ఈ మాటను మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం. తల్లిదండ్రులు కూడా ఇదే చెప్పారు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఉంటుందని వారికి తెలుసు.
అందుకే వారు తమ జీవితమంతా కుటుంబం కోసం శ్రమించారు. తమ కోరికలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెట్టారు. పిల్లలు మంచి చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, తమకంటే గొప్ప జీవితాన్ని గడపాలని కలలు కన్నారు.
కాలం మారింది. సంపాదన పెరిగింది. ఒకప్పుడు నెలంతా కష్టపడి సంపాదించినంత డబ్బు, ఇప్పుడు కొందరు కొద్ది రోజుల్లోనే సంపాదిస్తున్నారు.
అయినప్పటికీ జీవితం ప్రశాంతంగా మారిందా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు.
కారణం - ఉదయం నుంచి రాత్రి వరకు పని, ఒత్తిడి, లక్ష్యాలు, పోటీ... ఇదే జీవితంగా మారిపోయింది. ఎంత డబ్బు వచ్చినా సరిపోవడం లేదు.
ఖర్చులు ఆదాయాన్ని మించి పరుగులు తీస్తున్నాయి. ఒక అవసరం తీరకముందే మరో అవసరం ఎదుట నిలుస్తోంది. డబ్బు కోసం పరుగు పెరుగుతున్న కొద్దీ, మనశ్శాంతి మాత్రం వెనుకబడిపోతోంది.
అంతకంటే బాధ కలిగించే విషయం ఇంకొకటి. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లల కోసమే జీవిస్తారు. వాళ్ల అభిరుచులను గౌరవిస్తారు. వాళ్లు కోరుకున్నది ఇవ్వడానికి తమ సుఖాలను కూడా త్యాగం చేస్తారు. కానీ పిల్లలు పెద్దయ్యాక వారి ఆలోచనలు, వారి జీవనశైలి మారిపోతుంది. తల్లిదండ్రుల మాట వినకపోవడం, వారి భావాలను అర్థం చేసుకోలేకపోవడం చాలా కుటుంబాల్లో కనిపిస్తున్న వాస్తవం.
దీనివల్ల తల్లిదండ్రుల మనసులో చెప్పలేని బాధ పేరుకుపోతుంది.ఆ బాధ, ఆందోళన, నిరాశ క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు... ఇలాంటి ఎన్నో వ్యాధులకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణంగా మారుతోంది.
డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని కోల్పోయి, తర్వాత అదే ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి సంపాదించిన డబ్బంతా ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం ఎంతటి విషాదమో ఆలోచించాలి.
అయితే దీనికి పరిష్కారం ఏమిటి?
జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మనం నియంత్రించలేం. పిల్లలు ఎలా ఆలోచించాలి, ప్రపంచం ఎలా మారాలి, పరిస్థితులు ఎలా ఉండాలి అనేది మన చేతిలో ఉండదు. కానీ వాటిని ఎలా స్వీకరించాలి అనేది మాత్రం పూర్తిగా మన చేతిలో ఉంటుంది.
ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడడం, అవసరం లేని టెన్షన్‌ను దూరం పెట్టడం, ఉన్నదానిలో ఆనందాన్ని వెతకడం, ఆశలను తగ్గించి ఆత్మీయతను పెంచుకోవడం... ఇవే మనశ్శాంతికి నిజమైన మార్గాలు.
డబ్బు జీవితానికి అవసరం. కానీ డబ్బే జీవితం కాదు. ఆస్తి అవసరం. కానీ ఆస్తి కంటే ఆరోగ్యం గొప్పది. విజయాలు అవసరం. కానీ వాటన్నింటికంటే మనశ్శాంతి విలువైనది.
అందుకే కష్టపడాలి. సంపాదించాలి. పొదుపు కూడా చేయాలి. కానీ ఆ ప్రయాణంలో సంతోషాన్ని , ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, మనశ్శాంతిని కోల్పోకూడదు.
ఎందుకంటే చివరికి మనిషి జీవితాన్ని గొప్పదిగా నిలబెట్టేది అతను కూడబెట్టిన ఆస్తి కాదు... అతను పంచిన ప్రేమ, అతను నిలబెట్టుకున్న విలువలు, అతను కాపాడుకున్న మనశ్శాంతి. అదే నిజమైన సంపద.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి