ఏవి ఆనాటి వేసవి సెలవుల మాధుర్యం: - -ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ -(పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా

 

వేసవి శెలవులు వస్తున్నాయంటే
విజయనగరం దాసన్న పేటలో
విశాలమైన నాలుగిళ్ళ లోగిలిలో
వాసు తాతయ్య ఇంటికి అమ్మతో కలసి
ఆరుగురు సంతానం వెళ్ళడం
విజయవాడలో రైల్వేలో పనిచేస్తున్న
నాన్న పొగబండి ఎక్కిస్తే కిటికీ సీట్ కోసం
పెద్దన్నయ్య, వరలక్ష్మి తో పొట్లాడితే
అమ్మ నాలుగు నడ్డిమీద చరచి కూర్చోబెట్టడం
గోదావరిలో పదిపైసలు బిళ్ళలు
అరుగురిచేత అమ్మ వేయించడం
స్టేషన్ నుంచి జట్కాబండి మీద 
రాజుగారి కోటమీదుగా దాసన్న పేట వెళ్ళడం
అమ్మమ్మ  విమలత్తచే మా అందరికి దిష్టి తీయించడం
ఆప్యాయంగా అందరిని తీసుకుని ముద్దాడడం
మామయ్య ఐదుగురు పిల్లలు మేము
పెరట్లో మామిడి కాయలు, సఫోట, పళ్ళు కోయడం
అమ్మమ్మ పులిహారలోకి పొత్తిలాగు వేసుకు నన్ను కరివేపాకు కోయమనడం
కోతి కొమ్మచ్చెలు గవ్వలాటలు
మాతో రాత్రిపూట అమ్మమ్మ వైకుంఠ పాళి ఆడటం
పాము మింగితే కోపం ఎడ్వటం
నిచ్చెన ఎక్కితే సంతోషం పరమపద సోపానం చేరితే  కలిగిన ఆనందం
అగ్రహరపు వీధిలో ఐదురోజుల పెళ్ళిళ్ళు
తాటాకు పందిరిలు
రాజ్యలక్ష్మి హాలులో చూసిన పరమానందయ్య శిష్యులకథ
రక్త సంబంధం సినిమాచూసి అమ్మమ్మ, అమ్మ, అత్తయ్య ఎడ్వటం
బొంకుల దిబ్బ దగ్గర సాయబు మాయాజాలం
అయ్యకొనేరు గట్టు దగ్గర ఆంజనేయస్వామిగుడి
మూడులాంతర్ల దగ్గర పైడిమాంబ దర్శనం
పదిపైసలకి పుల్ల ఐసుక్రీములు తినడం
సినిమా గాయని సుశీలత్తయ్య వచ్చిందని
అమ్మమ్మ వారి దగ్గర తీసుకెళితే ఆమె నమస్కరిస్తే
ఆశీర్వదించడం
ఎన్నో ఎన్నెన్నో బాల్యపు వేసవి శెలవుల మాధుర్యం
నేడో మూడేండ్ల వాడినుంచి పండు ముదుసలి వరకు చరవాణితో కాలక్షేపం
ఎవరికి వారే యమునా తీరే
అసలు బాల్యమా నీవెక్కడ
...........................

కామెంట్‌లు