గుర్తింపు: - - యామిజాల జగదీశ్


 మనం మన గురించి ఒక అభిప్రాయాన్ని మనసులో ఏర్పరచుకుంటాం  
మన విజయాలు, ఓటములు, తప్పులు, సాధించిన విజయాల ఆధారంగా మనల్ని మనం నిర్వచించుకుంటాం . . 
కానీ లోకం మనల్ని అలాగే చూడాల్సిన అవసరం లేదు.
ఒకరి జీవితంలో మనం చాలా సాధారణ వ్యక్తిని కలిసుండొచ్చు. చిన్న సాయం చేసి ఉండవచ్చు. ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పి ఉండవచ్చు. దాన్ని మనమే మరచిపోయి ఉండవచ్చు. కానీ అదే సంఘటన, ఇంకొకరి జీవిత బాటను మార్చిన మలుపు కావచ్చు.
గుర్తింపు వెనుక ఉన్న అత్యంత లోతైన మనస్తత్వశాస్త్రం ఇదే. 
మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనే దాని కంటే, ఇతరుల జీవితాల్లో మనం చూపిన ప్రభావమే కొన్నిసార్లు మన నిజమైన గుర్తింపుగా మారుతుంది.
జ్ఞాపకాలు
మనిషి మెదడు కంప్యూటర్ కాదు. అది జరిగిన ప్రతి దాన్నీ దాచి ఉంచలేదు. భావోద్వేగంతో ముడిపడి ఉన్న అనుభవాన్ని లోతుగా దాచుకుంటుంది.
ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులకు రెండు జ్ఞాపకాలను ఇస్తుంది.
ఒకరికి అది సాధారణ రోజు.
ఇంకొకరికి అది జీవితాంతం మరచిపోలేని క్షణం.
అందుకే కొన్ని ఏళ్ల తర్వాత కూడా చిన్న ప్రేమను తలుచుకుని కంటతడి పెడతారు. కొందరు పెద్ద సాయాన్ని కూడా సులువుగా మరచిపోతారు.
జ్ఞాపకం ఎంత లోతుగా ఉండాలనేది ఆ సంఘటన నిర్ణయించదు; ఆ సమయంలో మనం పొందిన భావోద్వేగమే నిర్ణయిస్తుంది.
కృతజ్ఞత
కృతజ్ఞత అనేది ఊరికే "థ్యాంక్స్" చెప్పే మర్యాద మాత్రమే కాదు.
నిజమైన కృతజ్ఞత అంటే,
"ఆ ఒక్క పని నన్ను వేరే మనిషిగా మార్చింది" అనే లోతైన భావన.
కృతజ్ఞత ఉన్న వ్యక్తులు గత కాలాన్ని భారంగా అనుకోరు. తమను తీర్చిదిద్దిన గురువుగా భావిస్తున్నారు.
ఈ మనస్తత్వం మనిషిలో వినయాన్ని, ప్రేమను, సంబంధాల విలువను పెంచుతుంది.
బంధాలను ఏర్పరిచేది రక్తసంబంధాలు కావు.
వాటిని తయారుచేసేది మనం కలిసి పొందిన అనుభవాలు.
మనల్ని అర్థం చేసుకున్న క్షణం…
మన లోపాలతో సహా ఒప్పుకున్న క్షణం...
మనంగా ఉన్నప్పుడు తోడుగా నిలబడిన ఒంటరి క్షణం...
ఇవే బంధాలకు బలమైన పునాదులు.
అందుకే కొన్ని రక్తసంబంధాలు దూరమైపోతాయి; కొందరు పరాయివాళ్లు జీవితాంతం తోడుండే బంధాలుగా మారతారు.
క్షమాపణ
క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదు.
ఆ తప్పును మనసులో మోస్తూ బ్రతకడానికి నిరాకరించడం.
కోపం, పగ తీర్చుకునే ఆలోచన, నిందలు మొదట గాయపరిచేది ఎదుటివారిని కాదు; వాటిని మోస్తూ బ్రతికే మనసునే.
క్షమాపణ అనేది ఇతరులకు ఇచ్చే కానుక కాదు; మనకు మేమే ఇచ్చుకునే విడుదల.
నేరభావన
గుర్తుకొచ్చి వేధించే తప్పు
నేరభావన అనేది కోర్టు ఇచ్చే శిక్ష కాదు.
మన మనస్సాక్షి ఇచ్చే నిశ్శబ్దమైన శిక్ష.
ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అయినా, మనసు దాన్ని అంగీకరించకపోతే మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చి మనల్ని వేధిస్తుంది.
మానసికంగా చూస్తే, నేరభావన శిక్ష వల్ల తగ్గిపోదు; అవగాహన, అంగీకారం, క్షమాపణల ద్వారా తగ్గుతుంది.
చెప్పుకోలేని భావాలు
మనుషులు ఎక్కువగా బాధపడేది మాట్లాడిన మాటల కోసం కాదు... మాట్లాడకుండా వదిలేసిన మాటల కోసమే.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను."
"నువ్వు చేసిన సాయం మరచిపోలేదు."
"క్షమించు."
ఈ మూడు వాక్యాలూ చెప్పకుండా బ్రతికిన మనుషుల మనసులోనే పెద్ద శూన్యం ఏర్పడుతుంది.
భావోద్వేగ భద్రత
ఒక మనిషి నిజంగా నవ్వడం, ఏడవడం, తన బలహీనతను బయటపెట్టడం ఎప్పుడు చేయగలడో తెలుసా?
తన్ను ఎవరూ తప్పుగా అంచనా వేయరు అని నమ్మిన క్షణంలో.
అదే భావోద్వేగ భద్రత.
ప్రేమ అంటే ఎటువంటి తీర్పులు చెప్పకుండా వినడం.
బంధం అంటే లోపాలను దిద్దే ముందు, మనిషిని ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించడం.
మరచిపోతారనే భయం
మనిషికి ఉండే అత్యంత లోతైన భయాల్లో ఒకటి మరణం కాదు.
గుర్తులేకుండా పోవడమే.
"నేను జీవించాన అనడానికి రుజువు ఎవరి మనసులోనైనా ఉందా?" అనే ప్రశ్న ప్రతి మనిషి లోపలి మనసులో దాగి ఉంటుంది.
అందుకే ఒకరు,
"నువ్వు నన్ను మరచిపోయినా, నేను నిన్ను మరచిపోలేదు."
అని చెప్పడం సాధారణ వాక్యం కాదు.
అది మనిషి ఉనికికి ఇచ్చే అతిపెద్ద గుర్తింపు.
ప్రేమలో అసమానత్వం 
అసమాన స్వభావం
ప్రతి బంధంలోనూ ప్రేమ పరిమాణం ఒకేలా ఉండదు.
ఒకరు ఆ బంధాన్ని జీవితానికి కేంద్రంగా అనుకోవచ్చు.
ఇంకొకరు దాన్ని ఒక అందమైన జ్ఞాపకంగా మాత్రమే ఉంచుకోవచ్చు.
చాలా బంధాల్లో ఉండే బాధ, అందం రెండూ ఇదే.
ఈ అసమానత్వాన్ని అంగీకరించడంలోనే నిజమైన పరిణతి ఉంది.
కామెంట్‌లు