"ప్రేమ దేవుడైన" మన్మధుడి దగ్గరే చెరకు, విల్లు, అయిదు రకాల పూలబాణాలు ఉంటాయి. కానీ కంచి కామాక్షి దగ్గరా చెరకు విల్లు ఉంటుంది. కారణం, ఇందులో ఓ సూక్ష్మం ఉంది.
ప్రేమ, పాశం ఎప్పుడూ ఓ నియంత్రణలో ఉండాలి అని హెచ్చరించడానికే మన్మధుడి వద్ద నుంచి అమ్మవారు చెరకు విల్లు తీసుకున్నారని "నడిచే దేవుడి"గా ప్రసిద్ధి చెందిన కంచి పరమాచార్య చెప్పారొకమారు. అంతేకాదు, మన్మధుడిని శివుడు దహించాక శక్తి కోరిక మేరకు మన్మధుడికి మళ్ళీ ప్రాణం పోయడం, రతి కళ్ళకు మాత్రమే తెలిసేటట్లుగా మార్చాడు.
అయినప్పటికీ మన్మధుడు ఎల్లలు మీరకుండా ఉండటానికి, ధర్మం తప్పక జీవించే ప్రజల కోరికలను తీర్చడానికి తన చేతిలో చెరకు పట్టుకున్నట్టు దర్శనమిస్తారు.
మన్మధుడి చెరకు విల్లు మోహాన్ని రెచ్చగొడుతుంది. కానీ కామాక్షి చేతిలో ఉన్న చెరకువిల్లు కామాన్ని అణచి ఆధ్యాత్మికత వైపు ఉన్నత స్థితిలోకి తీసుకుపోతుంది.
కంచి కామాక్షి అమ్మవారి ఆలయం మొదటి ప్రాకారం మధ్యలో ఉన్న గాయత్రి మండప కేంద్రంలో కామాక్షి తల్లి దర్శనమిస్తుంది. కామాక్షి అమ్మవారిని పద్మాసనంలో చూడవచ్చు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు తదితర అయిదు రకాల బ్రహ్మలను తనకు ఆసనంగా చేసుకున్న అమ్మవారు కంచి కామాక్షి.
కామాక్షి తల్లి తన నాలుగు చేతులలో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకువిల్లుని ఆయుధాలుగా ఉంటాయి.
కామాక్షికి రాజేశ్వరి, త్రిపురసుందరి, శ్రీచక్రనాయకి, కామేశ్వరి ఇలా పలు నామాలున్నాయి.
అమ్మవారి పీఠానికి తూర్పున శ్రీచక్రాన్ని ఉంచడం అన్ని ఆలయాలలో సంప్రదాయం. కానీ కంచిలో అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపచేయడంకోసం ఆదిశంకరులవారు దేవి ముందర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు.
కంచిలో ఉన్న ఏ శివాలయంలోనూ అమ్మవారికంటూ ప్రత్యేకించి ఓ సన్నిధి లేదు. కానీ కంచి కామాక్షి ఆలయమే అన్ని శివాలయాలకూ ఓ ప్రత్యేక సన్నిధిగా ఉంటోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి