోట ఒక పెద్ద మర్రిచెట్టు కనబడింది. దాని కింద వాళ్ళని కూచోబెట్టి పెండ్లాంతో “నేను పోయి చుట్టుపక్కల ఏవయినా మంచి చెట్లేమన్నా వున్నాయేమో చూసొస్తా. అంతలోపు నువ్వు అన్నం వండు" అన్నాడు. ఆమె సరేనని వెంటనే మూడు రాళ్ళు తీసుకోనొచ్చి పైన మూకుడు పెట్టి కింద మంట వెలిగించింది. చిన్నోడు చుట్టుపక్కల అంతా వెదికి ఒక చెట్టు కనబడితే దాన్ని నరికి ముక్కలు చేసి మరలా మర్రిచెట్టు దగ్గరికి వచ్చినాడు.
ఆ మర్రిచెట్టుపైన ఒక దయ్యం వుంది. అది ఉత్త పిరికిది. ఎవరైనా గట్టిగా ఒక్కరుపు అరిస్తే చాలు గజగజలాడిపోతాది. అది వీళ్ళని చూసి భయపడి చిటారు కొమ్మకు చేరి దాక్కోని చూడసాగింది. చిన్నోడు చెట్టు కింద కూర్చోని కొడుకుతో “రేయ్... పోయి అక్కడ కట్టెలన్నీ తీసుకోనొచ్చి చిన్న చిన్న తుంటలు చేయి" అన్నాడు. వెంటనే వాడు “అట్లాగే నాయనా" అని వురుక్కుంటా పోయి కట్టెలన్నీ తీసుకోనొచ్చి చిన్న చిన్న ముక్కలుగా నరకసాగినాడు.
చిన్నోడు కూతురికేసి తిరిగి “పాపా... ఆ కట్టెల పైనున్న నార తీసి పక్కన పెట్టు. మంచి మంచి తాళ్ళు పేనుతాను" అన్నాడు. దానికా పాప “ఎందుకు నాన్నా తాళ్ళు" అనడిగింది. దానికి వాడు “చెట్టు మీద ఒకడున్నాడులే... వాన్ని కట్టి తీసుకుపోడానికి... ఐనా నీకెందుకే అవన్నీ... నోర్మూసుకోని చెప్పిన పని చెయ్యక" అన్నాడు నవ్వుతా. వెంటనే ఆ పాప వురుక్కుంటా పోయి గబగబా నార తీసి అందించసాగింది. అది చూసి దయ్యం అదిరిపడింది.
"ఓరి నాయనోయ్... వీడు తాళ్ళు పేనుతా వున్నది నా కోసమేనా... అదీగాక వీడు ఏం చెప్తే అది పెండ్లాం బిడ్డలు నోరెత్తకుండా చేస్తా వున్నారంటే వీడు మామూలోడు గాదు. ఎట్లాగో ఒకట్లా వీన్ని మంచి చేసుకోవాల. లేకుంటే కష్టం" అనుకోని ఆ తెలివిలేని దయ్యం గజగజగజ వణుక్కుంటా కిందికి దిగింది.
దయ్యాన్ని చూసి అందరూ అదిరిపోయినారు. కానీ అది గజగజా వణికి పోతావుంది గదా. అది చూసి చిన్నోడు ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. దయ్యం వణికిపోతా చేతులు కట్టుకోని "అయ్యా... నేను నీకేం అపకారం చేసినాను. నా చెట్టు కింద కూచున్నారు. వంట చేసుకున్నారు. అన్నం తిన్నారు. కట్టెలు కొట్టుకున్నారు. నేనేమన్నా అన్నానా, గమ్మున మూసుకోని వున్నా గదా. ఐనా నన్ను కట్టెయ్యడానికి తాళ్ళు పేనుతా వున్నారు. ఇది న్యాయమేనా" అనింది.
దాంతో చిన్నోనికి విషయమంతా అర్థమైంది. తానేదో తమాషాగా అంటే ఇది నిజమనుకోనింది అనుకోని “ఏయ్... దొరక్క దొరక్క దొరికినావు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. కట్టి ఊర్లో పెద్దోళ్ళ దగ్గరికి తీసుకోని పోతే అందరూ మెచ్చుకోని తలా ఇంత వేసుకోని పెద్ద బహుమతే ఇస్తారు" అంటూ మరింత బెదిరించినాడు.
దానికా దయ్యం మరింతగా వణికిపోతా "వద్దొద్దు... అంతపని చెయ్యొద్దు. ఐనా వాళ్ళెంత ఇస్తారు. మహా అయితే పదివేలో ఇరవైవేలో ఇస్తారు... అంతే గదా... అదే నన్ను గనుక ఏమీ చెయ్యకపోతే ఈ మర్రి చెట్టు కింద ఏడు మూటల బంగారముంది. అందులో సగమిస్తా. కానీ మరలా ఎప్పుడూ ఇటువైపు రాగూడదు. సరేనా" అనింది. దానికి వాడు సరే అన్నాడు. దాంతో దయ్యం పోయి మూడున్నర మూటల బంగారం తీసుకోనొచ్చి వాని ముందు కుప్ప పోసింది. వాడు సంబరంగా ఆ బంగారమంతా తీసుకోని ఊరు చేరుకున్నాడు. దాంతో పెద్ద ఇండ్లు కట్టుకోని, నలభై ఎకరాల నీళ్ళు పారే పొలం కొనుక్కోని, పదిమంది పనివాళ్ళను పెట్టుకోని హాయిగా సేద్యం చేసుకుంటా కాలం గడపసాగినాడు.
వాని వైభోగం చూసి వదినకు కన్ను కుట్టింది. ఇదేందబ్బా వీడు వూపుకుంటా వుత్త చేతులతో పోయి నెల తిరిగేసరికల్లా పెద్ద జమీందారులెక్క తయారయినాడు. ఇందులో ఏదో కతుంటాది. కనుక్కోవాల" అనుకోని మొగున్ని పంపిచ్చింది. పెద్దోడొచ్చి అడిగేసరికి తమ్ముడు జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించినాడు.
తరువాత రోజు పెద్దోడు పెండ్లాం బిడ్డలను తీసుకోని అడవికి బైలుదేరినాడు. మర్రిచెట్టు పైనున్న దయ్యం వీన్ని చూసింది. “అరే... మరలా ఎవడో ఈ చెట్టు కిందకే వస్తా వున్నాడే... ఎందుకైనా మంచిది దాచి పెట్టుకోవాల" అనుకోని చిటారు కొమ్మకు చేరుకోనింది. వీడు సక్కగా ఆ మర్రిచెట్టు కిందికే చేరుకున్నాడు. నెమ్మదిగా తలెత్తి జాగ్రత్తగా పైకి చూసినాడు. చిటారు కొమ్మన దయ్యం కనబడింది. “ఆహా... తమ్ముడు చెప్పింది నిజమే... ఈ రోజు నా పంట పండినట్లే" అనుకున్నాడు.
పెద్దోడు పెండ్లాంకేసి తిరిగి "నేను పోయి యాడన్నా మంచి చెట్టుందేమో చూసొస్తా... అంతలోపు నువ్వు అన్నం చేసి పెట్టు" అన్నాడు. దానికామె "ఏందీ... ఈ అడవిలో అన్నం చేసి పెట్టాల్నా... భలే చెప్పినావులే... నువ్వే యాడయినా పండ్లో కాయలో వుంటే చూసి తెంపుకోనిరా... ఈ పూటకు అవే తిందాం" అనింది. వాడు పెండ్లాన్ని ఏమీ అనలేక పోయి ఒక మాంచి చెట్టు చూసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి మరలా మర్రిచెట్టు కిందకి వచ్చినాడు. వచ్చి కొడుకుతో “రేయ్... నీవు పోయి ఆ కట్టెలన్నీ తీసుకోనొచ్చి ఈడ కుప్పేయి" అన్నాడు. దానికి వాడు "ఏంది... నేను పోయి కట్టెలు తీసుకోని రావాల్నా... ఇంకేం పనిలేదా నాకు. పో... పోయి నువ్వే తెచ్చుకోపో... నేను ఆడుకోవాల" అంటూ రయ్యిమని ఆన్నించి వెళ్ళిపోయినాడు. చేసేదేమీ లేక పెద్దోడే ఆ కట్టెలన్నీ చెట్టు కిందికి మోసుకోనొచ్చినాడు.
ఆడుకుంటా వున్న కూతురితో "పాపా...పో...పోయి వాటికి నార తీయి. తాళ్ళు పేనుతా" అన్నాడు. దానికా పాప “అబ్బబ్బబ్బ... ఎప్పుడు చూడు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని ఒకటే విసిగిస్తా వుంటావు. ఏం నీకు చేతగాదా... పో... పోయి నువ్వే చేసుకో. నేను ఉయ్యాలాట ఆడుకోవాల" అంటూ వెళ్ళిపోయింది.
దాంతో వాడే ఆ కట్టెల నారంతా తీసి మంచి తాడు ఒకటి పేని పైకి చూస్తా “ఏయ్ దయ్యం ... మర్యాదగా కిందకొచ్చి నాకు మూడున్నర మూటల బంగారమిస్తావా... లేక నిన్ను ఈ తాడుతో కట్టి ఊర్లోకి తీసుకోని పోయి అందరి ముందు కిందామీదా యేసి తన్నాల్నా" అని గట్టిగా అరచినాడు.
ఆ మాటలింటానే పైనున్న దయ్యానికి తిక్క లేసింది. సర్రున కిందకొచ్చి "ఏంరా... వచ్చినప్పటి నుంచీ చూస్తా వున్నా... పెండ్లాం బిడ్డల్నే సరిగా పెట్టుకోలేనోనివి... నువ్వు నన్ను తంతావా... ఏదీ తన్ను చూద్దాం" అంటూ ఒక లావు కట్టె తీసుకోని దొరికినోళ్ళని దొరికినట్లు కిందామీదా యేసి బాగా తన్ని పంపిచ్చింది.
**********
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం