పుష్పాభిషేకం: - - యామిజాల జగదీశ్


 కృష్ణుడికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఏ సువాసన వాడికి ఇష్టం, ఏ పువ్వు వాడి తల మీద అందంగా ఉంటుంది,  ఇటువంటివన్నీ ఆచితూచి చేయడంలో ఆమెకు ఏ మాత్రం విసుగనేదే లేదు. 
ఆ రోజు కూడా యశోద వాకిట్లో కూర్చుని పూలను అల్లుతూ దండ కడుతోంది.
మల్లెలు, సన్నజాజులు అంటూ ఆమె ముందర కుప్పలుగా ఉన్నాయి.
కాస్సేపటికి కృష్ణుడు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు.
తనను ప్రతిరోజూ రకరకాలుగా అలంకారించి ఆనందపడే కృష్ణుడు తల్లిని పూజించాలనుకున్నాడో ఏమో?
ఒక పువ్వు తీసుకుని యశోద మీద వేశాడు.
ఆమె నవ్వింది.
ఇంకొక పువ్వు తీసుకుని వేశాడు. అప్పుడు యశోద "ఇవన్నీ నీకేరా......” అంది.
కృష్ణుడు యశోద మాటలు ఎప్పుడు విన్నాడు కనక ఇప్పుడు వింటాడని అనుకోవడానికి....
రెండు చేతులతో పూలను తీసి తొలుత యశోద ఒడిలో పోశాడు. తర్వాత భుజాల మీద వేశాడు. తర్వాత తల మీద వేశాడు. ముఖం మీద చల్లినట్లు చేశాడు.
చేతి నిండా పూలు పెట్టుకుని నవ్వుతున్న బిడ్డను యశోద కళ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది.
వాడు అసలు ఆగలేదు.
పువ్వులను ఆమె మీదనే పోస్తూనే ఉన్నాడు.
ఒడిలో ఉన్న పువ్వులన్నీ అయిపోయాయి. నేల మీద ఉన్న పూలను కూడా తీసుకుని వేశాడు.
యశోద తలమీదంతా పువ్వులే. భుజాల నిండా పువ్వులే. మరో మాటలో చెప్పాలంటే పూలవానలో తడిసింది యశోద. తననెప్పుడు సింగారించే తల్లి యశోదను ఈరోజు తాను అలంకరించాడు కేవలం పువ్వులతో. అంతా అయిపోయాక కృష్ణుడు చప్పట్లు కొట్టి నవ్వాడు.
యశోద కళ్లు చెమర్చాయి.
తాను కృష్ణుడిని అలంకరిస్తున్నానని అనుకుంది.
కానీ, ఈరోజు తల్లికి పూలవర్షం కురిపించి అందం చూస్తున్నది కృష్ణుడే.
తాను అల్లుతున్న పూలదండ కంటే, కృష్ణుడితో చేయించుకున్న ఈ పుష్పాభిషేక సన్నివేశం రసరమ్యంగా ఉందనుకుంది యశోద.
కామెంట్‌లు