అక్షర తోరణాలు: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


మామిడి తోరణాలు —
ముంగిట మంగళ శోభను పరచే పచ్చని ఆశలు;
పువ్వుల తోరణాలు —
పరిమళాలతో పండుగలకు స్వాగతం పలికే ప్రేమలహరులు॥

అరుణ తోరణాలు —
ఆకాశాన ఉదయరాగాలను అల్లే సూర్యకిరణాలు;
అక్షర తోరణాలు —
అంతరంగాల గుమ్మాలకు ఆనందాలను అలంకరించే కవితామాలలు॥

మల్లెల తోరణాలు —
మనసులను మత్తెక్కించే మాధుర్య గంధాలు;
మమతల తోరణాలు —
మనుషుల మధ్య బంధాలను బలపరిచే బంగారు వంతెనలు॥

చిరునవ్వుల తోరణాలు —
చీకట్ల గుమ్మాలను వెలుగులతో నింపే వెన్నెలలు;
చిరు పలుకుల తోరణాలు —
చిరకాల స్నేహాలకు చిరునామాలయ్యే ముత్యాల సరాలు॥

కలల తోరణాలు —
కనురెప్పల గడపపై కాంతులను కురిపించే ఇంద్రధనుస్సులు;
కవితా తోరణాలు —
కాలపు గుండెలపై కళాత్మకంగా నిలిచే అక్షర శిల్పాలు॥

ప్రేమ తోరణాలు —
ప్రాణాల గుమ్మానికి పరిమళాలు పూయించే పుష్పహారాలు;
ప్రణయ తోరణాలు —
ప్రతి హృదయాన్ని స్వర్గసీమగా మార్చే మధురానుభూతులు॥

తెలుగు తోరణాలు —
తేనెలొలికే తల్లి భాషకు తిలకమయ్యే అక్షరవల్లులు;
సాహిత్య తోరణాలు —
సంస్కృతికి సిరిసంపదలు చేకూర్చే సరస్వతీ హారాలు॥

జీవిత తోరణాలు —
జ్ఞాపకాల జాజులతో జతకట్టిన అనుభవాల దండలు;
అనుబంధ తోరణాలు —
ఆత్మలను ఒక్కటిగా అల్లే అపురూప అనురాగమాలలు॥

తోరణమంటే —
తలుపుకు కట్టిన అలంకారం మాత్రమే కాదు;
హృదయ గుమ్మాలకు వేలాడదీసిన
ఆనందాల ఆహ్వానపత్రం॥

అక్షర తోరణమంటే —
పదాల పంక్తులను పేర్చడం మాత్రమే కాదు;
పాఠకుల హృదయ గుమ్మాన
కవి కట్టిన శాశ్వత స్వాగత తోరణం॥

కామెంట్‌లు