హాలో పిల్లలూ! నేను అవిసె గింజలతో అమ్మాయిని తయారు చేశాను. అమ్మాయి కాదులే కొంచెం వయసు ఎక్కువున్న మహిళా రైతు. ఇందులో శనగపప్పు, పెసరగింజలు, వడ్లు, కాఫీ పొడి ఇంకా చాలా ఉపయోగించాను. నాకు ఆనందకరమైన విషయమేమంటే పెసర్లు, వడ్లు, శనగలు మా పొలంలో పండినవి. అందుకే గుర్తుగా బొమ్మగా రూపొందించాలనుకున్నాను. అవిసె గింజలు మాత్రం కొనుక్కొచ్చినవి. అవిసె చెట్టు ‘లినేసి’ కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం “లైనమ్ ఉసితాటిస్సిమమ్” (Linium usitatissimum) వీటిని ఇంగ్లీషులో ప్లాక్స్ అనీ లినిడ్స్ అనీ పిలుస్తారు. తెలుగులో రకరకాల పేర్లున్నాయి. మదన గింజలు, ఉలుసులు, అతశి అనే పేర్లున్నాయి. చల్లని ప్రాంతాల్లో పెరిగే ఆహార పీచు పంట. దీని నార చాలా బలంగా ఉంటుంది. కాండం నుంచి నారను తీసుకుంటారు. వస్త్రాల కోసం ప్రత్తి నుంచి నారను తీసినట్లుగా అవిసె నుంచి కూడా నారను తీస్తారు. పూర్వ కాలాల్లోని నారబట్టలు అంటే ఇలా తయారు చేసినవే. ఇప్పుడు ఈ చెట్ల నుంచి కాగితం తయారవుతుంది. ప్రాచీన కాలంలో చైనా, ఈజిప్టు లలో అవిసెను సాగు చేస్తారు. అతి పురాతనమైన గుహల్లో కూడా అవిసె నారలు దొరికినట్లుగా ఆధారాలున్నాయి. గుహల్లో అవిసె పూల చిత్రాలను గీసినట్లు తెలుస్తున్నది.
మహిళా రైతు బొమ్మకు నేను అవిసె గింజల చీరను నేశాను. శనగ గింజల రవికను కుట్టాను. తలకు జుట్టుకు కాఫీ పొడిని పూశాను. కొప్పు కోసం శనగ పప్పును పెట్టాను. చీర కొంగును ఫ్యాషన్ గా తళుకులతో కుట్టాను. మా పొలం వడ్లుతో అంచును అందంగా చేశాను. ఇలా తయారైన మహిళారైతు పొలంలో వడ్లను నూరుస్తోంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి