సృష్టి వైవిధ్యం.: - డా.పివిఎల్ సుబ్బారావు.-: విజయనగరం.

 

సృష్టిలో ఏ రెండు చూసినా,
 కనీసము ఒక భేదము!
దైవం చేరే మార్గం భక్తి, 
నడవాలన్నా, నవవిధము!
దేహం  ఎన్నో భిన్నాంగాల,
 అద్భుతమైన, సంకలనము!
మానవ జీవన గమ్యం ,
చేరే దారులు, బహుముఖము! 
శరీర రక్తము ఎరుపే,
నాలుగు గ్రూపులు నిజమే ,
పివిఎల్!

ఒకే కలం వ్రాసే వ్రాతలు,
 నిత్యమూ పరివర్తనము!
అదే గళం పలికే స్వరాలు, 
మాధుర్యాన విభిన్నము!
ఆ సూర్యోదయ కిరణాలు, 
దశదిశలా విస్తారము! 
హృదయమదే భిన్నభావాల,
 నిరంతర సంచారము!
ధవళ కాంతి, హరివిల్లు,
సప్తవర్ణాల శోభితము, పివిఎల్! 

ఒకే పలక, దిద్దుతున్న ,
అక్షరాలు బహుభిన్నము! 
కలప అదే, ఊయల,
 కాటి కావడి ,ఎత్తు రూపము!
పసిడే మూలము ,వివిధ నగల,
  సుందరాకారము! 
మట్టే లోపల ఉందిరా,
 రంగైన బొమ్మల నిర్మాణము!
ఏకం సత్ విప్రా బహుధా వదన్తి,
ఋగ్వేద శ్లోకాంశ, పివిఎల్!
__________

కామెంట్‌లు